ఏపీలో రాజ‌కీయాలు అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తున్నాయి. ఇక్క‌డ ఎన్నిక‌ల విష‌యంలో అదికార పార్టీ రెండు ర‌కాలుగా వ్య‌వ‌హ‌రిస్తోంది. ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు వ‌చ్చినా మాదే గెలుపు అనే రేంజ్‌లో గ‌తంలో మాట్లాడిన సీఎం చంద్ర‌బాబు అనూహ్యంగా యూట‌ర్న్ తీసుకున్నారు.  తాము జ‌మిలి ఎన్నిక‌ల‌కు ఒప్పుకొనేది లేద‌ని తెగేసి చెప్పారు. అయితే, లోక్‌స‌భ ఎన్నిక‌ల‌కు మాత్రం ఓకే అన్నారు. అంతేకాదు, లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో తాము 25 సీట్ల‌ను ద‌క్కించుకుని తీర‌తామ‌ని చెప్పారు. ఈ ప‌రిణామం రాజ‌కీయంగా సంచ‌ల‌నం రేకెత్తించింది.  వాస్త‌వానికి ఇటీవ‌ల కాంగ్రెస్ మాజీ నేత‌, విజ‌య‌వాడ మాజీ ఎంపీ ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్‌తో చంద్ర‌బాబు స‌ర్వే చేయించుకున్నారు. ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు వ‌స్తే.. అనేకాన్సెప్ట్‌తో  సాగిన ఈ స‌ర్వేలో బాబుకు మంచి మార్కులే ప‌డ్డాయి. 


అయినా కూడా బాబు ముంద‌స్తుకు రెడీ అన‌డం లేదు. దీనికి ప్ర‌ధాన కారణం ఆయ‌న గ‌త సెంటిమెంటు అనేది టీడీపీ సీనియ‌ర్ల మాట‌. అదేస‌మ‌యంలో.. ఇప్పుడున్న ప‌రిస్థితిలో టీడీపీకి అనుకూల ప‌వ‌నాలు వీచ‌డం లేద‌ని, ప్ర‌త్యేక హోదా స‌హా విభ‌జ‌న హామీల‌ను దేనినీ కూడా చంద్ర‌బాబు కేంద్రం నుంచి రాబ‌ట్ట‌లేక పోయార‌ని, నాలుగేళ్లు చెలిమి చేసి ఏదో సాధిస్తాన‌ని చెప్పిన ఆయ‌న ఏమీ సాధించ‌లేక చేతులు ఎత్తేశార‌ని ప్ర‌జ‌లు ఇప్ప‌టికీ న‌మ్ముతున్నారు. ఇక‌, ఎన్డీయే నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి ధ‌ర్మ పోరాటాల పేరుతో ఉన్న కొద్దిపాటి ప్ర‌జా ధ‌నాన్ని కూడా ఆయ‌న విచ్చ‌ల‌విడిగా ఖ‌ర్చు చేస్తున్నార‌నేది వారి ఉద్దేశం. ఇక‌, వీటికితోడు.. త‌మ్ముళ్ల అలిమీరిన అవినీతి కూడా బాబును తీవ్రంగా భ‌య‌పెడుతోంది. రోజుకోపేరుమోసిన అధికారి అవినీతి నిరోధ‌క శాఖ‌కు ప‌ట్టుబ‌డుతుండ‌డం, పింఛ‌న్లు లేక పేద‌లు ఏడుస్తుండడం అనేక కొన్ని వ్య‌తిరేక ప‌వ‌నాలు బాబుకు ఇబ్బంది క‌రంగా మారాయి. 


మ‌రోప‌క్క‌, జ‌న‌సేనాని రూపంలోనూ చంద్ర‌బాబు వ్య‌తిరేక గాలులు వీస్తున్నాయి. 2014లో అంతా తానై చంద్ర‌బాబును గ‌ద్దె నెక్కించేందుకు ప్ర‌య‌త్నించిన ప‌వ‌న్ ఒక్క‌సారిగా యూట‌ర్న్ తీసుకున్నారు. బాబు అత్యంత అవినీతి ప‌రుల‌కు చోటు క‌ల్పిస్తున్నార‌ని, ఆయ‌న కుమారుడు మంత్రి లోకేష్‌ను దొడ్డిదారిలో మంత్రిని చేశార‌ని కూడా ప‌వ‌న్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియాలో భారీ ఎత్తున వైర‌ల్ అయ్యాయి. ఈ నేప‌థ్యంలో పార్టీపై వ్య‌తిరేక‌త పెర‌గ‌డం ఖాయ‌మ‌ని చంద్ర‌బాబు భావిస్తున్నారు. ఇదిలావుంటే, ప్ర‌జాసంక‌ల్ప యాత్ర‌తో జ‌గ‌న్ విజృంభించ‌డం కూడా బాబుకు కొరుకుడు ప‌డ‌డం లేదు. దీనికితోడు ఆయ‌న కూడా ఎప్పుడు ఎన్నిక‌లు పెట్టినా రెడీ అంటున్నారు. ప్ర‌జ‌లు, ప్ర‌జా మ‌ద్ద‌తు అంతా కూడా వైసీపీకి అండ‌గా ఉంటోంద‌ని జ‌గ‌న్ చెప్పుకొస్తున్నారు. నిజానికి దీనిపై చంద్ర‌బాబు కూడా నిఘా వ‌ర్గాల నుంచి నివేదిక‌లు తెప్పించుకున్నారు. 


ఈ నేప‌థ్యంలోనే జ‌మిలి పేరుతో ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లడానికి త‌మ పార్టీ వ్యతిరేక‌మ‌ని లాక‌మిష‌న్‌కు టీడీపీ ప్రతినిధులైన ఎంపీలు తోట న‌ర‌సింహం, క‌న‌క‌మేడ‌ల ర‌వీంద్రకుమార్ త‌మ అభిప్రాయాన్ని స్పష్టం చేశారు. జ‌మిలి పేరుతో ప్రాంతీయ పార్టీల‌ను నిర్వీర్యం చేయాల‌ని కేంద్రం ఎత్తుగ‌డ వేసిన‌ట్టు ఆరోపించారు. అయితే లోక్‌స‌భ‌కు ఎన్నిక‌లు ఎప్పుడు పెట్టినా తాము సిద్ధమ‌ని వారు తెలిపారు. మొత్తంగా ఈ ప‌రిణామాలు రాష్ట్రంలో రాజ‌కీయాల‌ను వేడెక్కించాయి. నేత‌లు ఎక్క‌డిక‌క్క‌డ త‌మ గెలుపు పై ధీమా వ్య‌క్తం చేస్తున్నా.. మ‌రోప‌క్క‌, చాప‌కింద నీరులా ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త ప‌నిచేస్తే.. ప‌రిస్థితి ఏంట‌నే దానిపైనా చ‌ర్చ‌లు సాగుతున్నాయి. మొత్తంగా రాష్ట్రంలో ముంద‌స్తుపై ఓ నిర్ణ‌యం లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. 



మరింత సమాచారం తెలుసుకోండి: