తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జె.జయలలిత తన జీవితంలో ఎప్పుడూ గర్భం దాల్చలేదని తమిళనాడు ప్రభుత్వం మద్రాస్ హైకోర్టుకు తెలిపింది. ఈ మేరకు 1980 నాటి జయలలిత వీడియో క్లిప్‌లను కోర్టుకు సమర్పించింది. తాను జయలలిత కుమార్తెనంటూ బెంగళూరుకు చెందిన అమృత కేసు వేసి కలకలం రేపిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ విషయాన్ని కోర్టుకు తెలిపింది. మాజీ సీఎం జయలలిత మరణం తర్వాత ఆమె ఆస్తులను దక్కించుకునేందుకు చాలామంది మీడియా ముందుకొచ్చారు. దగ్గర బంధువు అని కొందరు, జయ తమకు అమ్మ అవుతుందని కొందరు ఇలా రకరకాల వ్యక్తులు తెరపైకి వచ్చారు.  


మరికొందరైతే డీఎన్ఏ టెస్టులకు సిద్ధమంటూ ప్రకటన ఇచ్చేశారు కూడా! దీంతో జయ లైఫ్ గురించి రోజుకో కొత్త వార్త హల్‌చల్ చేసేది. ఈ క్రమంలో బెంగళూరుకి చెందిన అమృత అనే మహిళ తాను జయలలిత కూతురునంటూ న్యాయస్థానంను ఆశ్రయించింది.ఈ కేసు విచారణ సమయంలో జయలలిత ఎప్పుడూ గర్భం దాల్చలేదని మద్రాస్ హైకోర్టుకు తెలిపింది తమిళనాడు ప్రభుత్వం.


ఒకవేళ అమృత.. జయలలిత కుమార్తే అయితే, తన జీవితకాలంలో ఆమెతో కలిసి ఒక్క ఫొటో కూడా ఎందుకు తీసుకోలేకపోయారని ప్రశ్నించారు. జయలలితకు తాను 1980 ఆగస్టులో పుట్టినట్టు అమృత తన పిటిషన్‌లో పేర్కొనడంతో, అదే ఏడాది జయలలిత ఓ అవార్డు కార్యక్రమంలో పాల్గొన్న వీడియోను కోర్టుకు సమర్పించారు.

అమృత పుట్టినట్టు చెబుతున్న తేదీకి నెల రోజుల ముందే ఈ కార్యక్రమం జరిగిందని, ఈ వీడియోలో జయ గర్భంతో ఉన్న ఆనవాళ్లు లేవని కోర్టుకు తెలిపారు. అవసరం అనుకుంటే జయలలిత బంధువుల డీఎన్‌ఏతో అమృత డీఎన్ఏను పోల్చి చూడాలని కోరారు. వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: