కాంగ్రెస్ పార్టీ ఇపుడు మాజీలను పార్టీ గూటికి చేర్చే ప్రోగ్రాం పెట్టుకుంది. గతంలో ఆ పార్టీలో ఉంటూ పదవులు అనుభవించిన వారు విభజన తరువాత వేరు పడి ఖాళీగా కాలం వెళ్ళదీస్తున్న వారిని తిరిగి హస్తం నీడన చేర్చేందుకు గట్టిగానే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదే టైంలో విశాఖలో వున్న మాజీ కాంగ్రెస్ నేతల సంగతేంటన్న మాట వినిపిస్తోంది.
ఎటూ తేల్చని సబ్బం హరి
కాంగ్రెస్ కు గుడ్ బై కొట్టేసి నాలుగేళ్ళుగా ఏ పార్టీలో చేరకుండా వుంటున్న సబ్బం హరి పై ఇపుడు కంగ్రెస్ పెద్దల కన్ను పడిందంటున్నారు. హరి 2009 లో అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. 2014 ఎన్నికలలో మాజీ సీయం కిరణ్ కుమార్ రెడ్డి పెట్టిన సమైఖ్యాంధ్ర పార్టీలో చేరినా చివరి నిముషంలో విశాఖ ఎంపీ అభ్యర్ధిగా పోటీ నుంచి తప్పుకున్నారు. ఆ ఎన్నికలలో బీజీపీ ఎంపీ అభ్యర్ధి హరిబాబుకు మద్దతు ఇచ్చారు.
అఫర్లు వస్తున్నాయి
సబ్బం హరి చాలా  కాలం క్రితం విశాఖ నగరం మేయర్ గా కూడా పనిచేశారు. దాంతో ఆయనకు నగరంలో కొంత పట్టు వుంది. పైగా బలమైన వెలమ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కావడం ప్లస్ పాయింట్. ఆయనను టీడీపీ, బీజేపీ కూడా చేరమని కోరాయి. కానీ సబ్బం స్పందించలేదు. ఇపుడు కాంగ్రెస్ నేతలను తిరిగి ఆహ్వానించే క్రమంలో హరికి కూడా పిలుపు వుంటుందని తెలుస్తోంది అయన రాజకీయ గురువు కేవీపీ రామచంద్రరావు. ఆయన కనుక మాట చెబితే హరి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వస్తారని ప్రచారం సాగుతోంది.
కొణతాల పైనా కన్ను
అదే విధంగా మాజీ మంత్రి కొణతాల రామక్రిష్ణను సైతం కాంగ్రెస్ లోకి తిరిగి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. అనకాపల్లి రాజకీయాలోనే కాకుండా, జిల్లా రాజకీయాలలో మంచి పలుకుబడి కలిగిన కొణతాల కాంగ్రెస్ లోకి వస్తే పార్టీ బాగానే పుంజుకుంటుంది. టి సుబ్బరామిరెడ్డి వంటి వారు చొరవ తీసుకుంటే కొణతాల చేయి కలుపుతారని టాక్.  మరి ఆయనకు ఏమేరకు రాజకీయ లాభం వుంటుందో కూడా బేరీజు వేసుకుంటారన్నది నిజం
ఉత్తరాంధ్రాపైనా చూపు
గతంలో కాంగ్రెస్ లో వుండి ప్రస్తుతం ఇతర పార్టీలలోకి జంప్ చేసిన పెద్ద తలకాయలను తీసుకువచ్చేందుకు హస్తం పార్టీ బాగానే
 కసరత్తు చేస్తోంది. అదే కనుక జరిగితే వైసీపీ, టీడీపీ శిబిరాలలో వుంటూ ప్రాధాన్యత లేని నాయకులకు కూడా పిలుపులు వుంటాయని అంటున్నారు.  అయితే ఏపీలో కాంగ్రెస్ ఏ మాత్రం బలం పుంజుకోలేదు. ఎంపీ స్థాయి నాయకులు, పెద్ద తలకాయలు వెళ్తే వెళ్ళొచ్చేమో కానీ, మిగతా వారు లోకల్ పాలిట్రిక్స్ మీదనే బేస్ అయి రాజకీయాలు చేస్తారు. అందువల్ల కాంగ్రెస్ పిలుపునకు ఏ మాత్రం స్పందన వుంటుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: