రాష్ట్రంలో ఈ రోజు ఉద‌యం నుండి జ‌రుగుతున్న ప‌రిణామాలు చూస్తుంటే మ‌నం  ప్ర‌జాస్వామ్యంలో ఉన్నామా  లేక‌పోతే పోలీసు రాజ్యంలో ఉన్నామా అన్న అనుమానాలు వ‌స్తున్నాయి. ప్ర‌త్యేక‌హోదా డిమాండ్ తో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసిపి ఈరోజు బంద్ కు పిలుపిచ్చింది. బంద్ అన్నా ఇత‌ర‌త్రా ఆందోళ‌న‌లైనా జ‌న జీవ‌న స్ర‌వంతికి విఘాతం క‌లుగుతుంద‌న‌టంలో సందేహం లేదు.  అప్ప‌టిక‌ప్పుడు బంద్ పిలిపిస్తే జ‌నాలు  ప‌డే ఇబ్బందులు వ‌ర్ణ‌నాతీతం. అందుకే ఈరోజు బంద్ విష‌యాన్ని వైసిపి అధ్య‌క్షుడు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి   మూడు రోజుల ముందే ప్ర‌క‌టించారు.

అన్నీ పార్టీలు హోదాను కోరుతున్న‌వే 


స‌రే, బంద్ అంటే అధికారంలో  ఉన్న పార్టీ ఎటూ స‌మ‌ర్ధించ‌దు. కాకపోతే ఇక్క‌డ విష‌యం ప్ర‌త్యేకం. అధికారంలో  ఉన్న తెలుగుదేశమైనా,  ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసిపితో పాటు వామ‌ప‌క్షాలు, బిజెపి  కూడా ప్ర‌త్యేక‌హోదాను కోరుతున్న‌వే. కాక‌పోతే ఆందోళ‌న‌ల్లో  వైసిపినే ఎక్కువ‌గా ఫోక‌స్ అవుతోంది. నిజానికి హోదా డిమాండ్ ఇప్ప‌టికీ స‌జీవంగా ఉందంటే అందుకు జ‌గ‌న్ చేసిన పోరాటాలే కార‌ణ‌మ‌ని చెప్పాలి. అదే స‌మ‌యంలో హోదా డిమాండ్ పై చంద్ర‌బాబు వేసిన పిల్లి మొగ్గ‌లు అంద‌రూ చూసిందే. దానికి ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడి ప్ర‌సంగంలో చెప్పిన విష‌యాలే సాక్ష్యం.


ఎంఎల్ఏల హౌస్ అరెస్ట్


ఆ నేప‌ధ్యంలోనే వైసిపి ఈరోజు బంద్ కు పిలుపిచ్చింది. మ‌రి అదే డిమాండ్ ను వినిపిస్తున్న టిడిపి బంద్ కు స‌హ‌క‌రించాలి. లేకుంటే చూసి చూడ‌నట్లుండాలి. అందుకు విరుద్దంగా బంద్ ను విఫ‌లం చేసేందుకు చంద్ర‌బాబు పోలీసుల‌ను ప్ర‌యోగిస్తున్నారు.  రాష్ట్రం మొత్తం మీద వైసిపి నేత‌ల‌ను అదుపులోకి తీసుకునేందుకు లేక‌పోతే అరెస్టులు  చేసేందుకు పోలీసుల‌ను విప‌రీతంగా ఉప‌యోగించారు.  చాలా మంది ఎంఎల్ఏల‌ను సోమ‌వారం రాత్రి నుండే  హౌస్ అరెస్టులు  చేసేశారు. చాలా బ‌స్ట డిపోల్లో పోలీసుల కాప‌లాతో బ‌స్సులు తిప్పేందుకు ప్ర‌య‌త్నించారు. అయితే, ఆర్టిసి కార్మికులు స‌హ‌క‌రించ‌ని కార‌ణంగా చాలా చోట్ల బ‌స్సులు తిర‌గ‌లేద‌నుకోండి అది వేరే సంగ‌తి.


మ‌హిళ‌ల‌ను కూడా రోడ్ల‌పై ఈడ్చేస్తున్నారు 


వైసిపి బంద్పి కార‌ణంగా శాంతి భ‌ద్ర‌త‌ల‌కు ఎక్క‌డా విఘాతం క‌ల‌గ‌లేదు.  మామూలుగా బంద్ అంటే ప్ర‌భుత్వ‌, ప్రైవేటు ఆస్తుల‌కు న‌ష్టం క‌లుగుతుంటాయి. బంద్ పాటించ‌ని జ‌నాల‌పైకి ఆందోళ‌న‌కారులు విరుచుకుప‌డుతుంటారు. ఆ నేప‌ధ్యంలో శాంతి భ‌ద్ర‌త‌ల‌కు విఘాతం క‌లుగుతాయి. కానీ ఇక్క‌డ అటువంటివేవీ చోటు చేసుకోలేదు. ఎక్క‌డా ఆందోళ‌న‌కారులు పోలీసుల‌పై తిర‌గ‌బ‌డలేదు.  ఎక్క‌డ చూసినా ఆందోళ‌నకారుల‌పై పోలీసులే జులుం చేస్తున్న ఘ‌ట‌న‌లు క‌న‌బ‌డ‌తున్నాయి. అదే విచిత్రంగా ఉంది.  ఆడ‌వాళ్ళ‌ని కూడా చూడ‌కుండా పోలీసులు వైసిపి మ‌హిళా నేత‌ల‌ను, కార్య‌క‌ర్త‌ల‌ను రోడ్ల‌పైన ఈడ్చుకుంటూ తీసుకెళ్ళి పోలీసుస్టేష‌న్లో ప‌డేస్తున్నారు.  మొత్తం మీద పోలీసుల యాక్ష‌న్ చూస్తుంటే అస‌లు మ‌నం ప్ర‌జాస్వామ్యంలో ఉన్నామా లేక‌పోతే పోలీసుల రాజ్యంలో ఉన్నామా అన్న అనుమానాలు వ‌స్తున్నాయ్. 


మరింత సమాచారం తెలుసుకోండి: