ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనను మానసికంగా చంపేశారని టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నరసింహులు అన్నారు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం హైదరాబాద్ నుంచి బయలుదేరిన ఆయన రేణిగుంట విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు.  అలాగే శ్రీవారి దర్శనం పూర్తి చేసుకున్నాక.. మధ్యాహ్నం ఒంటి గంటకు తిరుపతిలో ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారు. మోత్కుపల్లి తిరుపతి పర్యటన నేపథ్యంలో ఆయన ఏం మాట్లాడతారన్న విషయంపై ఆసక్తి రేపుతోంది.

మోత్కుపల్లిని టీడీపీ బహిష్కరించిన తర్వాత సీఎం చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో టీడీపీని ఓడించాలని శ్రీవారిని మొక్కుతానన్నారు. అలాగే ఏపీలో ప్రచారం కూడా చేస్తానని చెప్పారు. ఎన్టీఆర్ దయతో రాజకీయాల్లోకి వచ్చానని.. పార్టీ సిద్ధాంతాలతో పనిచేస్తుంటే.. చంద్రబాబు నడి బజార్లో తన గొంతు కోశేశారని.. మానసికంగా చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు.  రాజకీయాల్లో సేవ చేసేవాళ్లు ఉండాలి కాని.. దుర్మార్గులు కాదన్నారు మోత్కుపల్లి.

చంద్రబాబు నమ్మక ద్రోహని.. రాష్ట్రంలో పేదలను అణగదొక్కేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఏపీకి శనిలా మారారని.. ఆయన తిరిగి అధికారంలోకి రాకుండా.. వ్యతిరేక శక్తులన్నీ ఏకం కావాలన్నారు. తనను అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నా.. అవన్నీ లెక్క చేయకుండా కాలినడక వెంకన్నను దర్శించుకొని చంద్రబాబు ఓడిపోవాలని మొక్కుకుంటానని చెప్పారు మోత్కుపల్లి. 


మరింత సమాచారం తెలుసుకోండి: