అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ ఏర్పాట్లపై టీటీడీ ధర్మకర్తల మండలి ప్రత్యేక సమావేశం శనివారం జరుగనుంది.  కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఆగస్టు 11 నుండి 16వ తేదీ వరకు అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణం జరుగనున్న నేపథ్యంలో, ఈ 6 రోజుల పాటు స్వామివారి దర్శనాలను పూర్తిగా నిలిపివేశామని టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ పుట్టా సుధాకర్‌ యాదవ్‌ తెలిపారు. 

Image result for అష్టబంధన బాలాలయ  మహాసంప్రోక్షణ

టిటిడి ధర్మకర్తల మండలి అత్యవసర సమావేశం శనివారం ఉదయం తిరుమలలోని అన్నమయ్య భవనంలో జరిగింది. అనంతరం ఛైర్మన్‌ మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి ఆలయంలో ప్రతి 12 సంవత్సరాలకోసారి నిర్వహించే అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణం ఆగస్టు 12 నుండి 16వ తేదీ వరకు శాస్త్రోక్తంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆగస్టు 11న అంకురార్పణంతో ఈ వైదిక కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు.

శ్రీవారి ఆలయ మహాసంప్రోక్షణ జరిగే రోజుల్లో వైదిక కార్యక్రమాలు, శాంతిహోమాలకు ఎక్కువ ప్రాధాన్యత వుంటుంది కావున భక్తులకు దర్శనం కల్పించేందుకు కొన్ని గంటలు మాత్రమే సమయం ఉండటంతో ఆగస్టు 11 నుండి 16వ తేదీ వరకు 6 రోజుల పాటు శ్రీవారి దర్శనాలను టిటిడి నిలిపివేయాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు.  

ఇందులో భాగంగా ఆగస్టు 9వ తేదీ సాయంత్రం 6.00 గంటల నుండి భక్తులను క్యూలైన్లు మరియు వైకుంఠం కంపార్టుమెంట్లలోనికి అనుమతించరని తెలియచేశారు. ఆగస్టు 17వ తేదీ ఉదయం 6.00 గంటల నుండి భక్తులకు దర్శనం పున: ప్రారంభమవుతుందన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని భక్తులు తమ తిరుమలయాత్రను రూపొందించుకోవాలని ఛైర్మన్‌ భక్తులకు విజ్ఞప్తి చేశారు.  


27న పున్నమి గరుడ సేవ రద్దు :
చంద్రగ్రహణం కారణంగా ఈ నెల 27వ తేదీన తిరుమలలో జరగాల్సిన గరుడసేవను టీటీడీ రద్దు చేసింది. ఆరోజు సాయంత్రం 5 నుంచి మరుసటి రోజు తెల్లవారుజాము 4.15 గంటల వరకు తిరుమల వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని మూసివేస్తారు. ఈ నేపథ్యంలో ప్రతినెల నిర్వహించే పున్నమి గరుడసేవను టీటీడీ రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. దాదాపు 75 వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సర్వదర్శనానికి సుమారు 24 గంటలు, స్లాటెడ్‌ సర్వ, దివ్యదర్శనాలకు దాదాపు 3 గంటల సమయం పడుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: