రాజ‌కీయాలు ఎప్పుడు ఎలాగైనా మారొచ్చు. నాయ‌కులు వారి వారి ప‌రిస్థితి, అనుకూల‌త‌లే ప్రామాణికంగా ముందుకు సాగుతుంటారు. ఒక కుటుంబంలో మూడు పార్టీల‌కు చెందిన నాయ‌కులు ఉన్న ఫ్యామిలీలు కూడా ఉన్నాయి. నిన్న మొన్న‌టి వ‌రకు క‌ర్నూలు ఎంపీగా ఉన్న బుట్టా రేణుక వైసీపీ నుంచి ప్రాతినిధ్యం వ‌హించారు. కానీ, ఆమె భ‌ర్త నీల‌కంఠం మాత్రం..  టీడీపీలో సీనియ‌ర్ నేత‌. ఇలాంటి ఉదాహ‌ర‌ణ‌లు చాలానే ఉన్నాయి. ఇప్పుడు ఇలాంటి ఘ‌ట‌నే మ‌రొక‌టి చోటు చేసుకునే వాతావ‌ర‌ణం ఏపీలో క‌నిపిస్తోంది. మాజీ ప్రభుత్వ సలహాదారు, కేంద్ర ర‌క్ష‌ణ శాఖ మంత్రి నిర్మాలా సీతారామ‌న్ భ‌ర్త‌, పరకాల ప్రభాకర్‌ భవిష్యత్‌ రాజకీయంపై రాష్ట్రంలో ఆసక్తికరమైన చర్చ కొనసాగుతోంది. ఇటీవల ప్రభాకర్‌ ప్రభుత్వ సలహాదారు పదవికి రాజీనామా చేశారు. నాలుగేళ్ళ పాటు ఆయన ఆ పదవిలో కొనసాగారు. 


ప్రస్తుతం హైద్రాబాద్‌లో ఉంటున్నారు. దీంతో రానున్న రోజుల్లో ప్రభాకర్‌ రాజకీయ పరంగా ఏ..నిర్ణయం తీసుకుంటారన్న దానిపై అన్ని పార్టీల్లోనూ ఆసక్తికరమైన చర్చ నెలకొంది. గ‌తంలో ఈయ‌న చిరంజీవి పార్టీ పెట్టిన‌ప్పుడు ప్ర‌జారాజ్యంలో కీల‌కంగా మారారు. అవినీతి ర‌హితుడుగా, క్లీన్ ఇమేజ్ ఉన్న నాయ‌కుడిగా ప‌ర‌కాలకు మంచి పేరుంది. డీసెంట్ వ్య‌క్తిత్వం ఆయ‌న సొంతం. అలాంటి నేత‌.. అప్ప‌ట్లో ప్ర‌జారాజ్యంలో టికెట్లు అమ్ముకుంటు న్నార‌ని ఆరోపించి, బ‌హిరంగ విమ‌ర్శ‌లు చేసి మ‌రీ పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చారు. గతంలో ప్రభాకర్‌ నరసాపురం నుంచి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఒకసారి స్వల్ప మెజార్టీతో ఓటమి చెందారు. ఇక కాంగ్రెస్‌ పార్టీలో పలు పదవులు నిర్వహించారు. 


ఆ తరువాత బీజేపీలో చేరారు. నరసాపురం పార్లమెంట్‌ అభ్యర్థిగా ఆపార్టీ తరుపున పోటీ చేశారు. ఆ తరువాత ఉభయగోదావరి జిల్లాలా ఎమ్మెల్సీ స్ధానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. ఇటు పరకాల కుటుంబానికి నరసాపురంలో రాజకీయపరంగా ఎంతో పట్టు ఉంది. ఆయన తండ్రి శేషావతరం రెండు సార్లు కాంగ్రెస్‌ హయాంలో మంత్రిగా పనిచేశారు. ఇటు తల్లి కాళికాంబ ఒకసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ప్రభాకర్ సతీమణి నిర్మలా సీతారామన్‌ కేంద్ర కేబినెట్‌లో కీలక పదవి నిర్వహిస్తున్నారు. అయితే ప్రభాకర్‌ ప్రభుత్వ సలహాదారు పదవికి రాజీనామా చేసిన తరువాత మౌనం వహించారు. తన భవిష్యత్‌ రాజకీయాలపై స‌ర్వ‌త్రా  చ‌ర్చ సాగుతోంది. మ‌రో ప‌దిమాసాల్లోనే ఎన్నిక‌లు ఉన్న నేప‌థ్యంలో ఆయ‌న రాజ‌కీయాల్లోకి వ‌స్తార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. 


అయితే, ఏ పార్టీ అనేది మ‌రో చ‌ర్చ‌కు దారితీస్తోంది. ప్రస్తుతం ఆయ‌న స‌తీమ‌ణి.. బీజేపీలో ఉన్నారు. అయితే, ప‌ర‌కాల మాత్రం టీడీపీ వైపు చూస్తున్నార‌ని స‌మాచారం. త‌న‌ను ఎంతో ఆద‌రించి, ప్ర‌భుత్వ స‌ల‌హాదారుగా తీసుకున్న చంద్ర‌బాబు అంటే ప‌ర‌కాల‌కు ఎంతో గౌర‌వం ఉంది. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న టీడీపీ తీర్థం పుచ్చుకునే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. ఒకే ఫ్యామిలీలోని కుటుంబ స‌భ్యులు వివిధ పార్టీల్లో ఉన్న‌ట్టుగానే త‌మ ఫ్యామిలీ కూడా ఉంటుంద‌నేది ఆయ‌న మ‌న‌సులోని మాట‌. త్వ‌ర‌లోనే దీనిపై ఆయ‌న నిర్ణ‌యం తీసుకోబోతున్నార‌ని అంటున్నారు విశ్లేష‌కులు


మరింత సమాచారం తెలుసుకోండి: