ఈ మద్య కొంత మంది నేతలు తమ స్వామిభక్తి అతిగా ప్రదర్శించి అభాసు పాలు అవుతున్నారు.  తాజాగా మధ్యప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ కమల్ నాథ్ పట్ల స్వామి భక్తిని ప్రదర్శించారు ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హిమాచల్ ప్రదేశ్ మాజీ గవర్నర్, కాంగ్రెస్ నేత ఊర్మిళ సింగ్ ఇటీవల మరణించారు.

ఈ నేపథ్యంలో, ఆమెకు కమల్ నాథ్ నివాళి అర్పించారు. అనంతరం ఆయన కాళ్లకు ఎమ్మెల్యే రజ్నీష్ సింగ్ బూట్లు తొడిగారు. వీడియోలో స్వయంగా ఆయనే షూలేస్ కడుతున్నట్టు కనిపిస్తోంది. దీనిపై సర్వత్రా విస్మయం వ్యక్తమైనప్పటికీ... తమ పార్టీ అధ్యక్షుడి పట్ల గౌరవ సూచకంగానే తాను ఇలా చేసినట్టు ఎమ్మెల్యే చెప్పడం గమనార్హం.   

అయితే ఇది కాస్తా వివాదంగా మారడంతో రజ్నీష్‌ వివరణ ఇచ్చుకున్నారు. దీనిపై ఆయన మాట్లాడుతూ...‘ కమల్‌నాథ్‌ నాకు తండ్రి లాంటి వారు. నేను ఆయన్ని ఎంతగానో గౌరవిస్తాను. నా చిన్నతనం నుంచి ఆయన కాళ్లు మొక్కి ఆయన వద్ద ఆశీర్వాదాలు తీసుకుంటాను. ఆయన మా కుటుంబానికి ఎంతో కావల్సిన వ్యక్తి. ముఖ్యంగా మానాన్నతో ఎంతో సన్నిహితంగా ఉంటారు.

కానీ దీన్ని కొందరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఇందులో వివాదం ఏంలేదు. కమల్‌ నాథ్‌కు నేను లేస్‌ కట్టేటపుడు ఎంతో మంది ఉన్నారు. షూ లేస్‌ కట్టుకోవడానికి ఆయన ఇబ్బంది పడుతుంటే నేను సహాయం చేశాను అంతే. కొందరు దీన్ని తప్పుగా చిత్రీకరిస్తున్నారు’ అని అన్నారు. అయితే దీనిపై మీడియా రాద్ధాంతం చేస్తోంది..’’ అని సదరు ఎమ్మెల్యే పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: