తెలంగాణలో ఈ మద్య రాజకీయాలు బాగా వేడెక్కుతున్నాయి.  కాంగ్రెస్, టీఆర్ఎస్ మద్య మాటల యుద్దం కొనసాగుతుంది. అంతేకాదు టీఆర్ఎస్ లో సైతం కొన్ని చోట్ల వర్గ పోరు నడుస్తుందని..సీనియర్లకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. అవిశ్వాస తీర్మానాలు తెలంగాణలోని అధికార టీఆర్ఎస్ లో కాక పుట్టిస్తున్నాయి. పార్టీ పరువును బజారున పడేస్తున్నాయి. కొంత మంది బెదిరింపులకు దిగుతుండగా..మరికొంత మంది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు ఇదే అంశం ఓ ఎమ్మెల్యే రాజకీయాలకు గుడ్ బై చెపుతాననే పరిస్థితి తెచ్చిపెట్టింది. 


 కరీంనగర్‌ గోదావరిఖనిలో టీఆర్‌ఎస్‌ నేతల మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. ఆ పార్టీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో తనకు తగినంత గౌరవం దక్కడం లేదని, తన పదవులకు రాజీనామా చేసి, రాజకీయ సన్యాసం తీసుకోనున్నానని ఆయన తెలిపారు.  కొంత కాలంగా రామగుండం మేయర్‌ కొంకటి లక్ష్మీ నారాయణ చేస్తున్న పార్టీ వ్యతిరేక పనులను హైకమాండ్‌ దృష్టికి తీసుకెళ్లినా చర్యలు తీసుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.


 శనివారం జరిగిన కార్పొరేషన్‌ స్టాండింగ్‌ కమిటీ ఎన్నికల్లో సోమారపు సత్యనారాయణ వర్గం మూడు స్థానాలను, మేయర్‌ వర్గం ఒక స్థానాన్ని, కాంగ్రెస్‌ పార్టీ ఒక స్థానాన్ని కైవసం చేసుకుంది. అంతకుముందు రోజు శుక్రవారం నాడు 41 మంది కార్పొరేటర్లు మేయర్‌పై అవిశ్వాసం పెట్టిన సంగతి తెలిసిందే. పార్టీలో ఎంతో మందిని ప్రోత్సహించానని, ఇపుడు వారే తనకు నష్టం చేసేలా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. 


ఏం నిర్ణయం తీసుకున్నా.. సింగరేణి కార్మికులకు ముందుగా చెప్పడం ఆనవాయితీ అని సోమవారం జరిగిన కార్మికుల గేట్‌ మీటింగ్‌ లో ఆయన స్పష్టం చేశారు. గతవారంలోనే మంత్రి కేటీఆర్‌ రెండు గ్రూపుల నేతలను పిలిచి మాట్లాడినా రామగుండంలో పరిస్థితి మారలేదు. ఈ నేపథ్యంలో   సోమవారం నాడు రామగుండం ఎమ్మెల్యే, ఆర్టీసీ ఛైర్మన్‌ సోమారపు సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను రాజకీయంగా రిటైర్మెంట్‌ తీసుకోవాలని నిర్ణయించుకున్నట్టు ఆయన ప్రకటించారు. పార్టీలో క్రమశిక్షణ కొరవడిందని పేర్కొన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: