ప్రత్యేక హోదా అంటూ యూటర్న్ తీసుకుని నాటి నుంచీ టీడీపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. హోదా అన్నది ఓ బ్రహ్మ పదార్ధం, రాదని దాదాపుగా తెలిసిపోతోంది. ఆ పేరు మీదా నానా యాగీ చేసినా పొలిటికల్ మైలేజీ దక్కే చాన్సూ కనిపించడంలేదు. చంద్రబాబు ఇందులో పడి గిల గిలా కొట్టుకుంటున్న టైం చూసుకుని మరీ తోడల్లుడు దగ్గుబాటి వారు సీన్లోకి దిగి అటాక్ మొదలెట్టేశారు. లేని హోదా కోసం వస్తున్న నిధులను కాదనుకుంటున్నావంటూ లాజిక్ పాయింట్ ఒకటి తీసి బాబును ఇరకాటంలోకి నెట్టేశారు.


పాయింటే కదా మరి :


హోదా వస్తే గిస్తే వచ్చే లాభాల సంగతి దేముడెరుగు. కేంద్రంలోని ప్రభుత్వంతో కలసి నడచి నిధులు తెచ్చుకుని ఏపీని బాగుచేసుకోవడం తెలివైన పాలకుడి కర్తవ్యం. సరిగ్గా ఈ పాయింటే తీసి మరీ బాబును కార్నర్ చేశారు అన్న గారి పెద్దల్లుడు వెంకటేశ్వరరావు. ముఖ్యమంత్రి స్థానంలో ఉండి పోరాటాలేంటని కూడా గుస్సా అయ్యారు. రాజకీయాలు పక్కన పెట్టి డెవలప్మెంట్ గురించి ఆలోచించలేరా అంటూ కౌంటర్లేశారు. కేంద్రం అడిగిన వివరాలు ఇచ్చి నిధులు తెచ్చుకునే తెలివిడి ఏమైందంటూ సూటిగానే నిలదీశారు.


జగన్ ట్రాప్ లో బాబు :


అచ్చం ప్రధాని మోదీ అన్నట్లుగానే దగ్గుబాటి వారూ అదే మాట అనేశారు. జగన్ ట్రాప్ లో బాబు పడిపోయారట. అందుకే ఏపీ అభివ్రుధ్ధి వదిలేసి హోదా అంటూ పాలన పడకేయించారని  సెటైర్లు వేశారు. పాలక పక్షానికి అసలు బాధ్యత లేదని, కేవలం మీడియాలో హైలెట్ కావడానికే చూస్తోందని ఘాటుగా విమర్శించారు. మోడీపై గుడ్డి వ్యతిరేకతతో ఏపీకి అన్యాయం చేయడం టీడీపీ ప్రభుత్వానికి తగని హిత వచనాలూ పలికారు.
.
సీన్లోకి  నాన్ పొలిటికల్ ఫోరం :


ఏపీలో జరుగుతున్న పరిణామాలు తన లాంటి వారిని మళ్ళీ బయటకు వచ్చి మాట్లాడేలా చేస్తున్నాయని దగ్గుబాటి అన్నారు. మేధావులు, రాష్ట్ర శ్రేయస్సును కోరే వారితో కలసి తొందరలోనే ఏపీలో నాన్ పొలిటికల్ ఫోరం ఒకటి ఏర్పాటు చేస్తామని దగ్గుబాటి చెబుతున్నారు. దీని ద్వారా ఎప్పటికపుడు పాలక పక్షానికి తగు సూచనలు చేయడమే కాదు. ప్రజలలో అవగాహన కలిగిస్తామని అంటున్నారు. మొత్తానికి ఫార్టీ యియర్స్ సీనియారిటీ అని చెప్పుకుంటున్న బాబుకు తోడల్లుడే తలంటేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: