చంద్ర‌బాబునాయుడుకు కాంగ్రెస్ పార్టీ షాకివ్వ‌నున్న‌దా ? క్షేత్ర‌స్ధాయిలో జ‌రుగుతున్న ప‌రిణామాలు చూస్తుంటే అవున‌నే అనిపిస్తోంది.  ప్ర‌త్యేక‌హోదా విష‌యంలో కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టాల‌ని కాంగ్రెస్ నిర్ణయించ‌టం చంద్ర‌బాబుకు ఒక విధంగా షాకే అని చెప్పాలి.  ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్నాయి క‌దా ?  జ‌నాల‌కు ద‌గ్గ‌ర‌య్యేందుకు ఇటు కాంగ్రెస్, అటు తెలుగుదేశం  రెండు పార్టీలు అవ‌స్త‌లు ప‌డుతున్నాయి.  కాంగ్రెస్సేమో పూర్వ వైభ‌వాన్ని అందుకోవ‌టానికి ఆప‌సోపానాలు ప‌డుతుండ‌గా, చంద్ర‌బాబేమో జ‌నాల సెంటిమెంటును క్యాష్ చేసుకోవ‌టం ఎలాగా అని వ్యూహాలు ప‌న్నుతున్నారు. 


కాంగ్రెస్ వ్యూహాత్మ‌కం

Image result for congress party symbol

ఇంత‌కీ విష‌యం ఏమిటంటే,  బుధ‌వారం నుండి ప్రారంభ‌మ‌వ‌నున్న పార్ల‌మెంటు స‌మావేశాల్లో కేంద్ర‌ప్ర‌భుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్ర‌వేశ‌పెట్టేందుకు చంద్ర‌బాబు వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. జాతీయ స్ధాయిలోని పార్టీల అధినేత‌ల‌కు ఈ మేర‌కు లేఖ‌లు కూడా రాశారు. పార్టీల మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టేందుకు టిడిపి ఎంపిల తో ఆరు బృందాల‌ను ఏర్పాటు చేశారు.  ఉభ‌యస‌భ‌ల్లో ఆందోళ‌న‌లు చేయ‌టం లాంటి వాటికి కూడా ప్లాన్ చేస్తున్నారు లేండి. ప్ర‌త్యేక‌హోదాపై పోరాడుతున్న‌ది తామే అనే బిల్డ‌ప్ ఇవ్వ‌టానికి చంద్ర‌బాబు రంగం సిద్ధం చేసుకున్నారు. ఎటూ లోక్ స‌భ‌లో వైసిపి ఎంపిలు లేరు కాబ‌ట్టి చంద్ర‌బాబు ఇపుడు రెచ్చిపోతున్నారు.


అవిశ్వాస తీర్మానానికి కాంగ్రెస్


ఇటువంటి స‌మ‌యంలోనే కాంగ్రెస్ తీసుకున్న నిర్ణ‌యం చంద్ర‌బాబుకు షాక్ ఇచ్చింది. రానున్న పార్ల‌మెంటు స‌మావేశాల్లో కేంద్రంపై తామే అవిశ్వాస తీర్మానం ప్ర‌వేశపెడ‌తామ‌ని కాంగ్రెస్ రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇన్చార్జి ఊమెన్ చాంది తాజాగా ప్ర‌క‌టించారు. రాష్ట్రంలో పూర్వ వైభ‌వం కాక‌పోయినా క‌నీసం ఉనికినైనా చాటుకోవాలంటే కాంగ్రెస్ త‌న చిత్త‌శుద్దిని నిరూపించుకోవాలి. అందుక‌నే అవిశ్వాస తీర్మాన‌మంటూ చాంది ప్ర‌క‌టించారు. తీర్మానం ప్ర‌వేశ‌పెట్ట‌టం కాంగ్రెస్ కు చాలా అవ‌స‌రం కూడా.  దాంతో చాంది ప్ర‌క‌ట‌న‌తో చంద్ర‌బాబుకు ఇబ్బందులు మొద‌ల‌య్యాయి.

కాంగ్రెస్ బ‌లం స‌రిపోతుంది


ఎలాగంటే, లోక్ స‌భ‌లో కాంగ్రెస్ కు దాదాపు 50 మంది ఎంపిలున్నారు. తీర్మానం ప్ర‌వేశ‌పెట్టాలంటే ఒక్క స‌భ్యుడున్నా చాలు. కాక‌పోతే తీర్మానం చ‌ర్చ‌కు రావాలంటే మాత్రం క‌నీసం 55 మంది స‌భ్యుల మ‌ద్ద‌తుండాలి. తీర్మానాన్ని కాంగ్రెస్సే ప్ర‌వేశ‌పెడుతోందంటే యూపిఏ మ‌ద్ద‌తుంటుంద‌నే అర్ధం. అంటే అవ‌స‌ర‌మైన బ‌లం క‌న్నా ఎక్కువే దొరికిన‌ట్లు లెక్క‌. అదే చంద్ర‌బాబు విష‌యం తీసుకుంటే దానికున్న బ‌లం కేవలం 15 మాత్ర‌మే. అంటే ఇంకా 35 మంది స‌భ్యుల మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టాలి. యూపిఏలో ఉన్న పార్టీలు కాకుండా ఇత‌ర‌త్రా పార్టీల్లో ఏ పార్టీ చంద్ర‌బాబుకు మ‌ద్ద‌తిస్తోందో స్ప‌ష్ట‌త లేదు. కాబ‌ట్టి లాజిక్ ప్ర‌కారం చూస్తే  కాంగ్రెస్ ప్ర‌వేశ‌పెట్టే  అవిశ్వాస తీర్మానాన్నే స్పీక‌ర్ ప‌రిగ‌ణ‌లోకి తీసుకునే  అవ‌కాశ‌మే ఎక్కువ. ఇదంతా స్పీక‌ర్ చ‌ర్చ‌కు అనుమ‌తిచ్చిన‌పుడే లేండి. 


గింజుకుంటున్న చంద్ర‌బాబు

Image result for chandrababu naidu

సో, ఏ విధంగా చూసినా చంద్ర‌బాబుకు కాంగ్రెస్ షాకిచ్చింద‌నే చెప్పాలి. గ‌తంలో కూడా ఇదే అంశంపై కాంగ్రెస్ పార్టీ రాజ్య‌స‌భ‌లో ప్రైవేటు మెంబ‌ర్ బిల్లు ప్ర‌వేశపెట్టిన విష‌యం గుర్తుంచుకోవాలి. అప్ప‌ట్లో కెవిపి రామ‌చంద్ర‌రావు ప్ర‌వేశపెట్టిన ప్రైవేటు మెంబ‌ర్  బిల్లుతో రాజ్య‌స‌భ‌లో బిజెపి షేకైంద‌నే చెప్పాలి. ఏదో దొడ్డిదోవ‌న టిడిపి మ‌ద్ద‌తుతో ప్రైవేటు మెంబ‌ర్ బిల్లును చ‌ర్చ‌కు రాకుండా బిజెపి అడ్డుకోగలిగింది. తాజా ప‌రిస్ధితుల్లో కాంగ్రెస్ ఇచ్చిన షాక్ నుండి  చంద్ర‌బాబు ఎలా బ‌య‌ట‌ప‌డ‌తారో  చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: