పార్టీలో మొదటి నుంచి ఉన్న వారిని పక్కన పెడుతూ ఎన్నికల ముందు కొత్తవారికి టిక్కెట్లు ఇవ్వడం వల్ల పోయినసారి ఎన్నికలలో వైసీపీ చాలా చోట్ల చతికిలపడింది. కొత్తవారికి ఎక్కడా పాత వారు సహకరించకపోగా పొగ సైతం పెట్టేశారు మరికొన్ని చోట్ల ప్రత్యర్ధి టీడీపీ గెలుపునకు కూడా గట్టిగా పనిచేశారు ఆ అనుభవాలు అలా ఉండగానే వచ్చే ఎన్నికలలో కూడా అదే ప్రయోగం వైసీపీ చేస్తోంది. నిన్నటి ఇంచార్జి లను మూలకు నెట్టి బయటవారికి ఘనంగా వెల్కం చెబుతోంది. దీంతో విశాఖ వైసీపీలో అపుడే ముసలం పుట్టింది.

అపుడూ ఇపుడూ ఉత్తరమే నాంది :


విశాఖ ఉత్తర నియోజక వర్గం వైసీపీకి అచ్చిరావడం లేదు గతసారి కూడా డాం ష్యూర్ గా గెలుపు ఖాయం అనుకున్న సీటు పార్టీలో గొడవల కారణంగా చేజారిపోయింది. అప్పట్లో పార్టీలో ముందు నుంచి వున్న ఓ రాజు గారికి హ్యాండ్ ఇచ్చేసి ఆ సీటుని ఇంకొకరికి సర్దేశారు. దీంతో  మాంచి గుస్సా మీదున్న ఆ రాజుగారు అప్పటికపుడే కండూవా మార్చేసి అక్కడ బీజేపీ రాజుగారిని కసిగా గెలిపించేశారు

.
సీన్ రిపీట్ అవుతుందా :


ఇపుడు ఏరీ కోరీ ఉత్తరం సీటును పార్టీకి ఏమాత్రం సంబంధం లేని  ఓ రాజుగారికి పార్టీ ఈ మధ్యనే  ఇచ్చేసింది. ఆయనే నెక్ట్స్  ఎమ్మెల్యే క్యాండిడేట్ అని కూడా డిసైడ్ చేసేసింది. పార్టీలో టిక్కెట్ ఆశించి గత నాలుగేళ్ళుగా పని చేస్తున్న ముగ్గురు ఇంచార్జిలకు ఆ విధంగా ఝలక్ ఇచ్చేసింది. ఈ పరిణామంతో వారు హై కమాండ్ మీద తెగ ఫైర్ అవుతున్నారు.


పార్టీ మీట్ కు డుమ్మా :


ఉత్తర నియోజకవర్గం కీలక సమావేశాన్ని నిర్వహిస్తే ముగ్గురు ఇంచార్జిలూ కూడబలుక్కుని మరీ గైర్ హాజరయ్యారు. పార్టీలో కొత్తగా వచ్చిన రాజు గారిని క్యాడర్ కి పరిచయం చేద్దామంటే  వారు కూడా పెద్దగా రాని పరిస్థితి. అయినా వైసీపీ జిల్లా పెద్దలు మాత్రం మేము గెలిచేస్తాం అంటూ భారీ స్టేట్మెంట్ ఇచ్చేశారు.


మిగిలిన చోట్లా కొత్తవారేనా :


ఇదే వరుసలో విశాఖ జిల్లాలోని పెందుర్తి, భీమునిపట్నం, విశాఖ దక్షిణం, ఎలమంచిలి, పాడేరు, అరకు వంటి చోట్ల కొత్త ముఖాలను వెతికే పనిలో వైసీపీ బిజీగా వుంది. అక్కడ ఇంచార్జిలు తాజా పరిణామాలతో కలవరపడుతున్నారు. రేపు మాకు ఎవడో కొత్త పూజారి వస్తాడు, ఎంచక్కా సీటు ఎత్తుకెళ్ళిపోతాడంటూ పరేషాన్ అవుతున్నారు. 


పాఠాలు నేర్వని హైకమాండ్ :


పోయినసారి ఓటమికి గల కారణాలను విశ్లేషించామని  గొప్పగా  చెప్పుకున్న వైసీపీ హైకమాండ్ గుణ పాఠాలను ఏ మాత్రం నేర్చుకోలేదేమో. పార్టీకి పనిచేసే వారు కావాలి. అదే సమయంలో అర్ధ బలం వున్న వారూ కావాలి. కొత్త వారిని పార్టీలోకి తేవాలనుకున్నపుడు రాత్రికి రాత్రి దింపేయకుండా క్యాడర్ తో చర్చించి అవసరమైన చోట మాత్రమే టిక్కెట్లు ఇస్తే బాగుంటుందన్న సూచనలు వస్తున్నాయి. అలా కాకుండా ఎవరినైనా పెడతాం అంటే పైకి అంతా బాగానే కనిపించినా అసలైన దెబ్బ మాత్రం పడిపోతుంది. మరి అధినేత జగన్ చేసిన తప్పులే చేస్తున్నారని క్యాడర్ గొణిగితే తప్పేముంది.


మరింత సమాచారం తెలుసుకోండి: