తెలంగాణా రాష్ట్ర పండుగైన బోనాల జాతర మన నవాబుల గడ్డ భాగ్యనగర గోల్కొం డ కోటలో అంగరంగ వైభవోపేతంగా ప్రారంభమైంది. ఆదివారం ఉదయం లంగర్‌హౌస్‌చౌరస్తా నుంచి బయలుదేరిన అమ్మవారి తొట్టెల ఊరేగింపులో తెలంగాణా రాష్ట్ర మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి,తలసాని శ్రీనివాస్‌యాదవ్, పద్మారావు అమ్మవారికి పట్టువస్ర్తాలు, పసుపు,కుంకుమ, గాజులు, ఫల, పుష్పాలను సాంప్రదాయ బద్దంగా సమర్పించుకున్నారు. సరాసరి అక్కడ నుంచి మొదలైన ఆషాడ మాసం బోనాల ఊరేగింపు పోతరాజుల వీరంగ ప్రదర్శనలు, శివసత్తుల పూనకాల ఊపుల  మధ్య బడాబజార్ మీదుగా మధ్యాహ్నం కోటలోని ఆలయ పూజారి సర్వేశకుమార్‌చారి ఇంటికి చేరుకుంది. తదనంతరం గోల్కొండ కోటలోని పటేల్ లక్ష్మమ్మ ఇంటి నుంచి అమ్మవారికి సిద్ధం చేసిన బోనాన్ని ఆలయానికి తీసుకొచ్చారు.

Image result for telangana bonalu

ఆలయ పూజారి ఇంట్లో తెల్లవారుజామనుంచి శుద్ధి, అలంకరణ, పూజా కార్యక్రమాలతో సిద్ధం చేసిన ఉత్సవ విగ్రహాలకు పూజలు నిర్వహించి గోల్కొండ కోటకు తొట్టెల ఊరేగింపు ప్రారంభమైంది.ఇక అసలు విషయానికొస్తే ప్రతీ ఏడులాగే ఈ ఏడాది కూడా ఇసుకేస్తే రాలనంత జన ప్రవాహంతో బైలెల్లిన బోనాల జాతర కోటలోకి ప్రవేశించే సందర్భంలో పోతరాజులు వీరంగాలతో ఉవ్వెత్తున ఊగిపోయారు. జనం కోటకు పోటెత్తడంతో ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు సాధారణ క్యూలైన్లలో కాకుండా పూర్తిగా గేట్లను తెరిచి కోటలోకి అమ్మవారి బోనాల దర్శనానికి అనుమతించారు.


గతంలో పలు ఆంక్షలతో బోనాల జాతరకు అనుమతించని అధికారులు ఈ ఏడాది భక్తులకు సకల సౌకర్యాలు కల్పించేందుకు అన్నివిధాల సహకరించి అనుమతించారు. కోట ప్రాంగణంలో ఆటపాటలతో సాగిన తొట్టెల ఊరేగింపు సాయంత్రం 6గంటలకు దర్బార్‌కు సమీపంలోని ఎల్లమ్మ (శ్రీజగదాంబ మహంకాళి) ఆలయానికి చేరుకున్నది. అమ్మవారిని మంత్రులు సమర్పించిన పట్టువస్ర్తాలు,పూలతో అలంకరించి బోనం సమర్పించారు. ఈ బోనం సమర్పించడానికి ముందే నగరం నలుమూలల నుంచి భక్తులు గోల్కొండకు తండోపతండాలుగా తరలివచ్చి బోనాలు సమర్పించారు. ఉదయం నుంచే మొదలైన బోనాల సమర్పణ కోసం అమ్మవారికి అర్ధరాత్రి 3 గంటలకే శుద్ధి, అలంకరణ చేపట్టి తొలిపూజ నిర్వహించారు.

Image result for telangana bonalu

కోటలో బోనాల జాతర ముగిసే వరకు నిత్యం 50 మంది కళాకారులతో బోనాల విశిష్టతను తెలిపే ప్రదర్శనలను నిర్వహిస్తామని భాషాసాంస్కృతికశాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ మీడియాతో పేర్కొన్నారు. ఊరేగింపులో 500 మంది కళాకారులు పాల్గొన్నారు. ఈ తొట్టెల ఊరేగింపులో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, ఎంపీ బండారు దత్తాత్రేయ, బీజేపీ శాసనసభాపక్షనేత జీ కిషన్‌రెడ్డి, బీజేపీ నేత బద్దం బాల్‌రెడ్డి, జాయింట్ కలెక్టర్ శ్రీవత్స, ఆర్డీవో చంద్రకళ,దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ బాలాజీ, గోల్కొండ జగదాంబ మహంకాళి ఆలయ కార్యనిర్వాహక అధికారి మహేందర్, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Image result for telangana bonalu

బోనాల జాతరకు ప్రసిద్ధి గాంచిన లష్కర్ బోనాలకు శ్రీకారం చుడుతూ ఎదుర్కోలు ఘటోత్సవాన్ని ఆదివారం కర్బలా మైదానంలో నల్లపోచమ్మ గుడిలో మంత్రి తలసాని ప్రారంభించారు. అక్కడి నుంచి ఉజ్జయినీ మహంకాళీ ఆలయం వరకు ఘటాలను ఊరేగించారు. ఈ ఘటోత్సవాన్ని సికింద్రాబాద్‌లోని రోజుకో వీధిలో 15 రోజులపాటు నిర్వహిస్తారు. ఈ నెల 29, 30 తేదీల్లో లష్కర్ బోనాల జాతర నిర్వహిస్తారు.



మరింత సమాచారం తెలుసుకోండి: