సుబ్బి పెళ్ళి ఎంకి చావుకు వచ్చినట్లు  చినబాబు పోటీ నేరుగా వచ్చి ఏపీ టీడీపీ అధ్యక్షుడికే తగిలేసేట్టుంది. ఏకంగా పెద్దాయన సీటుకే ఎసరు పెడుతూ లోకేష్ శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నుంచి పోటీకి రెడీ అయిపోతున్నారు. దీంతో అక్కడ ఎమ్మెల్యే ప్లస్ మంత్రి అయిన కిమిడి కళా వెంకటరావు సీన్ కళా విహీనమే అంటున్నారు. రాజు గారు తలచుకుంటే కొండ మీద కోతే దిగి వస్తుంది, మరి సొంత పార్టీలో టికెట్ ఏపాటి. అందుకే చినబాబు లుక్ ఇక్కడ పడి కళాకు  బాడ్ లక్  స్టార్ట్ అవుతోంది. 


ఉత్తరాంధ్రలో పట్టు కోసమట :


నిజానికి  వచ్చే ఎన్నికలలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తానంటూ లోకేష్ స్టేట్మెంట్ ఇచ్చాక ఎక్కడ తమ సీటుకు ఎసరు వస్తుందోనని తమ్ముళ్ళు తెగ పరేషాన్ అవుతున్నారు. పైకి మాత్రం నా సీట్లో పోటీ చెయ్, నేను పదవీ త్యాగం చేస్తానంటూ హడావుడి చేస్తూ వచ్చారు. లోకేష్ సైతం పోటీ చేస్తే తాత గారి సొంత జిల్లా క్రిష్ణా నుంచి, లేకపోతే రాయలసీమ అనంతపురం నుంచి అంటూ ప్రచారం జరిగింది. ఇపుడు సీన్ మారిందట. ఉత్తరాంధ్రలో పార్టీ వీక్ గా ఉందని సర్వేలు చెప్పడంతో టీడీపీకి కంచుకోటలను కాపాడుకునేందుకు చినబాబు ఇటు వైపు వస్తున్నారని టాక్.  దాంతో కళా సీటు మీద కన్నేశారు.


ఆ సాకు చెప్పి షాక్ :


ఈ మధ్య ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లో పది మంది మంత్రులు దర్జాగా ఇంటికి వెళ్ళిపోతారని వచ్చిందట. అందు లో కళా వెంకటరావు కూడా వున్నారట. ఆ సాకు చూపించి ఇపుడు పెద్దాయన కు హైకమాండ్ షాక్ ఇచ్చేలా ఉంది. ఎటూ టీడీపీ ఏపీ అధ్యక్షుడిగా ఉన్నారు కాబట్టి, ఎన్నికలలో ప్రచారం కోసం వాడుకుని ఆనక పార్టీ గెలిస్తే ఎమ్మెల్సీ ఇచ్చేలా ఆలోచనలు చేస్తున్నట్లు టాక్.  మొత్తానికి ఈసారి కళాకు టికెట్ హుళక్కే అంటున్నారు.


బ్యాండ్ మేళం రెడీ :


ఎచ్చెర్ల నుంచి చినబాబు పోటీ చేయాలంటూ ఆ నియోజకవర్గం నుంచి అపుడే బ్యాండ్ మేళం తయారైపోయింది. లోకేష్ ని పెద్ద మెజారిటీతో గెలిపించుకుంటామని  తమ్ముళ్ళు తెగ  స్టేట్మెంట్లు ఇచ్చేస్తున్నారు. రేపో మాపో అమరావతికి వెళ్ళి మరీ లోకష్ ను స్వయంగా కలసి విన్నపాలు వినిపించేందుకూ రెడీ అవుతున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ చూసి కళా కంగారు పడుతున్నారు. చిత్రం కాకపోతే అధ్యక్షుడి టికెట్ కే ఠిఖానా లేకపోతే ఇక మా బోటి వారి సంగతేంటని ఆశావహులలో  హైరానా పెరిగిపోతోంది. సో. ఇకపై  లోకేష్ కేరాఫ్ ఉత్తరాంధ్ర అన్న మాట. 
 


మరింత సమాచారం తెలుసుకోండి: