కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు  అశోక్ గజపతిరాజును టీడీపీలో సైడ్ చేసేస్తున్నారా ?  పార్టీలో అయనకు ప్రాధాన్యత లేకుండా చేస్తున్నారా ? జరుగుతున్న పరిణామాలు చూస్తే అదే నిజమనిపిస్తోంది. వచ్చే ఎన్నికలలో అశోక్ కి టిక్కెట్ రాకుండా  పెద్ద‌ వ్యూహమేదో  తెర వెనక జరుగుతోందనిపిస్తోంది. మూడు నెలల క్రితం అశోక్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి మాజీ అయిపోయారు. వచ్చే ఎన్నికలలో పోటీపై మాత్రం క్లారిటీ రావడంలేదు. 


తాను ఎంపీగా....కుమార్తె ఎమ్మెల్యేగా ?
తాను ఎంపీగా, కుమార్తె అదితి గజపతిరాజు ఎమ్మెల్యేగా వచ్చే ఎన్నికలలో పోటీ చేయాలనుకుంటున్నారు. అయితే అధినాయకత్వం రెండు టిక్కెట్లు ఇస్తుందా అన్నది సందేహంగా వుంది. అసలు వచ్చే ఎన్నికలలో అశోక్ కుటుంబానికి అవకాశం వుంటుందా అని కూడా చర్చ సాగుతోంది. బాబుకు అశోక్ కు బయటకు కనిపించని విభేదాలు ఉన్న సంగతి బహిరంగ రహస్యమే. కేంద్ర మంత్రిగా  మోడీకే జవాబుదారుగా వ్యవహరించారే తప్ప త‌న‌కు టీడీపీకి రాజకీయ ప్రయోజనాలు సమకూర్చలేదన్న బాధ చంద్ర‌బాబులో వుందంటారు. మోడీ మెచ్చి మరీ అశోక్ ని తన క్యాబినెట్ లో తీసుకున్న సంగతిని కూడా ఇక్కడ ప్రస్తావించుకోవాలి. 


బొబ్బిలి రాజులను ప్రోత్సహిస్తున్న వైనం
ఉప్పు, నిప్పులా వుండే విజయనగరం, బొబ్బిలి రాజులు ఇద్దరూ ఇపుడు టీడీపీలోనే వున్నారు. బొబ్బిలి ఫిరాయింపు ఎమ్మెల్యే సుజయ క్రిష్ణ రంగారావుకు మంత్రి పదవి కూడా దక్కింది. దాంతో టీడీపీ రాజకీయం కాస్తా అశోక్ బంగ్లా నుంచి బొబ్బిలి సంస్థానానికి మారిపోయింది. కేంద్ర మంత్రి అయిన తరువాత అశోక్ పట్టు స్థానికంగా జారిపోయింది. కుల సమీకరణలు ముందుకొచ్చేసాయి. ఈ పరిణామాల నేపధ్యంలో అశోక్ పూర్వపు పట్టు కోల్పోయారనే చెప్పాలి. విజయనగరం ఎమ్మెల్యేగా ఇపుడు కాపు సామజిక వర్గానికి చెందిన మీసాల గీత పనిచేస్తున్నారు. అమెను కాదని అశోక్ కూతురుకు టిక్కెట్ వ‌చ్చే అవ‌కాశం దాదాపు లేద‌నే చెప్పాలి. ఒకవేళ గీత కాకపోయినా అదే సామాజిక వర్గం నుండి మ‌రో  అభ్యర్ధిని పెట్టవచ్చు. అంటే ఓ విధంగా అశోక్ నుచి గత ఎన్నికలలోనే విజయనగ‌రం జారిపోయిందన్న మాట.


ఎంపీ టిక్కెట్ హుళక్కేనా ?
వ‌చ్చే ఎన్నిక‌ల్లో సీనియర్లను తప్పించి జూనియర్లకు, బీసీలకు పెద్ద పీట వేయాలని బాబు తలపోస్తున్నట్లు టాక్. అదే కనుక జరిగితే ఈసారి ఎంపీ టిక్కెట్ కూడా రాజు గారి చేతిలో నుంచి  జారి పోతుందన్న మాటే. త‌న‌తో పొసగని వారిని ఇలా సైడ్ చేసేయడం చంద్ర‌బాబుకు మొద‌టి నుండి ఉన్న‌ అలవాటే. మరి దీనికి రాజు ఎలా రెయాక్ట్ అవుతారో చూడాలి.

Image result for ashok gajapathi raju

వంశమే పెద్ద పదవి 
విజయనగరం సంస్థానాధీశుడు పూసపాటి అశోక్ గజపతిరాజు కి అసలైన పదవి వంశ గౌరవమే. ఆయన తండ్రి పీవీజీ రాజు  కాంగ్రెస్ పార్టీలో గౌరవనీయమైన పాత్ర పోషించారు. ఆయన ఇద్దరు కొడుకులూ యాంటీ కాంగ్రెస్ స్లోగన్ అందుకున్నారు. జనతా తరఫున తొలిసారి నిలబడి అశోక్ గజపతిరాజు విజయనగరం ఎమ్మెల్యేగా  1978లో గెలిచారు. అక్క‌డి నుండి ఆ మధ్యన 2004లో వైఎస్సార్ ప్రభంజనంలో ఒక్క‌సారి త‌ప్ప మిగిలిన ఎన్నిక‌ల్లో ఓటమి అనేది లేకుండా గెలుస్తూనే వున్నారు. 


టిక్కెట్ ఇవ్వకపోతే రిటైర్మెంటే !
టీడీపీ నుంచి వచ్చే ఎన్నికలలో టిక్కెట్ ఇవ్వకపోతే రాజకీయ పదవీ విరమణ చేయడానికే అశోక్ మొగ్గు చూపుతారని అంటున్నారు. ఒక దశలో బీజేపీలో చేరుతారని టాక్ నడచినా ఇప్పడైతే ఆ ఆలోచన లేదంటున్నారు. మొత్తం మీద చూసుకుంటే అశోక్ తోనే పూసపాటి వారి రాజకీయ జీవితానికి శుభం కార్డ్ పడేలా  వుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: