క‌డ‌ప జిల్లాలో వైసీపీ హ‌వాను సాధ్య‌మైనంత మేర‌కు త‌గ్గించాల‌ని ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇప్ప‌టికే ఆయన ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌తో దూసుకుపోతున్నారు. ముఖ్యంగా బీటెక్ ర‌వి, సీఎం ర‌మేష్ వంటి నాయ‌కుల‌కు కీల‌క ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టి.. దూసుకుపోయేలా చేస్తున్నారు. ఎన్నిక‌ల స‌మ‌యానికి ఇక్క‌డ టీడీపీ సైకిల్ ప‌రుగులు పెట్టేలా కూడా చంద్ర‌బాబు వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నారు. ఇదిలావుంటే, మ‌రోప‌క్క‌, వైసీపీలోనే సొంత‌పార్టీ నేత‌లు పార్టీ ఎదుగుద‌ల‌కు గండి కొడుతున్నారు. 


వ‌చ్చేఎన్నిక‌ల్లో టికెట్ల‌పై ఆశ‌లు పెట్టుకున్న కొంద‌రు నాయ‌కులు.. ఇప్పుడు పార్టీకి వెన్నుపోటు పొడిచేందుకు రెడీ అయ్యారు. విష‌యంలోకి వెళ్తే.. జిల్లాలోని అధిగ భాగం వైసీపీ హ‌వానే క‌నిపిస్తోంది. రాయ‌చోటి నుంచి జ‌గ‌న్‌కు అత్యంత స‌న్నిహితుడు అయిన గ‌డికోట శ్రీకాంత్ రెడ్డి గ‌త ఎన్నిక‌ల్లో గెలుపొందారు. అప్ప‌ట్లో ఈయ‌న‌కు వెన్నుద‌న్నుగా నిలిచి పార్టీ అభివృద్ధికి కృషి చేసిన చాలా మంది నేత‌లు ఇప్పుడు ఓ వ‌ర్గంగా ఏర్ప‌డ‌డం గ‌మ‌నార్హం. 2019 సార్వత్రిక ఎన్నికల్లో రాయచోటి నియోజకవర్గ స్థానం నుంచి తాను పోటీలో ఉంటానని రాయచోటి వైసీపీ నియోజకవర్గ నేత మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి ప్ర‌తి ఒక్క‌రికీ చెబుతున్నారు. 


రాంప్రసాద్‌రెడ్డి ఇటీవ‌ల నియోజ‌క‌వ‌ర్గంలో ప‌రామ‌ర్శ‌లు, ప‌ర్య‌ట‌నల పేరుతో కార్య‌క‌ర్త‌ల‌కు ద‌గ్గ‌ర అవుతున్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ప్రజలు మూడవ వ్యక్తి కోసం అన్వేషిస్తున్నారని, తాను 2019 ఎన్నికల్లో తప్పకుండా పోటీలో ఉంటానని, ఏ నాయకుడికి సపోర్టు చేయనని తెలిపారు. నిజానికి ఈ ప‌రిణామం.. గ‌డికోట హ‌వాకు బీట‌లు తెచ్చేదేనంటున్నారు ప‌రిశీల‌కులు. గ‌త ఎన్నిక‌ల్లో 96 వేల పైచిలుకు ఓట్లు తెచ్చుకున్న గ‌డికోట‌కు గ‌త కొంత‌కాలంగా వైసీపీలో ఆశించిన ఆద‌ర‌ణ ల‌భించ‌డం లేదు. 


దీనికితోడు ఇప్ప‌టికే రెండు సార్లు ఆయ‌న‌కు టీడీపీ నుంచి ఆఫ‌ర్ వ‌చ్చింది. అయితే, జ‌గ‌న్‌కు వీరాభిమాని అయిన గ‌డికోట‌.. పార్టీ మారే ప్ర‌స‌క్తిలేద‌ని తేల్చిచెప్పారు. కానీ, ఈయ‌న ప్లేస్‌పై క‌న్నేసిన మండిప‌ల్లి రాంప్ర‌సాద్ రెడ్డి గ‌త కొన్నాళ్లుగా వ‌ర్గ‌పోరుకు సిద్ధ‌మ‌య్యారు. ఇక్క‌డ అబివృద్ధి ఏమీ జ‌ర‌గ‌డం లేద‌ని సొంత‌పార్టీ ఎమ్మెల్యేపైనే విమ‌ర్శ‌లు చేస్తున్నారు. దీనికి కొన‌సాగింపుగా తాజాగా ఆయ‌న వెల్ల‌డించిన విష‌యాలు మ‌రింత సంచ‌ల‌నంగా మారాయి. మ‌రి ఏంజ‌రుగుతుందో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: