ఆ లీడ‌ర్‌పై మూడు పార్టీలు క‌న్నెశాయి.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ పార్టీల నుంచి బ‌రిలోకి దింపేందుకు ఇప్ప‌టి నుంచి ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి.. ఆయ‌నొస్తే.. గెలుపు ఖాయ‌మ‌నే అంచ‌నాల్లో ఉన్నాయి.. ఇంతకీ ఆ లీడ‌ర్ ఎవ‌రు..? ఏమిటా నియోజ‌క‌వ‌ర్గం అని ఆలోచిస్తున్నారా..? అదేనండి.. ఆయ‌నే డాక్ట‌ర్ సీహెచ్ స‌త్య‌నారాయ‌ణ‌(బాబ్జీ).. ఆ నియోజ‌క‌వ‌ర్గ‌మే రాజ‌కీయంగా ఎంతో చైత‌న్యం క‌లిగిన పాలుకొల్లు. ఇప్పుడు ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో నియోజ‌క‌వ‌ర్గ రాజ‌కీయాలు వేగంగా మారుతున్నాయి.. డాక్ట‌ర్‌గా ప‌నిచేస్తూ.. ప్ర‌జ‌ల్లో మంచి గుర్తింపు పొంది, అనూహ్యంగా రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన డాక్ట‌ర్ బాబ్జీ కోసం ఇప్పుడు మూడు పార్టీలు ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. 


ప్ర‌స్తుతం ఆయ‌న బీజేపీలో కొన‌సాగుతున్నా.. వైసీపీ, జ‌న‌సేన పార్టీలు కూడా బాబ్జీని ప‌ట్టేసే ప‌నిలో ప‌డిన‌ట్లు తెలుస్తోంది. సీహెచ్ స‌త్య‌నారాయ‌ణ డాక్ట‌ర్‌గా పాల‌కొల్లు నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు సుప‌రిచితుడు. 2004లో ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. నిజానికి అప్ప‌టివ‌ర‌కు నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీలో అల్లు వెంక‌ట‌స‌త్య‌నారాయ‌ణదే హ‌వా.. అయినా, ఆయ‌న‌ను కాద‌ని 2004ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు డాక్ట‌ర్ బాబ్జీకి టికెట్ ఇవ్వ‌గా.. ఆయ‌న గెలుపొందారు. ఇక‌ 2009 ఎన్నిక‌ల్లో మాత్రం డాక్టర్‌ బాబ్జీ టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగి ఓడి పోయారు. అప్పుడు నియోజ‌క‌వ‌ర్గంలో త్రిముఖ పోటీ నెల‌కొంది.  ప్రజారాజ్యం పార్టీ అధినేత మెగాస్టార్‌ చిరంజీవి పాలకొల్లు బరిలోకి దిగారు. దీంతో సామాజిక వర్గ పరంగా ఓట్లు చీలి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి బంగారు ఉషారాణి గెలుపొందారు. 


2014లో మాత్రం డాక్ట‌ర్ బాబ్జీకి టీడీపీ టికెట్ ద‌క్క‌లేదు. పార్టీ టికెట్ ఈసారి ధ‌ర్మారావు ఫౌండేష‌న్ అధినేత డాక్ట‌ర్ నిమ్మ‌ల రామానాయుడికి ద‌క్కింది. దీంతో డాక్ట‌ర్ నిమ్మ‌ల టీడీపీ అభ్య‌ర్థిగా, స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా డాక్ట‌ర్ బాబ్జీ, వైసీపీ నుంచి మేకా శేషుబాబు బ‌రిలోకి దిగారు. ఈ త్రిముఖ పోటీలో డాక్ట‌ర్ నిమ్మ‌ల విజ‌యం సాధించారు. అయితే స్వ‌తంత్య్ర అభ్య‌ర్థిగా కూడా పోటీ చేసిన బాబ్జీ ఏకంగా 38 వేల ఓట్లు సాధించి ప్ర‌ధాన పార్టీల‌కు షాక్ ఇచ్చారు. ఆయ‌న‌కు నియోజ‌క‌వ‌ర్గంలో వ్య‌క్తిగ‌త ఓటు బ్యాంకు ఉంది.


ఎన్నిక‌ల్లో ఓట‌మి అనంత‌రం డాక్టర్‌ బాబ్జీ టీడీపీని వీడి బీజేపీలో చేరారు.  ప్ర‌స్తుతం ఆయ‌న ఆపార్టీ రాష్ట్ర స్వచ్ఛభారత్‌ కన్వీనర్‌గా పనిచేస్తూ పార్టీలో మంచి గుర్తింపు పొందారు. ఇప్పుడు టీడీపీ, బీజేపీ బంధం తెగిపోవ‌డంతో ఈసారి ఆయ‌న‌కు బీజేపీ టికెట్ ఖాయ‌మ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే, ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో డాక్ట‌ర్ బాబ్జీ రాజ‌కీయ ప‌య‌నంపై ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది. ఒక‌వేళ‌, వైసీపీకి బీజేపీ ప‌రోక్షంగా మ‌ద్ద‌తు ఇస్తే.. ఆయ‌న వైసీపీలోకి వెళ్తార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇక  ఇదే స‌మ‌యంలో డాక్ట‌ర్ బాబ్జీ కోసం జ‌న‌సేన పార్టీ కూడా ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో ఆయ‌న ఎటువైపు మొగ్గుచూపుతారో చూడాలి మ‌రి. 



మరింత సమాచారం తెలుసుకోండి: