అదేదో పాత సామెత ఉంది. గిల్లి గిచ్చి ఆనక జోల పాట పాడారని. దానిని అచ్చంగా అమలు చేస్తున్నారు విశాఖ జిల్లా మంత్రి గంటా శ్రీనివాసరావు. అధికారులతో పెట్టుకున్నాక కానీ తత్వం బోధ పడింది కాదేమో, ఇపుడు తాపీగా వారిని బుజ్జగించే పనిలో పడ్డారాయన. జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల  అధికారులందరినీ పిలిచి విందు మీటింగ్ పేరిట మంచి చేసుకునే యత్నానికి గంటా తెర తీశారు. దీనికి ఆత్మీయ సమావేశం అని పేరు కూడా పెట్టారు. 


కవరింగా.. కలరింగా :


ఇటీవల కాలంలో మంత్రి గారు రెవిన్యూ అధికారులతో తల గోక్కుని కిందా మీద పడుతున్న సంగతి తెలిసిందే. తన ఇలాకాలోని ఓ తాశీల్దార్ని ఇంటికే పిలిపించుకుని ఓ రేంజిలో ఫైర్ అయ్యారని టాక్ నడిచింది. అది పెను వివాదమై రెవిన్యూ వర్సెస్ మంత్రిగా మారిపోయింది. ఎన్నికల ఏడాదిలో దీని వల్ల బ్యాడ్ సిగ్నల్స్ వెళ్తే అసలుకే ఎసరు వస్తుందేమోనని తెగ కంగారు పడిపోయింది మంత్రి అండ్ కో. దానికి కవరింగు గానో, లేక మంచి వాడినేనని కలరింగ్ కోసమో మంత్రి డిన్నర్ మీట్ పెట్టారని టాక్.


ఎంతో ప్రేమంట :


అధికారులంటే ఎంతో ప్రేమాభిమానాలు తనకు ఉన్నాయని మంత్రి అంటూ వారితో తనకు గల అనుబందాన్ని  ఈ డిన్నర్ మీట్లో గట్టిగా చెప్పుకున్నారట. విశాఖలో న్యాయ విద్యార్ధిగా అడుగిడి, ఉద్యోగిగా, వ్యాపారిగా, తరువాత రోజులలో ఎంపీగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా మూడు దశాబ్దాల తన నిండైన జీవితంలో అధికారులతో ఎపుడూ వివాదాలు రాలేదని కూడా వివరించుకున్నారట.   తన ఎదుగుదలలో వారికీ భాగముందనీ అధికారులను ఉబ్బేశారట. మరి ఈ బుజ్జగింపు  మంత్రం ఎంత మేరకు రిజల్ట్ ఇస్తుందో చూడాలి. అసలే టీడీపీ గవర్నమెంట్ తోనే ఉద్యోగులకు అంతగా రిలేషన్స్ బాగా లేవని టాక్ నడుస్తున్న టైం ఇది. 


మరింత సమాచారం తెలుసుకోండి: