ప్రకాశం జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. మాజీ మంత్రి, ఆ పార్టీ సీనియర్ నేత మానుగుంట మహీధర్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన బుధవారం పార్టీలో చేరారు. తూర్పుగోదావరి జిల్లా పాదయాత్రలో ఉన్న వైఎస్ జగన్‌ను మహీధర్ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా మహీధర్ రెడ్డికి జగన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 

Manugunta mahidhar reddy

మహీధర్ రెడ్డి వెంట బాలినేని శ్రీనివాస్ రెడ్డి కూడా ఉన్నారు. ఈ సందర్భంగా కందుకూరు నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలు కూడా వైసీపీలో చేరారు. వీరందరికీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు జగన్. ఈ సందర్భంగా మహీధర్ రెడ్డి మాట్లాడుతూ, జగన్ నాయకత్వాన్ని, రాష్ట్రంలో మార్పును ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. 


వైయస్ ఆశయాలను జగన్ నెరవేరుస్తారని ప్రజలు ఆశలు పెట్టుకున్నారని... జగన్ సిద్ధాంతాలకు ఆకర్షితుడనై వైసీపీలో చేరానని తెలిపారు.  మహీధర్ రెడ్డి ప్రకాశం జిల్లా కందుకూరు నుంచి మూడుసార్లు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్‌లో ఆయన పురపాలక శాఖ మంత్రిగా పని చేశారు. అయితే గత ఎన్నికలకు మహీధర్ రెడ్డి దూరంగా ఉన్నారు. రాష్ట్రాభివృద్ధిని కాకుండా, వ్యక్తిగత అభివృద్ధిని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరుకుంటున్నారని విమర్శించారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: