రాష్ట్రంలో ఎన్నికల హీట్ పెరిగేకొద్దీ పార్టీల మధ్య వలసలు ఎక్కువైపోతున్నాయి. తాజాగా ప్రకాశం జిల్లా కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి మానుగుంట మహీధర్ రెడ్డి వైసిపిలో చేరిన సంగతి అందరికీ తెలిసిందే. ఆమధ్య వైసిపి నుండి 23 మంది ఎంఎల్ఏలు, ముగ్గురు ఎంపిలు తెలుగుదేశంపార్టీలోకి ఫిరాయించిన సంగతి అందరికీ తెలిసిందే. ఎప్పుడైతే వైసిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర మొదలుపెట్టారో రివర్స్ లో వలసలు మొదలయ్యాయి. ఎంఎల్ఏలు, ఎంపిలు వైసిపిలో నుండి టిడిపిలోకి ఫిరాయిస్తే, ద్వితీయశ్రేణి నేతలు టిడిపిలో నుండి వైసిపిలో చేరుతున్నారు.
టిడిపిలోకి ఫిరాయించిన ఎంఎల్ఏలు

నిజానికి వైసిపిలో నుండి టిడిపిలోకి ఫిరాయించిన ఎంఎల్ఏలు, ఎంపిల్లో అత్యధికులకు సొంతబలం లేనివారే. పార్టీ బలమే వారి గెలుపుకు కారణమైంది. ఎంఎల్ఏల్లో గొట్టిపాటి రవి లాంటి ఇద్దరో ముగ్గురో ఎంపిల్లో ఎస్పీవై రెడ్డికి మాత్రమే సొంత బలముంది. కాబట్టి వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఫిరాయింపులకు టిక్కెట్లిచ్చినా మెజారిటీ ఫిరాయింపులకు గెలుపు కష్టమే. అదే సమయంలో టిడిపిలో వివిధ నియోజకవర్గాల్లో బలమున్న ద్వితీయ శ్రేణి నేతలు చాలా మంది వైసిపిలోకి చేరుతున్నారు.
వైసిపిలోకి కాంగ్రెస్ నేతలు

ఒకవైపు ముందస్తు ఎన్నికల వాతావరణం పెరిగిపోతోంది. ఇంకోవైపు టిడిపి నుండి వైసిపిలోకి వలసలు ఊపందుకుంటున్నాయి. ఇటువంటి నేపధ్యంలోనే కాంగ్రెస్ నుండి వైసిపిలోకి వెళ్ళటానికి నేతలు క్యూలు కడుతున్నారు. మాజీ మంత్రి మహీధర్ రెడ్డి ఈరోజు వైసిపి కండువా కప్పుకోవటం ఇందులో భాగమే. ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో పదయాత్ర చేస్తున్న జగన్ అక్కడి నుండి విశాఖపట్నం జిల్లాలోకి ప్రవేశిస్తున్నారు.
జగన్ పై అంత నమ్మకమా ?

జగన్ పాదయాత్ర ఉత్తరాంధ్రలోకి ప్రవేశించేనాటికి కాంగ్రెస్ నుండి వైసిపిలో చేరటానికి మరికొందరు నేతలు సిద్దంగా ఉన్నట్లు సమాచారం. కిల్లి కృపారాణి, కోండ్రు మురళి, ద్రోణంరాజు శ్రీనివాస్ లాంటి నేతలతో పాటు వివిధ నియోజకవర్గాలకు చెందిన అనేకమంది ద్వితీయ శ్రేణి నేతలు కూడా రెడీ అవుతున్నారట. ఇతర పార్టీలో చేరిన నేతలను తిరిగి కాంగ్రెస్ లోకి రావాల్సిందిగా కోరుతున్నారు. ఇంకోవైపేమో కాంగ్రెస్ లో ఉన్న నేతలు కూడా ఇతర పార్టీల్లో చేరిపోతున్నారు. కోట్ల ఫ్యామిలీ కూడా రేపో మాపో వైసిపిలో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంటే కాంగ్రెస్ భవిష్యత్తుపై నేతల్లో పెద్దగా నమ్మకం లేకే అధ్యక్షుడి పిలుపును కూడా లెక్క చేయటం లేదు. చూడబోతే వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్ తరపున పోటీ చేయటానికి గట్టి నేతలు ఎవరైనా ఉంటారా అన్నది అనుమానంగా ఉంది.
5/
5 -
(1 votes)
Add To Favourite