వైసిపి ఇచ్చిన బంద్ పిలుపును భ‌గ్నం చేయ‌టానికి  అధికార తెలుగుదేశంపార్టీ శ‌క్త వంచ‌న లేకుండా ప్ర‌య‌త్నిస్తోంది. ఏపికి కేంద్ర ప్ర‌త్యేక‌హోదా ఇవ్వ‌నందుకు, రాష్ట్ర  ప్ర‌భుత్వానికి కూడా వ్య‌తిరేకంగా  ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసిపి ఈరోజు రాష్ట్ర వ్యాప్త బంద్ కు పిలిపిచ్చింది. బంద్ విష‌యం నాలుగు రోజుల క్రిత‌మే పార్టీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌క‌టించారు. అప్ప‌టి నుండి బంద్ ను విజ‌య‌వంతం చేయాల‌ని పార్టీ నేత‌లు,  శ్రేణులంతా తీవ్రంగా కృషి చేస్తున్నారు అయితే, హ‌టాత్తుగా ప్ర‌భుత్వం అడ్డం తిరిగింది.  దాంతో అధికార టిడిపి రెచ్చిపోతోంది. 


వైసిపి నేత‌ల హౌస్ అరెస్టులు


బంద్ ను విజ‌య‌వంతం చేయ‌టానికి  స‌మ‌న్వ‌యం చేసుకుంటున్న వైసిపి నేత‌ల‌ను పోలీసులు నిన్న రాత్రి, తెల్ల‌వారుజాము నుండే అరెస్టులు మొద‌లుపెట్టారు. చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌ముఖ నేత‌ల‌ను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు గుర్తు తెలీని ప్రాంతాల‌కు త‌ర‌లిస్తున్నారు. ఉత్త‌రాంధ్ర‌లోని  శ్రీ‌కాకుళం జిల్లా నుండి రాయ‌ల‌సీమ‌లోని  చిత్తూరు  జిల్లా వ‌ర‌కూ వైసిపి నేత‌ల విష‌యంలో పోలీసుల వైఖ‌రి ఒక‌వేధంగా ఉంది. 


వంద‌లాది నేత‌ల అరెస్టులు


చాలామంది ఎంఎల్ఏల‌ను పోలీసులు నిన్న రాత్రే దాదాపు హౌస్ అరెస్టులు చేసేశారు. వైసిపి ప్ర‌ముఖ నేత‌ల ఇళ్ళ వ‌ద్ద‌కు పోలీసులు అర్ధ‌రాత్రే చేరుకుని కాపు కాశారు ప‌లువురిని హౌస్ అరెస్టులు చేసిన పోలీసులు రోడ్ల‌మీద‌కు వ‌చ్చిన నేత‌ల‌ను ఏకంగా అరెస్టులే చేశారు.  ప్ర‌తీ నియోజ‌క‌వ‌ర్గంలోనూ వంద‌లాది మంది కార్య‌క‌ర్త‌ల‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. బంద్ ప్ర‌భావం లేద‌ని చెప్పేందుకు బ‌స్ డిపోల‌లో ప్ర‌భుత్వం పోలీసుల‌ను పెద్ద ఎత్తున మోహ‌రించింది. పోలీసుల కాప‌లాతో బస్సు స‌ర్వీసుల‌ను య‌ధావిధిగా తిప్పేందుకు ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నిస్తోంది. అయితే చాలా  చోట్ల బ‌స్సుల‌ను తిప్ప‌టానికి డ్రైవ‌ర్లు నిరాక‌రిస్తున్న‌ట్లు  స‌మాచారం. అదే సంద‌ర్భంలో ప్ర‌యాణికులు కూడా లేక‌పోవ‌టంతో బ‌స్టాండ్ ల‌న్నీ బోసి పోతున్నాయి. 


స్వ‌చ్చంధంగా స‌హ‌కారం


బంద్ కు స‌హ‌క‌రించ‌టానికి వామ‌ప‌క్షాలు కూడా నిరాక‌రించాయి. దాంతో బంద్ విజ‌య‌వంతానికి వైసిపి నేత‌లు, శ్రేణులే అవ‌స్త‌లు ప‌డుతున్నాయి. వైసిపి బంద్ పిలుపు మేర‌కు రాష్ట్ర‌వ్యాప్తంగా వ‌ర్త‌క‌, వాణిజ్య‌, వ్యాపార వ‌ర్గాలు కూడా దాదాపు స‌హ‌కరించిన‌ట్లే క‌న‌బ‌డుతున్నాయి.  తెల్ల‌వారిజామున తెర‌వాల్సిన హోట‌ళ్ళు చాలా చోట్ల తెరుచుకోలేదు. కొన్ని చోట్ల మాత్రం వైసిపి నేత‌లు రోడ్ల‌పైకి వ‌చ్చి మోటారు సైకిల్ ర్యాలీలు నిర్వ‌హిస్తున్నారు. మొత్తానికి ఇత‌ర రాజ‌కీయ పార్టీలేవి స‌హ‌క‌రించ‌క‌పోయినా, ప్ర‌భుత్వం భ‌గ్నం చేయ‌టానికి ప్ర‌య‌త్నిస్తున్నా బంద్ మాత్రం ప్ర‌శాంతంగా సాగుతోంది.


బంద్ వ‌ల్ల ప్ర‌జ‌ల‌కు ఇబ్బందా ?


చంద్ర‌బాబునాయుడు విచిత్రంగా మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో బంద్ చేస్తే జ‌నాల‌కు ఇబ్బందులు ఎదుర‌వుతాయ‌ట‌. కాబ‌ట్టి రాష్ట్ర బంద్ కు స‌హ‌క‌రించ‌కూడ‌దంటూ చంద్ర‌బాబు నేత‌ల‌ను ఆదేశించారు.  రాష్ట్రంలో బంద్ చేయ‌టం వ‌ల్ల కేంద్రానికి ఎటువంటి నొప్పి త‌గ‌ల‌ద‌ట‌. కాబ‌ట్టి చేసే నిర‌స‌నేదో ఢిల్లీకి వెళ్ళి చేయాల‌నే సిద్దాంతాన్ని చంద్ర‌బాబు చెబుతున్నారు. మ‌రి, గ‌తంలో టిడిపి బంద్ లు చేసిన‌పుడు జ‌నాల‌కు ఇబ్బందులు క‌ల‌గ‌లేదా ?  కేంద్ర నిర్ణ‌యాల‌కు నిర‌స‌న‌గా రాష్ట్రంలో టిడిపి ఎన్నోసార్లు బంద్ కు పిలుపిచ్చిన సంగ‌తి చంద్ర‌బాబు మ‌ర‌చిపోయిన‌ట్లున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: