దానం నాగేంద‌ర్‌... తెలంగాణ కాంగ్రెస్‌లో మంచి ఫామ్‌లో ఉన్న నాయ‌కుడు. వైఎస్ హ‌యాంలో భారీ ఎత్తున చ‌క్రం తిప్పిన నేత‌గా గుర్తింపు పొందారు. ఖైర‌తాబాద్‌లో పీజేఆర్ త‌ర్వాత సీనియ‌ర్ నాయ‌కుడైన దాన‌మే చ‌క్రం తిప్పారు. హైద‌రాబాద్ న‌గ‌ర కాంగ్రెస్ అధ్య‌క్షుడిగా ఆయ‌న యూత్‌ను పార్టీకి చేరువ చేశారు. అలాంటి నాయ‌కుడు గ‌త రెండేళ్లుగా పార్టీలో త‌న‌కు గుర్తింపు లేకుండా పోయింద‌నే అసంతృప్తితో ఉన్నారు. పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉంటున్నారు. హైద‌రాబాద్ న‌గ‌ర పాల‌క సంస్థ ఎన్నిక‌లు జ‌రిగిన స‌మయంలోనూ ఆయ‌న యాక్టివ్‌గా పాల్గొన‌లేదు. ఫ‌లితంగా కాంగ్రెస్‌కు తీవ్ర‌మైన దెబ్బ‌త‌గిలింది. 


కార్మిక నాయ‌కుడిగా మాస్‌లో మంచి పేరు తెచ్చుకున్న దానం.. అప్ప‌టి ఎన్నిక‌ల్లో అల‌క వ‌హించారు. ఇక‌, అప్ప‌టి నుంచి ఆయ‌న టీఆర్ ఎస్‌లోకి వెళ్తున్నారంటూ పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగింది. అయితే, సీనియ‌ర్లు ఆయ‌న‌ను బుజ్జ‌గిస్తూ వ‌స్తున్నారు. దీంతో ఆయ‌న మౌనంగానే ఉండిపోయారు. కానీ, ఎన్నిక‌లు స‌మీపిస్తుండ‌డం, కాంగ్రెస్‌కు ఆశించిన మైలేజీ రాక‌పోవ‌డం, వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ గెలుస్తుంద‌నే ధీమా లేక‌పోవ‌డంతో దానం హ‌ఠాత్తుగా త‌న కాంగ్రెస్ స‌భ్య‌త్వానికి రాజీనామా స‌మ‌ర్పించి సంచ‌ల‌నం సృష్టించారు.  ఈ మేరకు ఏఐసీసీ చీఫ్‌ రాహుల్‌ గాంధీ, తెలంగాణ పరిశీలకుడు అశోక్‌ గెహ్లాట్‌, పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిలకు లేఖలు రాశారు. పార్టీలో బడుగులు, బీసీలకు అన్యాయం జరుగుతోందన్న కారణంగానే వెళ్లిపోతున్నట్లు దానం లేఖలో పేర్కొన్నట్లు తెలిసింది. 

Image result for trs

కాగా, ఇటీవలే సంస్థాగత పదవుల భర్తీలో సిటీ కాంగ్రెస్‌ ప్రెసిడెంట్‌ పదవిని కోల్పోయినప్పటి నుంచీ దానం అసంతృప్తితో రగిలిపోతున్నట్లు స‌మాచారం. అందుకే రాజీనామా చేసినట్లు ఆయన వర్గీయులు పేర్కొన్నారు. రాజీనామా వార్తలు ప్రసారమైన కొద్దిసేపటికే టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌.. దానం ఇంటికి వెళ్లి, సముదాయించే ప్రయత్నం చేశారు. అయినా దానం ఉత్త‌మ్ మాట‌ల‌ను బుట్ట‌దాఖ‌లు చేశారు. ఇక‌, రేపో మాపో ఆయ‌న టీఆర్ ఎస్‌లోకి జంప్ చేస్తారనే వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. గ‌త కొన్నాళ్లుగా దానం కు టీఆర్ ఎస్ వ‌ల విసురుతోంది. 


యూత్‌లో మంచి ఫాలోయింగ్‌, ఖైర‌తాబాద్ స‌హా హైద‌రాబాద్‌పై మంచి ప‌ట్టున్న నాయ‌కుడు కావ‌డంతో ఇక్క‌డి ఓట్ల‌ను సునాయాసంగా బుట్ట‌లో వేసుకోవ‌చ్చ‌నేది కేసీఆర్ ఆలోచ‌న‌. దీంతో దానంకు  భారీ ఆఫర్ ప్ర‌క‌టించార‌ని తెలుస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో  సికింద్రాబాద్‌ ఎంపీ టికెట్‌ను దానం కే కేటాయించాల‌ని టీఆర్ ఎస్ నిర్ణయించ‌డం, కుదిరితే న‌గ‌ర బాధ్య‌త‌ల‌ను కూడా అప్ప‌గించాల‌ని చూడ‌డం ఆయ‌న‌ను టెంప్ట్ చేసింద‌ని అంటున్నారు.  ఇవి కాకుండా ఆయ‌న కోరిన వారికి రెండు టికెట్లు ఇచ్చేందుకు కూడా కేసీఆర్ సిద్ధంగా ఉన్నార‌ని అంటున్నారు. ఈ నేప‌థ్యంలోనే దానం కాంగ్రెస్‌కు రాం రాం చెప్పాడ‌ని తెలుస్తోంది. మ‌రి రాబోయే రోజుల్లో ఏం జ‌రుగుతుందో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: