మాజీ ముఖ్య‌మంత్రి న‌ల్లారి కిర‌ణ్ కుమార్ రెడ్డి త్వ‌ర‌లో కాంగ్రెస్ పార్టీలో చేర‌టానికి రంగం సిద్ద‌మైంది. పార్టీ సీనియ‌ర్ నేత‌, రాజ్య‌స‌భ స‌భ్యుడు టి. సుబ్బ‌రామిరెడ్డి  అధిష్టానం త‌ర‌పున కిరణ్ తో మంత‌నాలు జ‌రిపారు. మొన్న‌టి రోజున కేంద్ర మాజీ మంత్రి ప‌ళ్ళంరాజు కూడా కిరణ్ తో ఇదే విష‌య‌మై బేటీ అయిన సంగ‌తి అంద‌రికీ తెలిసిందే.  స‌మైక్య ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు కిర‌ణే చివ‌రి ముఖ్య‌మంత్రి. రాష్ట్ర విభ‌జ‌న‌కు అనుకూలంగా అధిష్టానం తీసుకున్న నిర్ణ‌యాన్ని కిర‌ణ్ తీవ్రంగా వ్య‌తిరేకించి వార్త‌ల్లోకెక్కారు. 


తాను ఎంత వ్య‌తిరేకించినా ఉప‌యోగం లేక‌పోవ‌టంతో చివ‌ర‌కు 2014 ఎన్నిక‌ల‌కు ముందు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి స‌మైక్య ఆంధ్ర‌ప్ర‌దేశ్ అనే పార్టీ పెట్టారులేండి. ఆ పార్టీ త‌ర‌పున ఎన్నిక‌ల్లో పాల్గొన్న వారిలో ఎవ‌రికీ డిపాజిట్లు కూడా రాని విష‌యం వేరే సంగ‌తి లేండి. త‌ర్వాత కిర‌ణ్ రాజ‌కీయంగా తెర‌మ‌రుగైపోయారు. ఒక‌సారి జ‌న‌సేన‌లో క‌లుస్తారని, భార‌తీయ జ‌న‌తా పార్టీలో చేర‌నున్నారంటూ జ‌రిగిన  ప్ర‌చారంతో అప్పుడ‌ప్పుడు వార్త‌ల్లో వ్య‌క్తిగా నిలిచారు.


ఇటువంటి నేప‌ధ్యంలో ఈ మ‌ధ్య ఢిల్లీలో ఏపి కాంగ్రెస్ నేత‌ల‌తో పార్టీ అధ్య‌క్షుడు రాహూల్ గాంధి స‌మావేశ‌మ‌య్యారు. పార్టీకి పూర్వ వైభవం తిన‌టంలో భాగంగా పార్టీని వ‌దిలి వెళ్ళిపోయిన నేత‌లంద‌రినీ తిరిగి పార్టీలోకి ర‌ప్పించాల‌ని ఆదేశించారు. అందులో భాగంగానే సీనియ‌ర్ నేత‌లు కిరణ్ కుమార్ రెడ్డి ఇంటికి క్యూ క‌ట్టారు. టి సుబ్బ‌రామిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, కిర‌ణ్ ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన‌ట్లు చెప్పారు. పార్టీలోకి వ‌స్తార‌నే అనుకుంటున్న‌ట్లు చెప్పారు. ఎందుకంటే, ప్ర‌స్తుతం కిర‌ణ్ ఏ పార్టీలోను లేరు కాబ‌ట్టి అట‌. కిర‌ణ్ గ‌నుక పార్టీలో చేరితే జాతీయ‌స్ధాయిలో స‌ముచిత స్దానం ఇవ్వొచ్చంటూ  సుబ్బ‌రామిరెడ్డి చెబుతున్నారు. ప్ర‌స్తుతం కిర‌ణ్ కు కూడా ఇంకో మార్గం లేదు కాబ‌ట్టి త్వ‌ర‌లో కాంగ్రెస్ పార్టీలో చేరొచ్చు.   



మరింత సమాచారం తెలుసుకోండి: