ఎన్నిక‌ల ర‌ణం స‌మీపిస్తోంది.. జ‌న‌సేన ఇంకా క‌త్తులు క‌టార్లు స‌ర్దుకునే కాన్నే ఉంది.. ఎటుచూసినా.. ఒక్క పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌మాత్ర‌మే క‌నిపిస్తున్నారు.. ఇత‌ర పెద్ద‌నేత‌లెవ‌రూ క‌నిపించ‌డం లేదు.. మాట్లాడితే ప‌వ‌నే మాట్లాడాలి.. లేదంటే అంతేసంగ‌తులు.. ఆయ‌న చుట్టూ ముగ్గురు న‌లుగురు ప్ర‌తినిధులు ఉన్నా.. వారు కేవ‌లం త‌మ వ్య‌క్తిగ‌త ఇమేజ్ కోసం త‌ప్ప పార్టీ కోసం పెద్ద‌గా రిస్క్ తీసుకోవ‌డం లేద‌నే టాక్ వినిపిస్తోంది. అంతేగాకుండా.. ఇత‌ర పార్టీల నుంచి పెద్ద నేత‌లెవ‌రూ పార్టీలోకి రాకుండా వారే అడ్డుకుంటున్నార‌నే చ‌ర్చ కూడా పార్టీ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. వారి వ‌ల్ల‌నే పార్టీ ఎద‌గ‌డం లేద‌నే వాద‌న బ‌లంగా వ‌స్తోంది. 

Image result for pawan kalyan

ఇప్ప‌టికైనా ప‌వ‌న్ చ‌ర్య‌లు తీసుకోక‌పోతే.. ఇక అంతేసంగ‌తులేన‌ని ప‌లువురు నాయ‌కులు అంటున్నారు. అయితే, పార్టీలో నెల‌కొన్న ప‌రిస్థితులను కొద్ది రోజులుగా ప‌వ‌న్ సీరియ‌స్‌గా తీసుకున్నట్లు స‌మాచారం. ఈ క్ర‌మంలోనే పార్టీ వ్య‌తిరేక ప‌నుల‌కు పాల్ప‌డేవారిపై చ‌ర్య‌లు తీసుకుంటూనే ఇత‌ర పార్టీలు, మేధావుల‌ను జ‌న‌సేన‌లోకి ఆహ్వానించేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే.. ప్ర‌జారాజ్యం పార్టీ మూలాలు ఉన్న ముగ్గురితోపాటు లోక్‌స‌త్తాలో కీల‌కంగా ప‌నిచేసిన మ‌రొక‌రి కోసం ప‌వ‌న్ చ‌ర్చ‌లు జ‌రుపుతున్న‌ట్లు తెలుస్తోంది. ఆ నలుగురిలో లోక్ స‌త్తా నాయ‌కుడు క‌ఠారి శ్రీనివాస‌రావు, కాంగ్రెస్ అధికార ప్ర‌తినిధి జంగా గౌత‌మ్, ప్ర‌ముఖ జర్న‌లిస్టు, రాజ‌కీయ విశ్లేష‌కుడు పూలా విక్ర‌మ్, ప్రొఫెస‌స‌ర్ జైహింద్ రెడ్డిలు ఉన్నారు. 


అయితే ఇందులో  ప్రొఫెస‌ర్ జైహింద్ రెడ్డి ప్ర‌జారాజ్యం పార్టీలో కీల‌కంగా ప‌నిచేశారు. పూలా విక్ర‌మ్ పీఆర్పీలో చిరంజీవికి రాజ‌కీయ స‌ల‌హాదారుగా వ్య‌వ‌హ‌రించారు. ప్ర‌స్తుతం కాంగ్రెస్ అధికార ప్ర‌తినిధిగా కొనసాగుతున్న జంగా గౌత‌మ్ కూడా గ‌తంలో ప్ర‌జారాజ్యం పార్టీ త‌ర‌పున పోటీ చేశారు. ఇక‌ క‌ఠారి శ్రీనివాస‌రావు లోక్ స‌త్తా అధినేత జ‌య‌ప్ర‌కాశ్ నారాయ‌ణ‌కు అత్యంత స‌న్నిహితులు. లోక్‌స‌త్తాలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఏపీలో మంచి గుర్తింపు ఉన్న ఈ న‌లుగురికి ఎలాగైనా జ‌న‌సేన కండువా క‌ప్పేయాల‌న్న ప‌ట్టుద‌ల‌తో ప‌వ‌న్ ఉన్న‌ట్లు స‌మాచారం. 


ఈ మేర‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్‌ ఇప్ప‌టికే వీరితో ప‌లుమార్లు చ‌ర్చ‌లు కూడా జ‌రిపార‌ని కూడా తెలుస్తోంది. వీరితో పార్టీ బ‌లోపేతం అవుతుంద‌నీ, వ‌చ్చే ఎన్నిక‌ల్లో స‌త్తాచాటేందుకు అవ‌కాశం ఉంటుంద‌న్న ఆలోచ‌న‌లో ప‌వ‌న్ ఉన్న‌ట్లు పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. నిజానికి.. ఏపీలో ఇప్పుడున్న అత్యంత రాజ‌కీయ సంక్లిష్ట‌త‌ను అంచ‌నా వేసి వ్యూహ ర‌చ‌న చేయాలంటే.. అంత సుల‌భం కాద‌ని రాజ‌కీయ పండితులు అంటున్నారు. ఈ నేప‌థ్యంలోనే జ‌న‌సేన అధినేత త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో ఇత‌ర పార్టీల నేత‌లు, మేధావులను పార్టీలో చేర్చుకునేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: