సార్వ‌త్రిక ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో ఓరుగ‌ల్లు గులాబీలో ముస‌లం పుట్టిందా..?  మొన్న ఉప ముఖ్యమంత్రి క‌డియం శ్రీ‌హ‌రి అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన అంత‌ర్గ‌త స‌మావేశానికి వ‌రంగ‌ల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ‌తోపాటు ప‌లువురు నేత‌లు హాజ‌రు కాలేదా..?  పార్టీలో గ్రూపు రాజ‌కీయాల‌కు ఈ స‌మావేశం నిద‌ర్శంగా మారిందా..? అంటే జిల్లాకు చెందిన ప‌లువురు నాయ‌కులు నిజమేన‌ని అంటున్నారు. ఐదారు నెల‌ల్లోనే ఎన్నిక‌లు జ‌రిగే అవ‌కాశాలు ఉన్నాయంటూ పార్టీ అధినేత‌, ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఇచ్చిన సంకేతాల నేప‌థ్యంలో ఈ స‌మావేశం నిర్వ‌హించిన‌ట్లు తెలిసింది. అయితే, ఈ స‌మావేశానికి హాజ‌రైన ప‌లువురు నాయ‌కులు కూడా తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేసినట్లు స‌మాచారం. 

Image result for telangana trs

పార్టీలో పాత క్యాడ‌ర్‌ను ప‌ట్టించుకోడం లేద‌ని ప‌లువురు ఎమ్మెల్యేల‌పై బ‌హిరంగంగానే విమ‌ర్శ‌లు చేసిన‌ట్లు తెలుస్తోంది. నిజానికి.. వ‌రంగ‌ల్ జిల్లాలోని అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో రెండుమూడు గ్రూపులు ఉన్నాయి. ఈ గ్రూపులు మ‌ళ్లీ మంత్రి హ‌రీశ్‌రావు, మంత్రి కేటీఆర్ వ‌ర్గాలుగా చీలిపోయిన‌ట్లు స‌మాచారం. అంతేగాకుండా.. ఒక్కో నియోజ‌క‌వ‌ర్గంలో టికెట్ రేసులో ముగ్గురు న‌లుగురు నాయ‌కులు ఉన్నారు. ఇక మ‌రికొంద‌రు ఇప్ప‌టి నుంచే ప‌క్క చూపులు చూస్తున్నారు. ఇక వ‌రంగ‌ల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ వ్య‌వ‌హార శైలితో పార్టీలో దుమారం రేగుతోంది. 

Image result for konda surekha

ముఖ్యంగా స్పీక‌ర్ సిరికొండ మ‌ధుసూద‌నాచారి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న భూపాల‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం నుంచి వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ కూతురు సుష్మితాప‌టేల్‌ను బ‌రిలోకి దింపుతామ‌ని ఆమె ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. మ‌రోవైపు కొండా దంప‌తులు కాంగ్రెస్ పార్టీలో చేరే అవ‌కాశాలు కూడా ఉన్నాయ‌ని పార్టీలో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇక స్టేష‌న్‌ఘ‌న్‌పూర్‌లో మాజీ డిప్యూటీ సీఎం రాజ‌య్య‌కు ఎర్త్ పెట్టేందుకు డిప్యూటీ సీఎం క‌డియం ఎర్త్ పెట్టే ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌న్న‌ది జిల్లాలో ఓపెన్ టాక్‌. జిల్లా ఉన్న 12నియోజ‌క‌వ‌ర్గాల్లో దాదాపుగా ఎనిమిది నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీలో గ్రూపులు ఉన్నాయి. 


ముఖ్యంగా మానుకోట‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే శంక‌ర్‌నాయ‌క్‌, మాజీ ఎమ్మెల్యే క‌విత వ‌ర్గాలు పార్టీ క్యాడ‌ర్ చీలిపోయింది. ఇక స్టేష‌న్‌ఘ‌న్‌పూర్‌లోనూ ఎమ్మెల్యే రాజ‌య్య‌, ఉప ముఖ్య‌మంత్రి క‌డియం శ్రీ‌హ‌రి, రాష్ట్ర నాయ‌కుడు రాజార‌పు ప్ర‌తాప్ వ‌ర్గాలు ఉన్నాయి. ములుగు, భూపాల‌ప‌ల్లి, జ‌న‌గామ‌, వ‌రంగ‌ల్ తూర్పులోనూ సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఇత‌ర నాయ‌కులు వ‌ర్గాలుగా విడిపోయారు. ఈ నేప‌థ్యంలో మొన్న జ‌రిగిన స‌మావేశం హాట‌హాట్‌గా కొన‌సాగిన‌ట్లు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఈ ప‌రిస్థితులు ఇలాగే ఉంటే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీకి తీవ్ర న‌ష్టం జ‌రుగుతుంద‌ని ప‌లువురు నాయ‌కులు అంటున్నారు. ఓరుగ‌ల్లు గులాబీని సీఎం కేసీఆర్ ఎలా దారిలోకి తెస్తారో చూడాలి మ‌రి. 



మరింత సమాచారం తెలుసుకోండి: