రాజ్య‌స‌భ డిప్యూటీ చైర్మ‌న్ ఎన్నిక‌లతో టీఆర్ఎస్ అధినేత‌, తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌, వైసీపీ అధినేత జ‌గ‌న్‌లిద్ద‌రూ ఇర‌కాటంలో ప‌డిపోయారు. ముందు నుయ్యి.. వెన‌క గొయ్యిలా త‌యారైంది వీరి ప‌రిస్థితి. సార్వ‌త్రిక ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ రాజ్య‌స‌భ డిప్యూటీ చైర్మ‌న్ ఎన్నిక‌లు వీరికి అగ్నిప‌రీక్ష‌గా మార‌బోతున్నాయి. నిజంగా.. బీజేపీకి కూడా లేనంత టెన్ష‌న్ అటు కేసీఆర్‌లో, ఇటు  జ‌గ‌న్‌లో మొద‌లైంది. ఎందుకంటే.. రాజ్య‌స‌భ డిప్యూటీ చైర్మ‌న్ ఎన్నిక‌ల్లో బీజేపీ, టీఆర్ఎస్‌, వైసీపీల ఓట్లు అత్యంత కీల‌కంగా ఉండ‌బోతున్నాయి. 
Image result for trs
అయితే ఇందులో బీజేడీ నేత న‌వీన్‌ప‌ట్నాయ‌క్ మాత్రం దాదాపుగా క్లియ‌ర్‌గానే ఉన్నారు. ఆయ‌న బీజేపీకి మ‌ద్ద‌తు ఇచ్చే అవ‌కాశం లేనే లేదు. ఇక మిగిలింది కేసీఆర్‌, జ‌గ‌న్‌లిద్ద‌రే. ఇదే స‌మ‌యంలో ఈ ముగ్గురిని కూడా త‌మ‌వైపు తిప్పుకునేందుకు క‌మ‌ల‌నాథులు అన్ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. రాజ్య‌స‌భ‌లో మొత్తం 245 మంది స‌భ్యులు ఉన్నారు. మ్యాజిక్ ఫిగ‌ర్ 122. బీజేపీకి సొంతంగా 69 మంది ఎంపీలు ఉన్నారు. ఇక మిత్ర‌ప‌క్షాలు, స్వ‌తంత్రులు, నామినేటెడ్ ఎంపీలు, త‌మిళ‌నాడుకు చెందిన అన్నాడీఎంకేకు చెందిన 13మంది ఎన్డీయేకి మ‌ద్ద‌తు తెలిపితే మొత్తం 111ఓట్లు వ‌స్తాయి. 
Image result for tdp
విప‌క్షం వ‌ద్ద టీడీపీకి చెందిన ఆరుగురు స‌భ్యుల‌తో క‌లిపి మొత్తం 117 ఓట్లు ఉన్నాయి. వీటికి బీజేడీ(9), టీఆర్ఎస్‌(6), వైసీపీ(2)ల ఓట్లు తోడైతే 134కు చేరుతుంది సంఖ్య‌. ఈ నేప‌థ్యంలోనే త‌ట‌స్థంగా ఉన్న ఈ మూడు పార్టీల ఓట్లే అత్యంత కీల‌కంగా మారుతున్నాయి. ఈ నేప‌థ్యంలోనే వీటి మ‌ద్ద‌తు కోసం అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్‌, తృణ‌మూల్ కాంగ్రెస్ త‌దిత‌రుల‌తో కూడిన విప‌క్షం ప్ర‌య‌త్నం చేస్తున్నాయి. రాజ్య‌స‌భ డిప్యూటీ చైర్మ‌న్‌ను కేవ‌లం రాజ్య‌స‌భ స‌భ్యులే ఎన్నుకుంటార‌నే విష‌యం తెలిసిందే.


2017లో జ‌రిగిన రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్, వైసీపీ, బీజేడీలు బీజేపీకి మ‌ద్ద‌తు తెలిపాయి. ఉప రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లోనూ టీఆర్ఎస్, వైసీపీలు బీజేపీకి మ‌ద్ద‌తు తెలుప‌గా.. బీజేడీ కాంగ్రెస్‌కు మ‌ద్ద‌తు తెలిపిన విష‌యం తెలిసిందే. అయితే ప్ర‌స్తుతం ఉన్న రాజ‌కీయ ప‌రిణామాలు అప్ప‌టి ప‌రిస్థితుల‌కు భిన్నంగా ఉన్నాయి. కాంగ్రెస్‌, బీజేపీల‌కు ప్ర‌త్యామ్నాయంగా ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తాన‌ని ఇప్ప‌టికే కేసీఆర్ ప్ర‌క‌టించారు. అంతేగాకుండా.. బ‌య్యారంలో ఉక్కుప‌రిశ్ర‌మ ఏర్పాటు సాధ్యం కాద‌ని కేంద్రం ప్ర‌క‌టించింది. 

మ‌రోవైపు ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌ని బీజేపీతో జ‌గ‌న్ అంట‌కాగుతున్నార‌న్న విమ‌ర్శ‌లు ఇప్ప‌టికే ఉన్నాయి. అలాగే క‌డ‌ప‌లో ఉక్కుప‌రిశ్ర‌మ ఏర్పాటు సాధ్యం కాద‌ని కేంద్రం తేల్చి చెప్పింది. ఈ నేప‌థ్యంలో రాజ్య‌స‌భ డిప్యూటీ చైర్మ‌న్ ఎన్నిక‌ల్లో బీజేపీకి మ‌ద్ద‌తు ఇస్తే రాష్ట్రాల్లో తీవ్ర ఇబ్బందులు త‌ప్ప‌వు. కాగా, ప్ర‌స్తుత డిప్యూటీ చైర్మ‌న్ పీజే కురియ‌న్ జూలై 2న ప‌ద‌వీవిర‌మ‌ణ చేయ‌నున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: