టీడీపీలో ప్లాష్ స‌ర్వే రేపిన ప్ర‌కంప‌న‌లు ఇంకా చ‌ల్లార‌లేదు. త‌న నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ ఓడిపోతుంద‌ని ఈ స‌ర్వే ఫ‌లితంలో తేల‌డంతో మ‌న‌స్తాపానికి గురైన‌ మంత్రి గంటా శ్రీ‌నివాస‌రావు ఇంకా అల‌కపాన్పు వీడిన‌ట్లు క‌నిపించ‌డం లేదు. ఆయన ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారోన‌ని అంతా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. త‌న‌పై కావాల‌నే అధిష్టా నానికి త‌ప్పుడు సంకేతాలు పంపుతున్నార‌ని ఆయ‌న స‌న్నిహితుల వ‌ద్ద వాపోతున్నార‌ట‌. ఈ నేప‌థ్యంలో ఆయ‌న పార్టీ మార్పుపై తీవ్రంగా ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే ఇంత జ‌రుగుతున్నా అధిష్టానం ఏమాత్రం ప‌ట్టించు కోవ‌డం లేద‌నే అసంతృప్తి ఆయ‌న‌లో నానాటికీ పెరుగుతోంద‌ని స‌న్నిహితులు చెబుతున్నారు. 

Image result for chandrababu naidu

ఆయ‌న‌తో వ్య‌క్తిగ‌తంగా మాట్లాడ‌టంతో పాటు ప‌లు అంశాలపై వివ‌ర‌ణ అయినా తీసుకోవ‌డం లేద‌ని ఆవేద‌న చెందుతున్నార‌ట‌. ఈ నేప‌థ్యంలో ఆయ‌న పార్టీ మార్పు త‌థ్య‌మ‌నే స్ప‌ష్ట‌మైన సంకేతాలు వ‌స్తున్నాయి. కాక‌పోతే అది జ‌న‌సేన‌నా.. లేక వైసీపీ అనేదే తేలాల్సి ఉంది. ఎన్నిక‌ల‌కో పార్టీ.. పోటీచేసిన ప్ర‌తిసారీ కొత్త నియోజ‌క‌వ‌ర్గం.. ఏ ప్ర‌భుత్వం ఉన్నా మంత్రి ప‌దవి గ్యారెంటీ.. టూకీగా గంటా రాజ‌కీయాల గురించి చెప్పాలంటే! గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌ఫున బ‌రిలోకి దిగిన ఆయ‌న‌.. ఈసారి అడుగులు ఎటువైపు వేస్తార‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. ప‌రిస్థితులు కూడా అందుకు త‌గిన‌ట్టుగానే ఉన్నాయి. కొంత కాలం నుంచి ఆయ‌న వ్య‌వ‌హారశైలి పార్టీ నేత‌ల్లోనే అనుమానాలు క‌లిగేలా చేస్తోంద‌ట‌. 


ఈ నేప‌థ్యంలో ఉరుములేని పిడుగులా స‌ర్వే ఫ‌లితం వచ్చి ప‌డ‌టంతో.. పార్టీ మార్పు ప్ర‌చారానికి మ‌రింత ఊతం ల‌భించింది. గంటా శ్రీనివాసరావు పార్టీ మారటం ఖాయమా? అని పార్టీలో ఎవ‌రిని అడిగినా.. అవుననే సమాధానం చెబుతున్నార‌ట‌. ఆయన ఈ సారి పార్టీ మారటం ఖాయ‌మ‌ని.. అదే సమయంలో జిల్లా కూడా మార్చేస్తార‌ని స్ప‌ష్టంచేస్తున్నారు. ప్రస్తుతం గంటా శ్రీనివాసరావు విశాఖపట్నం జిల్లాలోని భీమిలి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ సారి మాత్రం ఏకంగా జిల్లా మారి విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల నుంచి బరిలోకి దిగే అవకాశం ఉందని చెబుతున్నారు. విశాఖపట్నంలో మంత్రి అయ్య‌న్న‌పాత్రుడు-గంటా మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నేంత‌గా రాజ‌కీయ వాతావ‌ర‌ణం ఉంది. 


అంతేగాక ఇటీవ‌ల విశాఖ భూ కుంభ‌కోణం వ్య‌వ‌హారంలోనూ వీరి మ‌ధ్య విభేదాలు రచ్చ‌కెక్కాయి. ఈ త‌రుణంలో త‌న‌కు విశాఖ‌లో శ‌త్రువులు పెరిగార‌ని, ఆరోప‌ణ‌లు కూడా ఎక్కువ‌య్యాయ‌ని భావిస్తున్నార‌ట‌. దీంతో `సేఫ్ జోన్`గా విజయనగరం జిల్లాలోని నెల్లిమర్లను ఎంచుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన ఈ సారి పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన జనసేనలోకి వెళతారా? లేక ప్రధాన ప్రతిపక్షం అయిన వైసీపీలోకి వెళతారా? అన్నది అప్పటి పరిస్థితులను బట్టే ఉంటుందని చెబుతున్నారు. గత ఎన్నికల ముందు కూడా గంటా వైసీపీకి వెళ్లేందుకు చివరి నిమిషం వరకూ ప్రయత్నించార‌ట‌. అయితే ఆ ప్ర‌య‌త్నాలు బెడిసి కొట్ట‌డంతో చివరకు టీడీపీలోకి దూకారు. ఈ విషయం పార్టీ అధినేతకు కూడా తెలుసని సీనియర్ నేతలు గుర్తుచేస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: