ఏపీలో కాంగ్రెస్ ప‌రిస్థితి ఏంటి? అని ఏ ఎల్‌కేజీ పిల్లాడిని అడిగినా వెంట‌నే చెప్పే ప‌రిస్థితి ఉంది. కాంగ్రెస్ ఇప్పుడు ఎక్క‌డుంది..?  వెంటిలేట‌ర్ స్థాయిని కూడా దాటిపోయింది క‌దా!? అని అంద‌రూ అంటారు. కానీ, ఘ‌నత వ‌హించిన కేర‌ళ మాజీ సీఎంగారు ఊమెన్ చాందీ మాత్రం ఏపీలో కాంగ్రెస్‌తో బ్రేక్ డ్యాన్స్ చేయిస్తాన‌ని చెబుతున్నారు. అది కూడా రాబోయే ప‌ది మాసాల్లోనేన‌ని ఆయ‌న ఉద్ఘాటిస్తున్నారు. ఇందిరా గాంధీ హయాం నుంచి కష్టకాలమొచ్చిన ప్రతిసారీ ఆంధ్ర ప్రజలు కాంగ్రెస్‌ను తమ గుండెల్లో పెట్టుకున్నారని, అందుకే.. రాష్ట్రంలో పార్టీకి పూర్వవైభవం వస్తుందన్న గట్టి విశ్వాసం ఉందని, పార్టీ బలోపేతానికి వ్యూహాలు చాలానే ఉన్నాయ‌ని చాందీ గారు చాక‌చ‌క్యంగా చెప్పుకొచ్చారు. 

Image result for congress oommen chandy

మ‌రి అంత‌టి విశ్వాసం ప్ర‌జ‌ల్లో పార్టీకి ఉన్న‌ప్పుడు.. అలాంటి ప్ర‌జ‌ల విశ్వాసంపై ఎందుకు దెబ్బ‌కొట్టారో?  నాడు పార్ల‌మెంటును మూసి విభ‌జ‌న ఎందుకు చేశారో.. చాందీగారు నిస్సిగ్గుగా చెప్పుకొవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ కు, ఇతర పార్టీలకు మధ్య ఓట్ల తేడా భారీగా ఉంద‌ని, ఈ గండిని పూడ్చడంపైనే దృష్టి సారించానని చాందీ చెబుతున్నారు. ముందుగా పార్టీ సీనియర్‌ నేతలతో మాట్లాడుతున్నానని, ఇతర పార్టీల్లోకి వెళ్లిన ముఖ్య నేతలతో సంప్రదింపులు జరుపుతున్నానని,  కాంగ్రెస్‌ సానుభూతిపరులు వైసీపీ ఎవరెవరితో పొత్తులకు సిద్ధమవుతోందో ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నార‌ని కూడా ఆయ‌న వెల్ల‌డించారు.  


వైసీపీ నుంచీ వలసలు ఉంటాయ‌ని ఆయ‌న ప‌లికారు.  నిజ‌మే.. ఎవ‌రైనా.. బ‌తికి బ‌ట్ట‌క‌డుతుంద‌నుకున్న పార్టీకి ఓట్లేస్తారు.. జై కొడ‌తారు! కానీ, కాంగ్రెస్ ప‌రిస్థితి నానాటికీ తీసిక‌ట్టుగా ఉన్న నేప‌థ్యంలో ఎవ‌రు ఆ పార్టీతో క‌లిసి వ‌స్తారు? అనేది చాందీగారు సెల‌వివ్వాల్సి ఉంటుంది. ఇక‌, మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో, ఇతర నేతలతో సంప్రదింపులు జరిగాయ‌ని అంటున్నారు. కిరణ్‌ రాక కోసం ఎదురుచూస్తున్నామ‌ని చెబుతున్నారు.  ఎలాంటి గుర్తింపు లేకుండా మూల‌న‌బ‌డిన వ్య‌క్తిని తెచ్చి సీఎంను చేస్తే.. ఆయ‌నే పార్టీని కాద‌ని వెళ్లి సొంత‌పార్టీ పెట్టుకున్నారు. ఇప్పుడు ఇన్నిసార్లు బ్ర‌తిమాలినా.. క‌నీసం త‌న మ‌న‌సులో మాట‌ల‌ను సైతం చెప్ప‌డం లేదు. వ‌చ్చేదీ రానిదీ కూడా ఆయ‌న వెల్ల‌డించ‌డం లేదు. వ‌స్తే.. కాంగ్రెస్ కు పున‌ర్జీవితం వ‌స్తుందా? అనేది ఆయ‌న పెద్దఅనుమానం. 

Image result for undavalli arun

అదేస‌మ‌యంలో.. సీనియ‌ర్లుగా ఉండి గ‌తంలో మంత్రి ప‌ద‌వులు అనుభ‌వించిన వారు ప్ర‌స్తుతం బీజేపీలో ఉన్న నాయ‌కుల‌ను కూడా ర‌ప్పించ‌లేని ప‌రిస్థితి కాంగ్రెస్ వ‌ద్ద ఉంది. కాంగ్రెస్ పుంజుకుంటుంద‌న్న న‌మ్మ‌కం త‌న‌కేమాత్రం లేద‌ని ఇటీవ‌లే రాజ‌మండ్రి మాజీ ఎంపీ.. ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్ బాహాటంగానే చెప్పుకొచ్చారు. మ‌రి ఇలాంటి ప‌రిస్థితిలో కాంగ్రెస్ బతుకుతుందా?  చాందీ గారు. ఇప్ప‌టికైనా ఓ బ‌హిరంగ స‌భ పెట్టి.. విభ‌జ‌నపై క్ష‌మాప‌ణ‌లు చెబితేకానీ, ప్ర‌జ‌ల్లో ఉన్న ఆగ్ర‌హం చ‌ల్లారేప‌రిస్థితి లేదు. మ‌రి గ‌మ‌నిస్తారా?  లేదా?! 


మరింత సమాచారం తెలుసుకోండి: