'జోను లేదు...గీను లేదు. నిరాహార దీక్ష‌ల‌ను లెక్క‌చేసేదెవ‌రు ? '...ఓ ఎంపి వ్యాఖ్య 
' నేను 5 కిలోల బ‌రువు త‌గ్గాల‌ని అనుకుంటున్నాను. అవ‌కాశం ఇస్తే వారం రోజుల పాటు నేను కూడా దీక్ష చేస్తాను '...మ‌రో ఎంపి ఎట‌కారం...
ఈ వ్యాఖ్య‌లు చేసింది ఎవ‌రో తెలుసా ?  ఏపిలోని అధికార తెలుగుదేశంపార్టీ ఎంపిలే. ఎక్క‌డ ?  ఢిల్లీలో. ఇంత‌మంది ఎంపిలు,   బ‌హుశా ఢిల్లీలో అనంతపురం ఎంపి జెసి దివాక‌ర్ రెడ్డి ఇంట్లో స‌మావేశ‌మైన‌ట్లున్నారు. ఈ ఫొటోల్లో   క‌నిపిస్తున్న వాళ్ళ‌ల్లో శ్రీ‌కాకుళం ఎంపి రామ్మోమ‌నోహ‌ర్ నాయుడు, రాజ‌మండ్రి ఎంపి ముర‌ళీమోహ‌న్, అన‌కాప‌ల్లి ఎంపి అవంతి శ్రీ‌నివాస్, క‌ర్నూలు ఫిరాయింపు ఎంపి బుట్టా రేణుక‌, గుంటూరు ఎంపి గ‌ల్లా జ‌య‌దేవ్, విజ‌యవాడ ఎంపి కేశినేని నాని, ఏలూరు ఎంపి మాగంటి బాబు, రాజ్య‌స‌భ స‌భ్యురాలు సీతా రామ‌ల‌క్ష్మి, క‌న‌క‌మేడ‌ల ర‌వీంద్ర‌తో పాటు మ‌రో ఇద్ద‌రు ఎంపిలు కూడా ఉన్నారు. 


త‌మ ఎంపి దీక్ష‌నే హేళ‌న చేస్తున్న ఎంపిలు


క‌డ‌ప‌లో ఉక్కు ఫ్యాక్ట‌రీ కోస‌మ‌ని కేంద్ర గ‌నులు, ఉక్కుశాఖ మంత్రి బీరేంద్ర సింగ్ తో రెండు రోజులుగా  ఒక‌వైపు స‌మావేశ‌మ‌వుతున్నారు. కేంద్ర‌మంత్రి తీరుపై మండిప‌డుతున్నారు. మ‌రోవైపు దీక్ష‌ల‌పై చుల‌క‌న‌గా మాట్లాడుకుంటున్నారు. త‌మ  స‌హ‌చ‌ర ఎంపి, రాజ్య‌స‌భ స‌భ్యుడు సిఎం ర‌మేష్  క‌డ‌ప‌లో ఉక్కు ఫ్యాక్ట‌రీ డిమాండ్ తో క‌డ‌ప‌లో 10 రోజులుగా ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష చేస్తున్నారు. మ‌రోవైపు ఈ మ‌ధ్య‌నే విశాఖ‌ప‌ట్నం కేంద్రంగా ప్ర‌త్యేక రైల్వేజోన్ కావాలంటే త‌న పుట్టినరోజు నాడు అవంతి శ్రీ‌నివాస్  ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష చేసిన సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. వీళ్ళంతా దీక్ష‌ల‌పై చాలా కులాసాగా క‌బుర్లు చెప్పుకుంటూ జోకులేసుకుంటున్నారు.  ఎంపిల మాట‌లు వింటుంటే వీళ్ళ‌కి దీక్ష‌లంటే ఎంత చుల‌క‌నో అర్ధ‌మైపోతోంది.   


వీళ్ళేనా కేంద్రం మెడ‌లు వంచేది ?


రైల్వేజోన్ గురించి కొద్ది గంట‌ల పాటు దీక్ష చేసిన అవంతి కూడా జోను లేదు గీనూ లేదు అంటూ ఎంత చుల‌క‌న‌గా మాట్లాడుతున్నారంటే మ‌రి, ఆయ‌న ఎందుకు దీక్ష చేసిన‌ట్లు ?  అంటే ఆయ‌న  చేసిన దీక్షంతా ఒట్టి  బూట‌క‌మేనా ?  ఇక ముర‌ళీ మోహ‌న్ ఏం చెప్పారో చూడండి...తాను 5 కిలోల బ‌రువు త‌గ్గాల‌ని అనుకుంటున్నారట‌.  కాబ‌ట్టి అవ‌కాశం ఇస్తే  వారం రోజులు దీక్ష చేస్తార‌ట‌. అంటే నిరాహార దీక్ష‌లు చేసేది కేవలం బ‌రువు త‌గ్గ‌టానికేనా ? ఇపుడు సిఎం ర‌మేష్ చేస్తున్న నిరాహార దీక్ష కూడా ఉక్కు ఫ్యాక్ట‌రీ కోసం కాద‌ని కేవ‌లం బ‌రువు త‌గ్గ‌టానికే అన్న విష‌యం మురళీ మోహ‌న్ మాట‌ల‌తో అర్ధ‌మైపోయింది.  రాష్ట్ర స‌మ‌స్య‌ల గురించి, ఆమ‌ర‌ణ నిరాహార దీక్షల గురించి ఇంత చుల‌క‌న‌గా మాట్లాడుకుంటున్న ఈ ఎంపిలేనా  రాష్ట్ర హ‌క్కుల సాధ‌న కోసం  కేంద్ర ప్ర‌భుత్వ‌ మెడ‌లు వంచేది ?





మరింత సమాచారం తెలుసుకోండి: