ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంగతేమో కానీ, విభజన ఏపీలో మాత్రం ఉత్తరాంధ్రకు కాసింత రాజకీయ మర్యాదను ఇస్తున్నారు. చిన్న రాష్ట్రంలో ఓ కీలకమైన భాగంగా ఈ ప్రాంతం ఉండడమే అందుకు కారణం. ఇక్కడ అయిదు పార్లమెంట్, ముప్పయి నాలుగు అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. అంటే మొత్తం నవ్యాంధ్రలో అయిదవ వంతు అన్న మాట.  రేపటి రోజున ఏ పార్టీ అధికారం పట్టాలన్నా ఈ రీజియన్ చాలా ఇంపార్టెంట్.


చెడ తిరిగేశారుగా :


ఉత్తరాంధ్ర ఈ మధ్య మరీ మారుమోగుతోంది. వరస పెట్టి నాయకులు ఇక్కడే చక్కర్లు కొడుతున్నారు. మాటకొస్తే ఓ మూలన ఉన్న శ్రీకాకుళం వచ్చేస్తున్నారు. వెనకబడిన  విజయనగరంలో కలియతిరిగేస్తున్నారు. పొలిటికల్ మైలేజ్ కోసం అనుకున్నా కూడా ఉత్తరాంధ్రకు ఈ విధంగా ఓ పాపులారిటీ వచ్చేసింది. ఏ నాయకుడిని కదిలించినా ఇక్కడ సమస్యలు ప్రస్తావిస్తున్నాడు. ఓ విధంగా ఇది మంచికేనేమో


ఆయనతో ఆరంభం :


జనసేనాని పవన్ కళ్యాణ్ మొదటిగా ఉత్తరాంధ్ర బాట పట్టాడు. విడతలుగా మొత్తం యాభై రోజులు ఇక్కడే గడిపాడు. సినిమా నటుడు కావడం, ఫ్యాన్స్ కూడా ఎక్కువగా ఉండడంతో సహజంగానే ఈ ఏరియాలు ఆయనతో పాటే కొన్నాళ్ళ పాటు అందరి నోళ్ళలో నానాయి. దీంతో బీజేపీకి కొత్తగా ప్రెసిడెంట్ అయిన కన్నా లక్ష్మీ నారాయణ కూడా వెంటనే ఉత్తరాంధ్రా టూర్ వేశారు. ఆయన కూడా మూడు జిల్లాలూ చుట్టేసి పోయారు.


కాంగ్రెస్ వంతు :


సరిగ్గా ఇదే టైంలో ఏపీకి కాంగ్రెస్ ఇంచార్జ్ గా వచ్చిన ఉమెన్ చాందీ తన మలి విడతా టూర్ ని ఉత్తరాంధ్రలోనే చేశారు. నాలుగు రోజుల పాటు ఆయన ఈ ప్రాంతాలలో పర్యటించి పార్టీ గురించి నాలుగు మాటలు చెప్పుకున్నారు. పనిలో పనిగా కాంగ్రెస్ కి ఉత్తరాంధ్రతో ఉన్న అనుబంధాన్ని వివరించేశారు. . ఇక వామ పక్ష నేతలు తరచూ ఇక్కడికే వస్తూంటారు. అధికార టీడీపీ అధినాయకుడు మ్ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే నెలకు కనీసం ఒక మారు ఈ జిల్లాలకు వస్తారు.


మిగిలింది ఆయనే :


ఏపీలో ఉన్న ప్రధాన పార్టీల నాయకులంతా ఉత్తరాంధ్ర టూర్ వేసేశారు. ఇక మిగిలింది వైసీపీ అధినాయకుదు జగనే. ఆయన పాదయాత్ర ఈ నెలలోనే ఉత్తరాంధ్ర జిల్లాలలో మొదలు కానుంది. కచ్చితంగా రెండు నెలల పాటైనా జగన్ ఈ జిల్లాలలో సందడి చేయడం ఖాయం. విభజన ఏపీలో ప్రతిపక్ష నేతగా జగన్ పలు మార్లు ఉత్తరాంధ్ర టూర్లు వేశారు. ఆయన చివరి సారిగా గత ఏడాది విశాఖ భూ కుంభకోణం పై వైసీపీ ఉద్యమంలో భాగంగా విశాఖ వచ్చారు.  ఆ తరువాత  ఇపుడు పాదయాత్రలోనే రావడం. అంటే జగన్ ఇక్కడకు వచ్చి ఏడాది అవుతుందన్న
మాట. మరి వచ్చే ఎన్నికలలో ఏపీలో ప్రధాన పార్టీల గెలుపోటములను విశేషంగా ప్రభావితం చేసే ఉత్తరాంధ్ర జగన్ పాదయాత్రను ఎలా రిసీవ్ చేసుకుంటుందో, ఆయన ఎలా జనం మద్దతు కూడగడతారో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: