కర్నూలు జిల్లాలో ప‌లువురు నేత‌లు త‌మ వార‌సుల‌ను ఈసారి బ‌రిలోకి దించేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. వారు ప్ర‌జ‌ల‌తో మ‌మేకం అయ్యేలా కార్య‌క్ర‌మాలు రూపొందిస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగైనా టికెట్లు సంపాదించుకోవ‌డానికి అన్ని దారులు వెతుకుతున్నారు. ఇందులో కొంద‌రు ముందు వ‌రుస‌లో ఉండ‌గా.. మ‌రికొంద‌రు కాస్త వెన‌బడుతున్నారు.. ఎన్నిక‌ల‌కు ఇంకా చాలా స‌మ‌యమే ఉండ‌డంతో అప్ప‌టివ‌ర‌కు ఎలాగైనా రేసులో గెలుస్తామ‌న్న ధీమాను వ్య‌క్తం చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో పోటీకి జిల్లాలోని వివిధ నియో జకవర్గాల్లో ఆరుగురు వారసులు కసరత్తు చేస్తున్నారు. 


జిల్లాలోని పత్తికొండ నియోజ‌క‌వ‌ర్గం నుంచి తన వారుసుడిగా కేఈ శ్యాంబాబు పోటీ చేస్తారని ఇప్పటికే డిప్యూటీ సీఏం కేఈ కృష్ణమూర్తి ప్రకటించడం గ‌మ‌నార్హం. ఆయ‌న ఇప్ప‌టికే నియోజ‌క‌వ‌ర్గంలో దూసుకు పోతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీకి అస్త్ర‌శ‌స్త్రాలు రెడీ చేసుకుంటున్నారు. ఆళ్లగడ్డ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి తనయుడు గంగుల బిజేంద్రారెడ్డి , నంద్యాల నుంచి మాజీ మంత్రి శిల్పా మోహన్‌రెడ్డి వారుసుడిగా శిల్పా రవిచంద్ర కిశోర్‌ రెడ్డి పోటీ చేసేందుకు క‌స‌ర‌త్తు చేస్తున్నారు. అదేవిధంగా కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి తన వారసుడిగా కోట్ల రాఘవేంద్రరెడ్డిని  తెరపైకి తెచ్చేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. 


ఇక కర్నూలు అర్బన్‌ అసెంబ్లీ స్థానం నుంచి తన తనయుడు టీజీ భరత్‌ను పోటీకి దింపాలని రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశారు. మంత్రాలయం నుంచి ఎమ్మెలే బాలనాగిరెడ్డి రాజకీయ వారసుడిగా ఆయన అన్న, మాజీ ఎంపీపీ సీతారామిరెడ్డి కుమారుడు వై.ప్రదీప్‌రెడ్డి కూడా బ‌రిలోకి దిగేందుకు ఇప్ప‌టి నుంచే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.  నంద్యాలలో మాజీ మంత్రి శిల్పామోహన్‌ రెడ్డి కుమారుడు శిల్పా రవిచంద్ర కిషోర్‌ రెడ్డి వచ్చే ఎన్నిక‌ల్లో  వైసీపీ త‌రుపున‌ నంద్యాల నుంచి బ‌రిలోకి దిగేంద‌కు ముమ్మ‌రంగా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అవ‌స‌ర‌మైతే ఎంపీ స్థానం నుంచి కూడా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఈ దిశగా ఆయ‌న కార్య‌క్ర‌మాలు కూడా చేప‌డుతున్నారు. ఇందుకు జ‌గ‌న్ కూడా సానుకూలంగా ఉన్న‌ట్లు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి.  


అదేవిధంగా ఆళ్లగడ్డలో ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌ రెడ్డి తనయుడు గంగుల బిజేంద్రారెడ్డి (నాని) రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ మేర‌కు నియోజ‌క‌వ‌ర్గంలోనూ ఆయ‌న చురుగ్గా తిరుగుతున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో  ఏ కార్య‌క్ర‌మం చేప‌ట్టినా నాని పాల్గొంటూ అటు క్యాడ‌ర్‌కు ఇటు ప్ర‌జ‌ల‌కు చేరువ అయ్యేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నారు. 
రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్  త‌న‌యుడు యువ పారిశ్రామిక‌వేత్త‌ టీజీ భరత్ సామాజిక సేవ‌ల‌తోపాటు యువ‌జ‌న కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నారు. టీడీపీ కార్య‌క్ర‌మాల్లోనూ  చురుగ్గా పాల్గొంటున్నారు. 


ఇక్క‌డ మంత్రి లోకేశ్ చిన్న ట్విస్ట్ ఇచ్చారు. ఇటీవల కర్నూలులో ప‌ర్య‌టించిన మంత్రి లోకేశ్‌ ఎస్వీ మోహన్‌ రెడ్డిని పరోక్షంగా తమ అభ్యర్థిగా ప్రకటించ‌డం గ‌మ‌నార్హం. కానీ, వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగైనా టీజీ భరత్‌ను బరిలో దింపాల‌న్న ప‌ట్టుద‌ల‌తో టీజీ ఉన్న‌ట్లు తెలుస్తోంది.  ప్ర‌స్తుతం కేఈ వారసుడు శ్యాంబాబు ప‌త్తికొండ నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జిగా కొన‌సాగుతున్నారు. పార్టీ కార్య‌క్ర‌మాల్లో చురుగ్గా వ్య‌వ‌హరిస్తూ అటు ప్ర‌జ‌ల్లో ఇటు పార్ట అధిష్టానం వ‌ద్ద మంచి కొట్టేసేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇక మంత్రాలయంలో ఎమ్మెల్యే బాల‌నాగిరెడ్డి ప్రోత్సాహంతో ప్ర‌దీప్‌రెడ్డి ముందుకు వెళ్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: