నిన్నటి వరకు కడప ఉక్కు పేరిట హల్ చల్ చేసిన టీడీపీ ఇపుడు విశాఖ రైల్వే జోన్ ని తలకెత్తుకొంటోంది. ఈ దెబ్బతో ఉత్తరాంధ్ర ఓట్లన్ని గంప గుత్తగా సైకిల్ కే పడిపోవాలట. అందుకోసం ఈ నెల  4న ఒక రోజు దీక్షకు టీడీపీ భారీ అట్టహాసం చేస్తోంది. మంత్రులు, సామంతులతో భారీ బడ్జెట్ సినిమానే విశాఖ జనాలకు  చూపించనుంది.



అఖిలపక్షానిదీ అదే ప్లాన్ :



మరో వైపు అధికార టీడీపీకి వ్యతిరేకంగా అఖిలపక్షం రైల్వే జోన్ కోసం పోరు బాట పడుతోంది. వామపక్షాలు, వైసీపీ, కాంగ్రెస్, ప్రజా సంఘాలు కలుపుకుని జోన్ కోసం ఉద్యమానికి తెర తీస్తోంది. ఈ నెల 20న విశాఖ టూ అరకు రైల్ యాత్రకు రెడీ అయిపోయింది. ఆగస్ట్ లో చలో డిల్లీ పేరిట బయలుదేరి రైల్వే మంత్రిని కలుస్తారుట. జనసేన పార్టీ అధినేత పవన్ అయితే తానే దీక్షకు కూర్చుంటానని అంటున్నాడు. ఇలా రెండు వైపులా జోన్ కోసం పొలిటికల్ స్టంట్ స్టార్ట్ అయిపోయింది.



ఇచ్చేది మేమే అంటున్న బీజేపీ :



ఈ రేసులో మేమూ ఉన్నామంటోంది బీజేపీ. వీళ్ళంతా పోరాటాలు మాత్రమే చేస్తారు. రైల్వే జోన్ ఇచ్చేది మాత్రం మేమే. సో ఆ క్రెడిట్ మాకే దక్కుతుందంటూ జబ్బలు చరచుకుంటోంది. సరైన టైంలో జోన్ ప్రకటన వస్తుందంటూ బిల్డప్ ఇస్తోంది. నాలుగేళ్ళుగా ఏం చేశారంటూ విపక్షాలు ఎకసెక్కెం ఆడుతున్నా బీజేపీ ధీమా ఏంటో మరి.



కీ అక్కడ వుందిగా :



రేపటి ఎన్నికలలో ఒడిషాను పట్టేయాలని ప్లాన్స్ వేస్తున్న బీజేపీ డిల్లీ నాయకత్వం అంత ఈజీగా జోన్ ఇవ్వబోదని పొలిటికల్ పండిట్స్ అంటున్నారు. జోన్ అన్నది పార్టీలకు అన్ని ఓ తురుపు ముక్క అని, ఎన్నికలు వచ్చినపుడల్లా హాపీగా వాడేసుకుంటారని సెటైర్లు వేస్తున్నారు మరి, రైల్వే జోన్ ఎవరికి కిక్ ఇస్తుందో, మరెవరికి షాక్ ఇస్తుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: