గురు బ్రహ్మా..గురు విష్ణు, గురు దేవో మహేశ్వర..అన్నారు పెద్దలు.   మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ తల్లిదండ్రుల తర్వాత మూడో దైవం గురువే. విద్యాబుద్దులు నేర్పే గురువుకి అంతటి గొప్ప స్థానం ఇచ్చారు మన పూర్వీకులు. తల్లిదండ్రులు పిల్లకు జన్మనిస్తే..ఆ జన్మకు దశాదిశా నేర్పించేది గురువు.  తమకు విద్యాబుద్ధులు, మంచి నడవడిక నేర్పించే ఉపాధ్యాయుడిని పిల్లలు ప్రేమిస్తారు. తమ తల్లిదండ్రుల లాగా భావించి గౌరవిస్తారు.   తాజాగా తమిళనాడులో ఓ గురువుకి..విద్యార్థులకు జరిగిన సంఘటన ఎంత కఠిన హృదయాలనైనా కన్నిరు పెట్టిస్తుంది.   

తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా వెలియాగరంలో ఉన్న గవర్నమెంట్ హైస్కూల్ లో 28 ఏళ్ల జి. భగవాన్ ఇంగ్లిష్ టీచర్ గా పనిచేస్తున్నారు. ఆయనను తిరుత్తణి సమీపంలోని అరుంగులం ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు బదిలీ చేశారు అధికారులు. సాధారణంగా స్కూల్లో ప్రతి విద్యార్థికి కొంత మంది గురువులంటే విపరీతమైన కోపం ఉంటుంది..ప్రతిరోజూ ఏదో ఒక విధంగా ఇబ్బంది పెడతారని..ఈ సార్ లేకుండా బాగుండురా నాయనా..లేక ఏదైనా అనారోగ్యంతో కొంత కాలం లీవ్ తీసుకుంటే బాగుండే అని అనుకుంటారు. 

కానీ  తిరువళ్లూరు జిల్లా వెలియాగరంలో ఉన్న గవర్నమెంట్ హైస్కూల్  విద్యార్థులు మాత్రం తమ ఇంగ్లీష్ మాస్టార్ బదలీపై వెళ్తుంటే.. తమను విడిచి వెళ్లొద్దని ఆయనను కాళ్లావేళ్లా పడి బతిమాలారు. కన్నీరు పెట్టుకున్నారు. మానవహారంగా నిలబడి అడ్డుకోబోయారు. ఒక విద్యార్థి అయితే ఉద్వేగంతో ఆయనను వెనక నుంచి గట్టిగా కౌగిలించుకొని విడిచిపెట్టేదే లేదని విలపించాడు.  అంతే కాదు తమ ప్రాణానికి  ప్రాణమైన మాస్టార్ బదిలీ ఆపకుంటే అసలు స్కూల్ కే రాం..స్కూల్ ముందు ధర్నా చేస్తామన్న పరిస్థితికి వచ్చింది. 

ఇలాంటివి తెరపై చూస్తే మాత్రం ప్రేక్షకులు కన్నీరు మున్నీరు అవుతారు.   తల్లిదండ్రులు సైతం తమ పిల్లలకు మద్దతు తెలిపారు. ఎందుకంటారా ఆ టీచర్ అందరి టీచర్ల లాగానే నాలుగు రాళ్ళూ వెనకేసుకుందామని పనిచేయలేదు. విద్యార్థులకు నాలుగు పాఠాలు, ఏవో నీతిసూత్రాలు చెప్పేసి గంట కొట్టగానే ఇంటికేల్లిపోవడం తన విధి అనుకోలేదు.పాఠ్యాంశాలతో సంబంధం లేకుండా వారికి ఆధునిక ప్రపంచం గురించి వివరించాడు.

కొత్తకొత్త పద్ధతుల్లో ఆసక్తికర బోధన చేశాడు.  విద్యార్థులను తన సొంత తమ్ముళ్లలా, చెల్లెళ్లలా భావించాడు. అందుకే విద్యార్థులు అతణ్ని టీచర్ అని కాకుండా తమ స్నేహితుడిగా, సోదరుడిగా భావించారు. అతడు బదిలీపై వెళ్తోంటే కన్నీరుమున్నీరై అడ్డుపడ్డారు.   తమిళ మీడియాలో ప్రముఖంగా వచ్చిన ఈ వార్త అధికారులను సైతం కదిలించింది. భగవాన్ బదిలీ ఉత్తర్వులను 10 రోజుల పాటు నిలిపేశారు. ఆయనను ఎక్కడ నియమించేది త్వరలోనే నిర్ణయిస్తామని ప్రకటించారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: