హిందువులకు ఆదర్శవంతుడైన శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కత్తి మహేష్ పై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని, అతనిని దేశద్రోహిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ, శ్రీపీఠం పీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద పాదయాత్రను ప్రకటించారు. నేడు యాదగిరిగుట్టకు పాదయాత్ర చేయనున్నానని ప్రకటించిన శ్రీపీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామిని జూబ్లీహిల్స్ పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

బషీర్ బాగ్ లోని భాగ్యలక్ష్మీ గుడికి ఆయన బయలుదేరగా, ఇంటి వద్దనే అడ్డుకున్న పోలీసులు, ఆయన్ను గడప దాటనీయలేదు. కాగా, ధర్మాగ్రహం' పేరిట యాత్ర జరుగుతుందని, ప్రతి హిందువూ యాత్రలో పాలు పంచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ రెండు రోజుల్లో కత్తి మహేష్ పై తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, లేకుంటే తన భవిష్యత్తు కార్యాచరణను యాదాద్రిపై ప్రకటిస్తానని ఆయన అన్నారు. 

కత్తి మహేష్ వ్యాఖ్యలతో హిందువులను మనోవేదనకు గురి చేసిన ఆయన్ను జైల్లో పెట్టాల్సిందేనని అన్నారు. కాగా, పరిపూర్ణానంద చేపట్టిన యాత్రకు తాను పూర్తి మద్దతు ఇస్తున్నట్టు నటుడు నాగబాబు వెల్లడించారు. అయితే..జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసానికి భారీ సంఖ్యలో చేరుకున్న పోలీసులు, పాదయాత్రకు అనుమతి లేదని, యాత్రతో శాంతిభద్రతల సమస్య ఏర్పడవచ్చని, అందువల్ల యాత్రను కొనసాగనివ్వలేమని స్పష్టం చేశారు.

శ్రీరాముడు ఓ దగుల్బాజీ అంటూ కత్తి మహేష్ చేసిన వ్యాఖ్యలు హిందువులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించగా, ఆయనపై పలు పోలీసు స్టేషన్లలో కేసులు కూడా నమోదయ్యాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: