అనంత‌పురం జిల్లాలో టీడీపీకి చాప‌కింద నీరులా ఎర్త్ పెడుతున్న‌దెవ‌రు? కంచుకోట‌లా ఉన్న జిల్లాలో కీల‌క‌మైన‌ టీడీపీ నేత‌లు పార్టీకి గుడ్‌బై చెప్ప‌డానికి కారణాలేంటి? అనే సందేహాలు ఇప్పుడు అంద‌రిలోనూ వినిపిస్తున్నాయి. అనంత‌పురం జిల్లా టీడీపీలో లుక‌లుక‌లు బ‌య‌ట‌ప‌డుతున్నాయి. కాంగ్రెస్‌లో త‌మ హ‌వా కొన‌సాగించి.. ఇప్పుడు జిల్లాను త‌మ చెప్పుచేతల్లో పెట్టుకుని శాసిస్తున్న జేసీ బ్ర‌దర్స్ ప్ర‌భావం పార్టీపై తీవ్రంగా ప‌డుతోంద‌నే చర్చ మొద‌లైంది. ఈ ఇద్ద‌రి దెబ్బ‌కు పార్టీలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్న ఇద్ద‌రు నాయ‌కులు త‌ట్టాబుట్టా స‌ర్దుకుని పార్టీకి గుడ్ బై చెప్పేశార‌నే గుస‌గుస‌లు పార్టీలో మొద‌ల‌య్యాయి. 

Image result for jc brothers

త‌మ‌కు ఎదురులేకుండా చూసుకుని, అడ్డు వ‌చ్చిన వారిని పార్టీ నుంచి సింపుల్‌గా సైడ్ చేసేస్తున్నార‌నే విమ‌ర్శ‌లు పార్టీలోనే వినిపిస్తున్నాయి. తాడిప‌త్రి నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీని ఓడించ‌డానికి ఈ ఇద్ద‌రూ స‌రిపోతార‌నే ఘాటైన విమ‌ర్శ‌లు గ‌ట్టిగా చెల‌రేగుతున్నాయి. అనంత‌పురంలో జేసీ బ్ర‌ద‌ర్స్ ఎంత చెబితే అంత‌! వాళ్లు గీసిన గీత దాటితే ఇక అంతే సంగ‌తులు! ద‌శాబ్దాల పాటు జిల్లా రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పిన వీరు.. ఎన్నిక‌ల స‌మ‌యంలో టీడీపీకి స‌రికొత్త ఇబ్బందులు తెచ్చిపెట్టేలా ఉన్నార‌నే చర్చ మొద‌లైంది. సుదీర్ఘకాలంగా తెలుగుదేశంలో ఉన్న తాడిపత్రి టీడీపీ నేతలు, జ‌గ్గి బ్ర‌ద‌ర్స్‌గా వ్య‌వ‌హ‌రించే బొమ్మిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి, జయచంద్రారెడ్డి  పార్టీకి గుడ్ బై చెప్పడం ఇప్పుడు రాజ‌కీయంగా క‌ల‌క‌లం రేపుతోంది. 

Image result for chandrababu naidu

జ‌గ్గి బ్ర‌ద‌ర్స్‌గా పిల‌వ‌బ‌డే జ‌గ‌దీశ్వ‌ర్‌రెడ్డి, జ‌య‌చంద్రారెడ్డి సుదీర్ఘ‌కాలంగా టీడీపీలోనే ఉన్నారు. అయితే గ‌త ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీలో చేరిన జేసీ బ్ర‌ద‌ర్స్ టార్గెట్‌తో వీళ్లు చాలా ఇబ్బందులు ప‌డ్డారు. 2014 లో టీడీపీలో చేరిన జేసీ బ్రదర్స్ ముందు వీరు నిలవ లేకపోయారు. కొంతకాలం కలిసి ఉన్నా, ఆ తర్వాత తగాదాలు వచ్చాయి. జయచంద్రారెడ్డి వార్డు కౌన్సిలర్ గా కూడా ఉన్నారు. ఆయ‌న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ జిల్లా అధిష్టానం నెల రోజుల క్రితం జగ్గీ బ్రదర్స్‌కు షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. జగ్గీ బ్రదర్స్‌ జూన్‌ 20న వివరణ కూడా ఇచ్చారు. సంజాయిషీ సంతృప్తికరంగా లేదంటూ జగ్గీ బ్రదర్స్‌ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేసినట్లు అధ్యక్షుడి పేరుతో ఉన్న ఉత్తర్వులు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేశాయి. దీంతో మనస్తాపానికి గురైన వారిద్దరూ టీడీపీకి గుడ్‌బై చెప్పారని కథ‌నం. 

Image result for tdp

ముందొచ్చిన చెవుల కన్నా, వెనుక వచ్చిన కొమ్ములు గట్టివనే నానుడిని ఇప్పుడు టీడీపీ నేత‌లు గుర్తుచేసుకుంటున్నారు. జేసీ బ్రదర్స్ ను ఎవ‌రు మాత్రం త‌ట్టుకోగ‌ల‌రు అనే చ‌ర్చ మొద‌లైంది. అయితే జేసీ బ్ర‌ద‌ర్స్ ఆగడాల‌కు చంద్ర‌బాబు కూడా అడ్డుక‌ట్ట వేయ‌లేని ప‌రిస్థితికి చేరిపోయింది. అస‌లే పార్టీలో సీనియ‌ర్, అందులోనూ కీల‌క‌మైన ఎన్నిక‌ల స‌మ‌యం కావ‌డంతో జేసీ బ్ర‌ద‌ర్స్ హ‌వాకు బాబు ఎలా చెప్పే ఆలోచ‌నే ఉండ‌క‌పోచ్చేమోనని పార్టీ నాయ‌కులు ఆందోళ‌న చెందుతున్నారు.

ఇంకా చెప్పాలంటే జేసీ బ్ర‌ద‌ర్స్ కెలుకుడు వ్య‌వ‌హారాలు ఒక్క తాడిప‌త్రికి మాత్ర‌మే ప‌రిమితం కావ‌డం లేదు... అనంత‌పురం అర్బ‌న్‌, గుంత‌క‌ల్‌, రాయ‌దుర్గం, పుట్ట‌ప‌ర్తిలో కూడా ఎంపీ హోదాలో జేసీ జోక్యం చేసుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే ఈ జోక్యం ఎక్కువ అయితే వ‌చ్చే ఎన్నిక‌ల వేళ టీడీపీకి కంచుకోట లాంటి అనంత‌పురం జిల్లాలో ఆ పార్టీ పుట్టి మున‌గ‌డం ఖాయ‌మ‌ని టీడీపీ వాళ్లే చెపుతున్నారు. మ‌రి చంద్ర‌బాబు ఇప్ప‌ట‌కీ అయినా వీరికి బ్రేక్ వేస్తాడా ?  లేదా ? అన్న‌ది చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: