తెలంగాణాలో అప్పుడే ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. ఎక్కడ చూసినా .. ఎవరి నోట విన్నా రాజకీయాల  గురించిన చర్చలే. ఇక పార్టీలు.. ఆ పార్టీ నాయకుల సంగతి అయితే చెప్పల్సిన  అవసరం ఏమి ఉంది. కత్తులు లేకుండానే యుద్ధాలు చేసేసుకుంటున్నారు. ముఖ్యంగా తెలంగాణా అధికార పార్టీ టీఆర్ఎస్ - కాంగ్రెస్ మధ్య సాగుతున్న మాటల యుద్ధం మామూలుగా లేదు. ఇదంతా  ముందస్తు ఎన్నికలకు సంబంధించిన హడావుడి అని ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది.  కాంగ్రెస్ లో గ్రూపు రాజకీయాలు కూడా ఎక్కువగా ఉండడం ఆ పార్టీని ఇబ్బంది పెడుతోంది. 


టి. కాంగ్రెస్ నేతలు ఎవరికీ వారు మేము గొప్ప అంటే మేము గొప్ప అని ఎవరికి వారు డప్పు కొట్టుకోవడంతో ఆ పార్టీ ఇరుకునపడుతోంది. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తన పదవి కాపాడుకునేందుకే ముందస్తు ఎన్నికల అంశాన్ని వాడుకుంటున్నారని పార్టీలో ఆయన వ్యతిరేక వర్గం జోరుగా ప్రచారం చేస్తోంది.. సీఎం కేసీఆర్ సవాల్ విసిరిన తరువాత రోజు.. కనీసం పార్టీ నేతలతో కూడా చర్చించకుండా ఉత్తమ్ ముందస్తు ఎన్నికలపై స్పందించడం వెనుక ఇలాంటి జిమ్మిక్కులే ఉన్నాయని ఆయన వ్యతిరేక వర్గం ఆరోపిస్తోంది. 


పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ తీరు నచ్చక కొంతమంది లీడర్లు నేరుగా అధిష్టానాన్ని కలిసి ఫిర్యాదులు చేశారట. దానికి రాహుల్ స్పందించి కొద్దీ రోజులు ఓపిక పట్టండి మార్పు చేర్పులు చేస్తానని వారిని చల్లబరిచాడని ప్రచారం జరుగుతోంది. ఈ గొడవలు ఇలా ఉండగానే  అధికార పార్టీ ముందస్తు ఎన్నికలకు సవాలు చేయడంతో పీసీసీ అదే హీట్ కొనసాగించటానికి పరుగులు తీస్తోందని కాంగ్రెస్ పార్టీలో చర్చ ఆగస్ట్ వరకూ కాస్త హడావిడి చేస్తే ఇక తన పదవికి గండం ఉండదని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్  ఈ ఎత్తుగడలు వేస్తున్నారని ఆయన వ్యతిరేకవర్గం భావిస్తోంది. 


కాంగ్రెస్ లో ఏర్పడ్డ కుమ్ములాటలు తనకు అనుకూలంగా మార్చుకోవాలని ప్లాన్ వేసిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉత్తమ్ కి మేలు చేకూర్చేందుకే ముందస్తు ఎన్నికల ప్రచారాన్ని తెరమీదకు తీసుకొచ్చాడని వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఈ గొడవల సంగతి పక్కనపెడితే నేతల ఆరోపణలు ప్రత్యారోపణలతో తెలంగాణ ఎన్నికల యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: