వైసిపి ఎంఎల్ఏకి తెలుగుదేశంపార్టీ భారీ ఆఫ‌ర్ ఇచ్చింద‌ట‌. ఎందుకంటే ?  వైసిపి నుండి టిడిపిలోకి ఫిరాయించేందుకు. ఫిరాయింపుల విష‌యంపై చిత్తూరు జిల్లాలోని పూత‌ల‌ప‌ట్టు  వైసిపి ఎంఎల్ఏ డాక్ట‌ర్ ఎం సునీల్ కుమార్ మాట్లాడుతూ, తాను టిడిపిలోకి ఫిరాయిస్తే రూ. 40 కోట్ల ఆఫ‌ర్ వ‌చ్చిన‌ట్లు  చెప్ప‌టం సంచ‌ల‌నంగా మారింది. ఆఫ‌ర్ ఒప్పుకోక‌పోతే , ఇంకేముంది ?  కేసులు పెడ‌తామ‌ని బెదిరించార‌ట‌. వైసిపి ఎంఎల్ఏల కొనుగోలుపై ఉన్న శ్ర‌ద్ద నియోజ‌క‌వ‌ర్గాల అభివృద్ధిపై లేదంటూ ఎంఎల్ఏ మండిప‌డ్డారు. 


24 మందిని లాక్కున్నారు


చంద్ర‌బాబునాయుడు ఫిరాయింపుల‌ను ప్రోత్స‌హించ‌టం అన్న‌ది నాలుగేళ్ళుగా నిరాఘాటంగా చేస్తూనే ఉన్నారు. కోట్ల రూపాయ‌లు ఆశ‌పెట్టి, కాంట్రాక్టులు ఎర‌వేసి, మంత్రిప‌ద‌వుల‌ను తాయిలాలుగా చూపి వైసిపి ఎంఎల్ఏల‌ను చంద్ర‌బాబు లాక్కున్నార‌ని వైసిపి ఎంఎల్ఏలే ఎన్నోసార్లు ఆరోపించారు, మండిప‌డ్డారు. అసెంబ్లీ స్పీక‌ర్ నుండి రాష్ట్ర‌ప‌తి వ‌ర‌కూ ఎంద‌రికో ఫిర్యాదులు చేశారు. అయినా ఉప‌యోగం క‌న‌బ‌డ‌లేదు. ఫిరాయింపుల‌కు వ్య‌తిరేకంగా వైసిపి న్యాయ‌స్ధానంలో కూడా పోరాటం చేస్తోంది. అయినా పెద్ద‌గా ఉప‌యోగం క‌న‌బ‌డ‌లేదు. ఎక్క‌డికక్క‌డ వ్య‌వ‌స్ధ‌ల‌ను మ్యానేజ్ చేసుకుంటూ టిడిపి ముఖ్యులు త‌మ వికృత క్రీడ‌ను కొన‌సాగిస్తూనే ఉన్నారు.


ఫిరాయింపుల‌కు భారీ ప్ర‌లోభాలు

Image result for defected mlas

భారీ ఎత్తున డ‌బ్బులు ఎరేస్తున్నార‌న్న ఆరోప‌ణ‌లు ఇదే కొత్త కాదు. ఒక‌పుడు తూర్పు గోదావ‌రి జిల్లాలోని చోడ‌వ‌రం వైసిపి ఎంఎల్ఏ వంత‌ల రాజేశ్వ‌రి కూడా ఆరోపించారు. అప్ప‌ట్లో త‌న‌కు రూ. 20 కోట్లు ఆఫ‌ర్ ఇచ్చిన‌ట్లు ఆమె చేసిన ఆరోప‌ణ‌లు సంచ‌ల‌నం సృష్టించాయి. అయితే, త‌ర్వాత ఏం జ‌రిగిందో ఏమో తెలీదు కానీ కొంత‌కాలానికి రాజేశ్వ‌రి టిడిపిలోకి ఫిరాయించారు. మ‌రి ఫిరాయించ‌టానికి ఎంత తీసుకున్నారో మాత్రం ర‌హ‌స్యంగానే ఉండిపోయింది.


న‌లుగురికే మంత్రిప‌ద‌వులు


జ‌మ్మ‌ల‌మ‌డుగు ఎంఎల్ఏ ఆదినారాయ‌ణ‌రెడ్డి, నంద్యాల ఎంఎల్ఏ భూమా నాగిరెడ్డి, ప‌ల‌మ‌నేరు ఎంఎల్ఏ అమ‌ర‌నాధ‌రెడ్డి, తెర్లాం ఎంఎల్ఏ సుజ‌య కృష్ణ రంగారావులు మంత్రి ప‌ద‌వుల కోసం ఫిరాయించారు. అయితే, నాగిరెడ్డి హ‌ఠాన్మ‌ర‌ణంతో ఆళ్ళ‌గ‌డ్డ ఎంఎల్ఏ, కూతురైన భూమా అఖిల‌ప్రియ‌కు మంత్రిప‌ద‌వి ద‌క్కింది. జ‌లీల్ ఖాన్, గిడ్డి ఈశ్వ‌రి, జ్యోతుల నెహ్రూ లాంటి మరికొంద‌రు కూడా మంత్రిప‌ద‌వుల కోస‌మే ఫిరాయించినా ఫ‌లితం ద‌క్క‌లేదు. ఇంకొంద‌రు మాత్రం డ‌బ్బుల కోస‌మే ఫిరాయించారు. అనంత‌పురం జిల్లాలో క‌దిరి ఎంఎల్ఏ అత్తార్ చాంద్ భాష్ టిడిపిలోకి ఫిరాయించినందుకు రూ. 6 కోట్లు ముట్టిన‌ట్లు స్వ‌యంగా టిడిపి నేత‌లే ఆరోపించిన సంగ‌తి అంద‌రికీ తెలిసిందే.   ఫిరాయింపుల ప‌ర్వం స‌ద్దుమ‌ణిగింద‌ని అనుకుంటున్న స‌మ‌యంలో పూత‌ల‌ప‌ట్టు ఎంఎల్ఏ చేసిన ఆరోప‌ణ‌ల‌తో మ‌ళ్ళీ సంచ‌ల‌నం రేగింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: