పాపం..కాంగ్రెస్ పార్టీ మాజీలను తిరిగి గూటిలోకి తీసుకువద్దామనుకుంటే ఉన్న వారు బయటకు పోతున్నారు. విశాఖకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు బొలిశెట్టి సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తూ గట్టి షాక్ ఇచ్చారు. పార్టీలో ఉన్న వారికి గౌరవం లేదని, కష్టకాలంలో పార్టీని విడిచిపోయిన వారికే పెద్ద పీట వేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. అటువంటి పార్టీలో ఉండడం అనవసరమని సెట్టైర్లు వేస్తూ బయటకొచ్చేశారు.



నాడు ఎంపీ అభ్యర్ధిగా పోటీ :



విభజన అనంతరం ఏపీలో కాంగ్రెస్ నామ రూపాలు లేకుండా పోయిన సందర్భంలో విశాఖ ఎంపీ సీటుకు ఎవరూ ముందుకు రాకపోతే బొలిశెట్టి రంగంలోకి దిగి పరువు కాపాడారు. డిపాజిట్లు సైతం పోగొట్టుకున్నారు. అమరావతి రాజధాని నిర్మాణం వల్ల పర్యావరణం పాడవుతుందంటూ గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసు వేశారు. వైజాగ్ లో కాంగ్రెస్ ఉనికి కోసం  తరచూ కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు. 



పార్టీలో విభీషణులున్నారట :



కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ, తింటూ ఆ పార్టీకే వెన్నుపోటు పొడుస్తున్నారని బొలిశెట్టి ఓ రేంజిలో కామెంట్స్ చేస్తున్నారు. ఏకంగా పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి, సీనియర్ లీడర్ కేవీపీ రామచంద్రరావులపైనా పంచ్ లే పేల్చారు. ఈ ఇద్దరు నాయకులూ కాంగ్రెస్ లో ఉంటూ వైసీపీ విజయాన్ని కోరుతున్నారని ఆయన అనుమానిస్తున్నారు.  ఈ పరిస్థితిలో పార్టీ ఎలా గెలుస్తుందంటూ సూటిగానే అడిగి కడిగేశారు



ఉమన్ చాందీపైనా ఫైర్ :



రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ ఉమెన్ చాంది మాజీ సీయం కిరణ్ కుమార్ రెడ్డిని కలవడంపైన ఘాటుగా స్పందిచారు. ఏపీలో కాంగ్రెస్ ఇలా అవడానికి కారణమైన  మాజీ సీయం  కిరణ్ ని తిరిగి పార్టీలో చేరమనడం ఏంటని బొలిశెట్టి కస్సుమంటున్నారు. ఉన్న వారిని పట్టించుకోకుండా క్యాడర్ మనో భావాలను దెబ్బ తీస్తున్నారంటూ విరుచుకుపడ్డారు.  ఇక ఏపీలో కాంగ్రెస్ ఎదగదని కూడా ఆయన అంటూ గుడ్ బై కొట్టేశారు.



జనసేన వైపుగా అడుగులు :



కాంగ్రెస్ సీనియర్ లీడర్ గా ఉన్న బొలిశెట్టి జనసేన వైపుగా అడుగులు వేస్తున్నారు. పవన్ గొప్ప నాయకుడంటూ కీర్తిస్తున్నారు. ఆయనకు ఏపీ పట్ల, ముఖ్యంగా ఉత్తరాంధ్ర సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉందంటున్నారు. ఆయన పార్టీ విధానాలు కూడా తనకు సరిపోతానని చెబుతున్నారు. త్వరలో పవన్ ని కలసి బొలిశెట్టి కండువా కప్పుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. మొత్తానికి కాంగ్రెస్ కి విశాఖలో ఉన్నపాటి సీనియర్ లీడర్లు కూడా జారుకుంటున్నారు. వాటే పిటీ


మరింత సమాచారం తెలుసుకోండి: