విశాఖలో పెద్ద ఎత్తున భూ కబ్జా జరిగిందన్నది లోక విధితమే. ఒకటి, రెండూ కాదు,ఏకంగా వేల ఎకరాలు దోచేశారు, ప్రభుత్వానిదా, ప్రైవేట్ దా, అసైన్ లాండా అన్న తేడా లేకుండా కనబడితే చాలు భూ బకాసురులు రెచ్చిపోయారు. నడచినంత మేరా తమ ఖాతాలో వేసేసుకున్నారు. ఇదీ వైజాగ్ లో భారీ ల్యాండ్ స్కాం. పోయిన ఏడాది సంచలనం రేకెత్తించిన ఈ ఇష్యూను బాబు సర్కార్ ఎంచక్కా ప్రత్యేక దర్యాప్తు కమిటీ (సిట్) పేరు చెప్పి అటకెక్కించేసింది.


సిట్ నివేదికలో ఏముంది :


సరిగ్గా సిట్ నివేదిక సర్కార్ వద్దకు చేరి ఆరు నెలలుపై దాటిపోయింది. అసలు సిట్ వేసి కూడా పదమూడు నెలలు గడచిపోయాయి. ఇంతకీ సిట్ నివేదికలో ఏముంది. ఎవరిని దోషులుగా చేసింది అన్నది బాబు మార్క్ సస్పెన్స్. సిట్ నివేదిక బయట ఫెట్టాలని కామ్రెడ్ తో పాటు, వైసీపీ, ప్రజా సంఘాలు గట్టిగానే కోరుతున్నాయి.  సిట్ నివేదిక సంగతి తేల్చమంటూ సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సైతం డిమాండ్ చేసారు.


మంత్రే కోరుతున్నారుగా :


సిట్ నివేదికను బయటపెట్టి దోషులను కఠినంగా శిక్షించాలని సాక్షాత్తూ  బాబు గారి కొలువులోని మంత్రి అయ్యన్నపాత్రుడే నిన్న గాక మొన్న డిమాండ్ చేశారు. విశాఖ టూర్లో ఉన్న పవన్ కళ్యాణ్ సైతం భూములను దోచుకున్నారంటూ ఓ రేంజిలో ఫైర్ అయ్యారు. ఎందుకు సిట్ నివేదిక బయటపెట్టరంటూ టీడీపీని గద్దించారు 


గంటాదీ అదే మాట :


తనపై అనవసరంగా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, జిల్లా భూ భాగోతంలో పేరు ఇరికించి రచ్చ చేస్తున్నారని జిల్లాకు చెందిన టీడీపీ మంత్రి గంటా అంటున్నారు సిట్ నివేదికలో తన పేరు లేనే లేదని, తాను నిర్దోషినని ఆయన స్పష్టంగా చెబుతున్నారు.  నివేదికను బయట పెట్టాలని ఆయన కూడా కోరుతున్నారు. ఆ విధంగా చేస్తే  తన నిజాయతీ బయట పడుతుందని సన్నిహితులతో అంటున్నారు. 


సిట్ ని అడ్డం పెట్టుకుని పాలిట్రిక్స్ :


ఇంతకీ సిట్ నివేదికలో ఏముందో బాబు సర్కార్ కే తెలుసు. భూ కబ్జా జరిగిందనీ  తెలుసు, ఎకరాలకు ఎకరాలు అడ్డగోలుగా మింగేశారని తెలుసు. ఓ వైపు విశాఖను అభివ్రుధ్ధి చేస్తామని చెప్పుకుంటున్న ప్రభుత్వం ఇక్కడ మిగులు భూములు లేవని కుంటి సాకులూ చెబుతోంది. మరి వున్న భూములను రక్షించలేని అసమర్ధత ఎవరిదో జనాలకు బాగా తెలుసు. నిజాలు ఇలా ఉంటే సిట్ నివేదికను బయటపెట్టి అక్రమార్కులపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు...?


ఎన్నికల అస్త్రమా :


సిట్ నివేదికను సరైన టైంలో బయట పెట్టి ఇటు పార్టీలో జంపింగ్ జఫాంగ్ లను, అటు స్పీడ్ మీదున్న విపక్షాలను కట్టడి చేయడానికే దాచిపెట్టి ఉంచారని టాక్ నడుస్తోంది. ముఖ్యంగా మంత్రి గంటా పార్టీ నుంచి బయటకు వెళ్తే ఆ మరు క్షణమే సిట్ నివేదిక బయటకు వస్తుందని కూడా అంటున్నారు. తాను దోషిని కాను, నివేదిక బయట పెట్టండని స్వయంగా మంత్రి అంటున్నా పట్టని బాబు సర్కార్ ఆయన జంప్ చేస్తే మాత్రం బురద జల్లేందుకు సిట్ ని ఓ అస్త్రంగా మార్చుకుంటుందన్న  ఆరోపణలు ఉన్నాయి. అంటే సిట్ వేసింది జనం కోసం కాదు, భూములను కాపాడేందుకు అంత కంటే కాదు, కేవలం పాలిట్రిక్స్ చేయడానికేగా.  వెరీ సింపుల్ గా లాజిక్ అర్ధమైపోతోందిగా.


మరింత సమాచారం తెలుసుకోండి: