ఏపీలో రాజ‌కీయ ప‌రిణామాలు వేగంగా మారుతున్నాయి.. ముఖ్యంగా.. గ‌త ఎన్నిక‌ల్లో చిత్తుగా ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ ఈసారి స‌త్తాచాటేందుకు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేసింది.. ఇందులో భాగంగా.. ఉమ్మ‌డి రాష్ట్ర చివ‌రి ముఖ్య‌మంత్రి కిర‌ణ్‌కుమార్‌రెడ్డి ఈరోజు మ‌ళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేర‌డంతో రాజ‌కీయ ప‌రిణామాలు అనూహ్యంగా మారే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. రాష్ట్ర విభ‌జ‌న నేపథ్యంలో 2014ఎన్నిక‌ల్లో ప‌లువురు కీల‌క కాంగ్రెస్ నేత‌లు ఇత‌ర పార్టీల్లోకి వెళ్లారు.. ఇందులో సుమారు 40మంది కీల‌క నేత‌లతో మాట్లాడామ‌నీ.. వారు కూడా త్వ‌ర‌లో కాంగ్రెస్ పార్టీలో చేరుతార‌ని కిర‌ణ్‌కుమార్‌రెడ్డి ప్ర‌క‌టించ‌డంతో ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది. 


కేంద్రంలో అధికారంలోకి వ‌స్తే ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని రాహుల్‌గాంధీ ఇచ్చిన హామీ మేర‌కే వీరు పార్టీలోకి చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. ఢిల్లీలో రాహుల్‌గాంధీ స‌మ‌క్షంలో పార్టీలో చేరిన త‌ర్వాత జ‌రిగిన విలేక‌రుల స‌మావేశంలో కిర‌ణ్‌కుమార్‌రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్ర‌ విభ‌జ‌న చ‌ట్టం పూర్తిగా అమ‌లు చేయాల‌న్నా.. విభ‌జ‌న హామీల‌న్నీ నెర‌వేరాల‌న్నా.. ఒక్క కాంగ్రెస్ పార్టీతోనే సాధ్య‌మ‌వుతుంద‌ని కిర‌ణ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ పార్టీలోకి రావ‌డం చాలా సంతోషంగా ఉంద‌నీ... పార్టీ వ‌ల్లే త‌మ కుటుంబానికి ఇంత‌టి గుర్తింపు వ‌చ్చింద‌నీ.. శాయ‌శ‌క్తులా క‌ష్ట‌ప‌డి ప‌నిచేస్తేనే.. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌స్తే.. విభ‌జ‌న హామీలు నెర‌వేరుతాయ‌ని అన్నారు. 

Image result for ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి

అంతకుముందు ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విభ‌జ‌న భావోద్వేగ ప‌రిస్థితుల్లో ప‌లువురు కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు ఇత‌ర పార్టీల్లోకి వెళ్లార‌నీ.. కానీ ఇప్పుడు వారంతా మ‌ళ్లీ వ‌చ్చేందుకు సిద్దంగా ఉన్నార‌ని చెప్పారు. ఇక పార్టీ రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇన్‌చార్జి ఉమెన్‌చాందీ మాట్లాడుతూ ముఖ్య‌మంత్రిగా కిర‌ణ్‌కుమార్‌రెడ్డి రాష్ట్రానికి ఎంతో చేశార‌నీ అన్నారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కిర‌ణ్ చేరిక‌తో ఆంధ్రుల ఆలోచ‌నా విధానం మారుతుందా..? అన్న‌దే ఇప్పుడు పెద్ద ప్ర‌శ్న‌గా ఉంది. అయితే రెండు జాతీయ పార్టీలో ఒక‌టైన బీజేపీ ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌డం సాధ్యం కాద‌నీ తేల్చి చెప్పింది. 

Image result for kiran kumar xm cm

తాము అధికారంలోకి వ‌స్తే మొద‌టి సంత‌కం... ఏపీకి ప్ర‌త్యేక హోదాపైనేన‌ని ఇప్ప‌టికే పార్టీ అధ్య‌క్షుడు రాహుల్‌గాంధీ ప్ర‌క‌టించారు. రాష్ట్ర విభ‌జ‌న చ‌ట్టాన్ని రూపొందించింది కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీయే కాబ‌ట్టి.. కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తే ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇస్తుంద‌న్న భావ‌న కూడా ఇప్పుడు ఆంధ్రుల్లో ఏర్ప‌డుతుంద‌న్న టాక్ వినిపిస్తోంది. ఇక మిగ‌తా పార్టీలు టీడీపీ, జ‌న‌సేన‌, వైసీపీలు ప్రాంతీయ పార్టీలేన‌నీ.. విభ‌జ‌న హామీలు అమ‌లు కావాలంటే మ‌రో జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌తోనే సాధ్య‌మ‌వుతుంద‌ని ఆ పార్టీ వ‌ర్గాలు అంటున్నాయి. 


రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత ఏపీలో కాంగ్రెస్ ఎలా భూస్థాపితం అయ్యిందో అంద‌రికి తెలిసిందే. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత వైసీపీ కాంగ్రెస్‌ను ఎలా దెబ్బ‌కొట్టిందో అంత‌కుమించి జై స‌మైక్యాంధ్ర పార్టీ ద్వారా కిర‌ణ్‌కుమార్ రెడ్డి కూడా దెబ్బ‌కొట్టారు. మ‌ళ్లీ ఇప్పుడు అదే కిర‌ణ్ కాంగ్రెస్‌లోకి వ‌చ్చి ఏపీ జ‌నాల్లోకి ఓ మాజీ ముఖ్య‌మంత్రిగా ఎలా వెళ‌తాడు ?  ఏం చెపుతాడు ?  కాంగ్రెస్ మీద జ‌నాల్లో ఎలా న‌మ్మ‌కం క‌లిగిస్తాడు ? అన్న‌ది చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: