ఎక్కడ పోయిందో అక్కడ వెతుక్కోవడంలో రాజకీయ నాయకులు స్పెషలిస్టులు. ఈ విషయంలో సెంచరీ యియర్స్ ఎప్పుడో దాటేసిన కాంగ్రెస్ ఇంకా స్పెషలిస్ట్. అందుకే ఏపీలో మళ్ళీ సెర్చింగ్ మొదలెట్టేసింది. ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ ఉమన్ చాంది ఏపీలో పడిపోయిన  కాంగ్రెస్ ని లేపేస్తానంటున్నారు. పనిలో పనిగా ఉత్తరాంధ్ర టూర్ కీ రెడీ అంటున్నారు.



జూలైలో టూర్ :



ఉమన్ చాందీ జూలై నెలలో ఉత్తరాంధ్ర పర్యటన చేయబోతున్నరట. కాంగ్రెస్ పార్టీకి ఊపిరి పోస్తారట. పార్టీలో మిగిలిన వారిని తట్టిలేపడంతో పాటు, బయటకు వెళ్ళిన వారి ఇళ్ళకు వెళ్ళి  బొట్టు పెట్టి మరీ పిలుస్తారట. సొంతింటికి రారండీ అంటూ ఘనంగా ఆహ్వానం పలుకుతారట. ఇప్పటికే పిలుపులకు సంబంధించిన వారి లిస్ట్ తయారైందంట. ఉమన్ చాంది రావడం, కండువా కప్పేసి తీసుకురావడమే తరువాయట.



వారంతా ఓకేనా :



శ్రీకాకుళానికి చెందిన కేంద్ర మాజీ మంత్రి కిల్లి క్రుపారాణి వైసీపీలోకి జంప్ చేస్తారని చాలకాలంగా టాక్ నడుస్తోంది. అమె టెక్కలి సీటు కోరుకుంటున్నారు. ఇదే జిల్లాకు చెందిన మాజీ మంత్రి కోండ్రు మురళీమోహనరావు ఫ్యాన్ నీడకు చేరేందుకు డీల్ సెట్ చేసుకున్నారని మరో టాక్. ఆయన ఎచ్చెర్ల నుంచి అసెంబ్లీకి వైసీపీ టిక్కెట్ పై పోటీ చేసేందుకు రెడీగా ఉన్నారు. ఇక,  విజయనగరంలో కూడా కాంగ్రెస్ బడా నాయకులంతా వైసీపీ, టీడీపీలలో సర్దుకున్నారు. ఉమన్  చాందీ టూర్ కి వస్తే వీరు కాంగ్రెస్ కి జై అంటారా మరి.



విశాఖలో ఆ ఇద్దరే టార్గెట్ :



విశాఖ జిల్లాలో మాజీ ఎంపీ సబ్బం హరి, మాజీ మంత్రి కొణతాల రామక్రిష్ణ ఇపుడు ఏ పార్టీలో లేరు. ముందు వారిద్దరినీ పిలిచి కాంగ్రెస్ కండువా కప్పేయాలని హస్తం పెద్దలు ఆరాటపడుతున్నారు. మరి వారి ఎలా  రెస్పాండ్ అవుతారో చూడాలి. ఇప్పటికే పార్టీలో పెద్ద తలకాయలన్నీ తప్పుకున్నాయి. ఏం చెప్పి వెనక్కు రప్పిస్తారో మరి.



రాహులే టానిక్కంట :



కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు రాహుల్ గాంధీయే  బూస్ట్, హార్లిక్స్, టానిక్ కూడానట. వచ్చే ఎన్నికలలో ఏపీలోనూ కాంగ్రెస్ అద్భుతాలు స్రుష్టిస్తుందంట. పీసీసీ ప్రధాన కార్యదర్శి ద్రోణం రాజు శ్రీనివాసరావు కాంగ్రెస్ బలంగా ఉందంటున్నారు. ఓట్ బ్యాంక్ బాగా పెరిగిందంటున్నారు. ఏ పార్టీతోనూ పొత్తు లేకుండా 2019లో పోటీ చేస్తామని ధీమాగా చెబుతున్నారు. కాంగ్రెస్ ఓ సముద్రమని, వెళ్ళిన వారంతా వెనక్కి తిరిగి వస్తారని నమ్మకంగా అంటున్నారు. చూడాలి మరి ఉమన్ చాంది మ్యాజిక్ ఏంటో. ఉత్తరాంధ్రలో గాలి ఎలా తిరుగుతుందో.



మరింత సమాచారం తెలుసుకోండి: