తొంద‌ర‌ప‌డి ఒక కోయిల ముందే కూసింది.. అనే వ్యాఖ్య అంద‌రికీ గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు దీనిని వైఎస్సార్ సీపీ ఎంపీలు మ‌ళ్లీ గుర్తుచేస్తున్నారా? అంటే అవున‌నే అంటున్నారు విశ్లేష‌కులు. ఏపీకి ప్ర‌త్యేక హోదా అంశం మ‌ళ్లీ తెర‌పైకి రావ‌డంతో ఢిల్లీ రాజ‌కీయాలు హీటెక్కాయి. టీడీపీ ఇచ్చిన అవిశ్వాసంపై చర్చ‌కు స్పీక‌ర్ అనుమ‌తించ‌డంతో ఏం జ‌రుగుతుందోననే అంతా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. హోదా పోరాటాన్ని నాలుగేళ్లుగా స‌జీవంగా ఉంచి చివ‌ర‌కు త‌మ ప‌ద‌వుల‌ను కూడా వ‌దులుకునేందుకు సిద్ధ‌మయ్యారు వైఎస్సార్ సీపీ ఎంపీలు! అవిశ్వాస తీర్మానం పెట్టినా దానిని చ‌ర్చ‌కు అనుమ‌తిలేదనే కార‌ణంతో వీరు రాజీనామాలు చేసిన విషయం తెలిసిందే! అయితే వైఎస్సార్ సీపీ ఎంపీలకు రావాల్సిన క్రెడిట్ అంతా ఇప్పుడు టీడీపీ ఖాతాలోకి వెళ్లిపోతోంద‌నే చ‌ర్చ మొద‌లైంది. ఇప్పుడు పెట్టిన అవిశ్వాసం త‌మ వ‌ల్లే అని పార్ల‌మెంటు బ‌య‌ట ప్ర‌సంగాలు ఇవ్వ‌డం మిన‌హా వాళ్లు ఇప్పుడు చేసే పోరాట‌మేంట‌నే ప్ర‌శ్న వినిపిస్తోంది!

Image result for parliament india

రాజ‌కీయాల్లో స‌రైన స‌మ‌యంలో స‌రైన నిర్ణ‌యాలు తీసుకోవాలంటారు. ఒక్కోసారి మనం తీసుకునేది మంచి నిర్ణ‌య‌మే అయినా.. అది తీసుకున్న టైమ్ స‌రైన‌ది కాక‌పోతే దాని గురించి ప‌ట్టించుకునే వారే ఉండ‌రు. ప్ర‌స్తుతం వైఎస్సార్ సీపీ ఎంపీల రాజీనామా అస్త్రం కూడా అలాంటిదే అంటున్నారు విశ్లేష‌కులు. నాలుగేళ్లుగా హోదా పోరాటాన్ని భుజాలపై మోస్తూ వచ్చింది వైఎస్సార్‌సీపీ! ఆ పార్టీ అధినేత జ‌గ‌న్‌.. యువ‌భేరీలు, దీక్ష‌లు, స‌మావేశాల పేరుతో ప్ర‌జ‌ల్లో హోదా కాంక్ష‌ను స‌జీవంగా ఉంచేందుకు ప్ర‌య‌త్నించారు. కేంద్రం తీరుతో ఏపీకి తీవ్ర న‌ష్టం జ‌రుగుతోందంటూ టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప్ర‌క‌టన అనంతరం రాజ‌కీయ మార్పులు శ‌ర‌వేగంగా జ‌రిగిపోయాయి. టీడీపీ-బీజేపీ మ‌ధ్య క‌టీఫ్ అయిపోవ‌డంతో మ‌ళ్లీ ఏపీ ప్ర‌యోజ‌నాల అంశంపై చ‌ర్చ‌ మొద‌లైంది. దీంతో మ‌ళ్లీ హోదా తెర‌పైకి వ‌చ్చింది. హోదాతో లాభమేంట‌న్న‌ చంద్ర‌బాబు.. ఏపీకి హోదా ఇవ్వాల్సిందే నంటూ  యూ టర్న్ తీసుకున్నారు.

Related image

వ‌చ్చే ఎన్నిక‌ల్లో హోదా అనేది కీల‌కం కానుంద‌ని ముందే గ్ర‌హించిన నేత‌లు.. త‌మ పోరాటాలు ఉద్ధృతం చేశారు. ఇందులో భాగంగా వైఎస్సార్‌సీపీ అధినేత సంచ‌ల‌నం నిర్ణ‌యం ప్ర‌క‌టించారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు త‌మ పార్టీ ఎంపీలు రాజీనామా చేస్తార‌ని చెప్పారు.. అలాగే చేయించారు. మ‌రి దీనివ‌ల్ల వ‌చ్చిన ప్ర‌యోజ‌న‌మేంటి? అనేది ఇప్పుడు ప్ర‌ధాన చ‌ర్చ‌! ప్ర‌స్తుతం పార్ల‌మెంటు వ‌ర్షాకాల స‌మావేశాలు మొద‌ల‌య్యాయి. ఇందులో అనుస‌రించాల్సిన వ్యూహాల‌పై చంద్ర‌బాబు త‌మ పార్టీ ఎంపీల‌తో పాటు ఇతర పార్టీ నేత‌ల‌తో మాట్లాడారు. గ‌త‌సారి ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై చ‌ర్చ జ‌రిగేలా అన్ని పార్టీల‌ను ఒప్పించారు. దీంతో హోదా పోరాటంలో ఇన్నాళ్లూ వెనుక‌బ‌డిన టీడీపీ.. ఒక్క‌సారిగా వైసీపీని దాటి ముందుకు వెళ్లిపోయింది. అవిశ్వాసంపై చ‌ర్చ జ‌రిగేలా చేయ‌డంలో చంద్ర‌బాబు వ్యూహం ఫ‌లిస్తే.. ఇదే స‌మ‌యంలో జ‌గ‌న్ నిర్ణ‌యం మాత్రం వృథాగా మిగిలిపోయిందంటున్నారు విశ్లేష‌కులు!

Image result for ap special status

గ‌త పార్ల‌మెంటు స‌మావేశాల్లోనే రాజీనామాలు ఎందుకు చేయాల‌ని ప్ర‌శ్నిస్తున్నారు! ప్ర‌జ‌ల్లో హోదా కాంక్ష ఉన్నా.. దానిని తెలియ‌జేసేందుకు వివిధ రూపాలు ఉన్నాయ‌ని గుర్తుచేస్తున్నారు. అటు స‌మావేశాల‌కు వెళ్లి త‌మ వాయిస్ వినిపించ‌లేక‌పోవ‌డం, ఇటు అవిశ్వాసంపై చ‌ర్చ త‌మ వ‌ల్లే అని చెప్పుకోలేక‌పోవ‌డంతో రెండింటికీ చెడ్డ రేవ‌డిలా మారిపోయిందంటున్నారు! హోదా క్రెడిట్ టీడీపీకి ద‌క్క‌కుండా చేద్దామ‌నే ప్ర‌య‌త్నంలో.. జ‌గ‌న్ తొంద‌ర‌ప‌డ్డార‌ని స్ప‌ష్టం చేస్తున్నారు. ఎంపీలు ఇప్పుడు జ‌రిగే అవిశ్వాసంపై చ‌ర్చలో పాల్గొని.. కేంద్రం చెప్పిన విష‌యాల త‌ర్వాత ఫైన‌ల్‌గా వీటిని చేసుంటే మ‌రింత క్రెడిట్ ద‌క్కేద‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు. జ‌గ‌న్ తీసుకుంటున్న నిర్ణ‌యాలు ఇలా బూడిద‌లో పోసిన ప‌న్నీరు అయిపోవ‌డం ఆ పార్టీ నేత‌ల‌ను ఆందోళ‌న‌లో ప‌డేస్తున్నాయి! 


మరింత సమాచారం తెలుసుకోండి: