చతుఃషష్టి కళల్లో స్వరవంచన ఒక కళ. వేదకాలం నాటి ఈ కళను భారతావనికి కరతలామలకం చేసి వందలాది శిష్య బృందా లను తీర్చిదిద్దిన ఘనుడు నేరేళ్ళ వేణు మాధవ్. ఆయన ఖ్యాతి విశ్వ విఖ్యాతమై ఐఖ్యరాజ్యసమితి వరకు ప్రాకింది. వేలస్వరాలను అలవోకగా పలికించే స్వరవిపంచి వేణుమాధవ్ విశిష్ట కంఠం మూగబోయింది! మిమిక్రీ ని ఒక పాఠ్యాంశంగా తీసుకొచ్చిన ఘనుడు ఆ స్వరవిజ్ఞాన శిఖరం ఒరిగిపోయింది. 

nerella venu madhav caste కోసం చిత్ర ఫలితం

‘‘మిమిక్రీ కళ నాతోనే పుట్టలేదు. పురాణాలనుంచే ఈ కళ ఉంది. గౌతమ మహర్షిని ఏమార్చడం కోసం ఇంద్రుడు కోడిలా కూశాడు. రామాయణంలో మాయలేడి గా మారీచుడు, రాముడి స్వరంతో హా! లక్ష్మణా! - హా! సీతా! అని ఆక్రోశించాడు.  ద్రౌపది గొంతును అనుకరించడం ద్వారా భీముడు నర్తనశాలలో కీచకుడిని చంపాడు. పురాణాల్లో దీన్ని "స్వరవంచన"
అని చెప్పారు ఒక సంధర్బంలో 

నేరెళ్ల వేణుమాధవ్‌


death of nerella venumadhav కోసం చిత్ర ఫలితం
స్వరవంచనను దీవించి, శాసించి, చివరి క్షణం వరకు శ్వాసించిన అపూర్వ కళాదిగ్గజం కనుమరుగైంది! విభిన్నమైన కళను విశ్వవ్యాప్తంచేసిన 'ధ్వనికళాతపశ్వీ ఇకలేరు! భూగోళంపైనున్న గళాలన్నీ అనుకరించి విసుగెత్తిపోయాడేమో, దేవలోకాల్లోని కంఠాల పనిపట్టేందుకన్నట్టు దివికేగాడు! దేశవిదేశాలతోపాటు ఐక్యరాజ్యసమితిలో భారత ఖ్యాతిని రెపరెపలాడించిన భారతమాత ముద్దుబిడ్డ. శబ్దప్రతిష్ఠుడు, మిమిక్రీ కళ వైతాళికుడు, విశ్వవిఖ్యాత ధ్వన్యనుకరణ సామ్రాట్ నేరెళ్ల వేణుమాధవ్ అస్తమించారు! వేలాది శిష్యులను, లక్షలాది మంది అభిమానులను దుఃఖసాగరంలో ముంచి, కానరాని లోకాలకు తరలిపోయారు!

పద్మశ్రీ, విశ్వవిఖ్యాత ధ్వన్యనుకరణ సామ్రాట్ డాక్టర్ నేరెళ్ల వేణుమాధవ్ (86) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ, మంగళవారం ఉదయం  అస్తమించారు. ఓరుగల్లు  పురవీధుల్లో మొదలైన ఆయన స్వరవిహారం విజయవిహారమై, ఇదే నగరం నుంచి విశ్వాంతరాళాల్లోకి పయనమైంది. వరంగల్‌లోని 'మట్టెవాడ' లో 1932 డిసెంబర్ 28న జన్మించిన నేరెళ్ల వేణుమాధవ్,  తన పదిహేనేళ్ళ వయసు నుంచి మరణానికి ముందు వరకు ద్వన్యనుకరణ కళ ప్రదర్శనల్లో మునిగితేలారు. 


కొద్దిరోజుల క్రితం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఆయనకు విశిష్ట పురస్కారం అందించి గౌరవించుకుంది. డాక్టర్ నేరెళ్లకు భార్య శోభావతి, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మిమిక్రీ కళారంగంలో ఎవరెస్టు శిఖరమంత ఎదిగినా ఏకశిలా నగరాన్ని ఆయన వీడి వెళ్లలేదు. కాళోజీ నారాయణ రావు, బుర్రా రాములు వలె తనూ ప్రపంచంలో ఎక్కడికెళ్లినా, ఎక్కడెక్కడ పర్యటించినా వరంగల్‌ తో తనబంధాన్ని శాశ్వతం చేసుకున్నారు. తను ఎదిగిన, తన ఎదుగుదలకు కారణమైన వరంగల్‌ ను తుదిశ్వాస వరకు ఆయన విడిచిపెట్టలేదు.
death of nerella venumadhav కోసం చిత్ర ఫలితం
ఆయన మరణవార్త తెలియగానే ఓరుగల్లు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనైంది. కొన్ని రోజులుగా డాక్టర్ నేరెళ్ల శ్వాసకోశ సంభందమైన సమస్యతో బాధపడుతున్నారు. మంగళ వారం తెల్లవారుజామున నగరంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ నుంచి ఆయన కోరిక మేరకు స్వగృహానికి తీసుకొచ్చారు. మంగళవారం ఉదయం 10.30కు ఆయన తుదిశ్వాస విడిచారు. 

నేరెళ్ల మృతి వార్త తెలియగానే తెలంగాణా సభాపతి సిరికొండ మధుసూదనాచారి, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎంపీలు డాక్టర్ బండా ప్రకాశ్, సీతారాంనాయక్, నగర మేయర్ నన్నపునేని నరేందర్, జడ్పీ చైర్‌పర్సన్ గద్దల పద్మ, సీఎం ఓఎస్డీ, ప్రముఖ కవి, గాయకుడు దేశపతి శ్రీనివాస్, చీఫ్-విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, డాక్టర్ టీ రాజయ్య, శంకర్‌నాయక్ సహా పలువురు ప్రజాప్రతినిధులు, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు బొల్లం సంపత్‌కుమార్, కే వాసుదేవరెడ్డి, టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కళ్లపల్లి రవీందర్‌రావు,
death of nerella venumadhav కోసం చిత్ర ఫలితం
మాజీ మేయర్ స్వర్ణ సహా పలువురు ప్రజాప్రతినిధులు, స్థానికులు, బంధువులు నగరంలోని కొత్తవాడలోని నేరెళ్ల స్వగృహానికి వెళ్లి నివాళులర్పించారు. మిమిక్రీ, నాటక, కళారంగప్రముఖులు, సాహితీవేత్తలు అనేకమంది నేరెళ్ల భౌతికకాయానికి పూలమాలలువేసి జోహార్ల ర్పించారు.


డాక్టర్ నేరెళ్ల వేణుమాధవ్ పార్థివ దేహానికి వరంగల్ నగరంలోని ఆటోనగర్ శ్మశానవాటికలో మంగళవారం సాయంత్రం అధికారికలాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. నేరెళ్ల సతీమణి శోభావతి, కొడుకులు శ్రీనాథ్, రాధాకృష్ణ, కూతుళ్లు వాసంతి, లక్ష్మీతులసి సహా కుటుంబ సభ్యులు, బంధువులు, కళాకారులు, సాహితీవేత్తలు వేల సంఖ్య లో కొత్తవాడ నుంచి ఆటోనగర్ శ్మశానవాటిక దాకా అంతిమయాత్రలో పాల్గొన్నారు. మిమిక్రీ  శ్రీనివాస్ సహా నేరెళ్ల శిష్యకోటి కన్నీరుమున్నీరుగా విలపిస్తూ ఆయన జ్ఞాపకాల ను నెమరువేసుకుంటూ అంతిమయాత్రలో పాల్గొన్నారు.
death of nerella venumadhav కోసం చిత్ర ఫలితం
నేరెళ్ల మృతిపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి: ధ్వన్యనుకరణ సమ్రాట్ డాక్టర్ నేరెళ్ల వేణుమాధవ్ మరణంపట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మిమిక్రీ కళకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు, గౌరవం తెచ్చిపెట్టిన వ్యక్తిగా ఆయన చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారంటూ నివాళులర్పించారు. మిమిక్రీకళను పాఠ్యాంశంగా, అధ్యయనాంశంగా మలిచి, మిమిక్రీకళకు పితామహుడిగా పేరొందారని పేర్కొన్నారు. ఆయన మృతి కళారంగానికి తీరని లోటని అభివర్ణించారు. నేరెళ్ల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వేణుమాధవ్ అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సీఎం కేసీఆర్ ఆదేశించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: