ప్రజా జీవితంలో ఉన్నపుడు నైతిక విలువలు పాటించాలి. వారినే నాయకుడుగా జనం గుర్తిస్తారు. అవినీతి అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు. శీలం, మన గుణం కూడా ఇక్కడ ముఖ్యం. శ్రీ రామున్ని అందుకే ప్రజా నాయకుడంటారు. ఒక భార్య, ఒకే బాణం, ఒకటే నీతి. నేటి నాయకులు తీరు  ఎలా ఉందో చూస్తూనే ఉన్నాం. ఇది ఒక సమాజం. ఈ సమాజ నియమ నిబంధలను కట్టు తప్పిన వారంతా అవినీతి పరులే. అది డబ్బు కావచ్చు. మరొకటి కావచ్చు.

ఒక వ్యక్తితో స్నేహం చేయాలంటే అతని గుణ గణాలు చూస్తాం. అలాంటిది ఒక నాయకుడు మంచిగా ఉంటాడా లేదా అన్నది అతని వ్యక్తిగత జీవితం చూస్తేనే తెలిసేది. మమ్మల్ని అడగవద్దు అంటే ఎలా. ఇది ప్రజాస్వామ్యం. తన విలువైన ఓటు అందించే ఓటరుకు అన్నీ తెలియాలి. అడిగి మరీ తెలుసుకోవాలి కూడా.


వ్యక్తిగతం వేరే ఉంటుందా :


నాయకుడన్న వాడికి వ్యక్తిగతం అంటూ వేరే ఉండదు. సమాజానికి అతని జీవితం స్పూర్తి కావాలి అంటే అది తెరచిన పుస్తకం గా ఉండాలి. మన జాతి పిత గాంధీ మహాత్ముడు అలా తన జీవితాన్ని ఆదర్శనీయంగా మలచుకున్నాడు. సమాజమే కుటుంబం అయిన వేళ నాయకుడికి వేరే జీవితం అంటూ ప్రత్యేకంగా ఉండదు. ప్రజలకు, నేతకు మధ్య ఆ సన్నని పొర చెరిగిపోయిన నాడే నిజమైన నాయకుడు అవుతాడు.


అన్నగారిలా ఉన్నదెవరు  :


వెండి తెర వేలుపు అన్న నందమూరి తారక రామారావు  గారికి వ్యక్తిగత జీవితం అంటూ వేరే లేదు. ఆయన జనంతోనే ప్రతీదీ పంచుకునే వారు. తన రెండవ వివాహాన్ని కూడా డెబ్బయి ఏళ్ళ వయసులో ఓ సినిమా వంద రోజుల సంబరంలో ప్రకటించిన ధీరోధాత్తుడు. నాయకునికి ఆ ధైర్యం కావాలి. తాను తప్పు చేస్తే అదే జనం ముందు ఒప్పుకునే తెగువ కావాలి. నిజమైన లీడర్ పాలూ నీళ్ళలా జనంతోనే కలసిపోతారు. అలా కలసిపోయిన వారు  పొరపాటున  తప్పులు చేసినా  జనమే వాటిని క్షమిస్తారు. 


మహా కవి చెప్పినట్లు :


మహా కవి శ్రీ శ్రీ చెప్పినట్లు నాయకుడు అన్న వాడికి ప్రైవేట్ లైఫ్ అంటూ ఉండదు. పబ్లిక్ లోకి వచ్చాక అన్ని జనం అడుగుతారు, కడుగుతారు. తెలుకునే హక్కు వారికి ఉంది కూడా. ఓటు అన్న అమూల్యమైన దానిని అందించాలి  అనుకున్నప్పుడు ఆ నాయకుడి గురించి తెలుసుకోకపోవడం తప్పే అవుతుంది. చెప్పకపోవడం అంత కన్నా  నేరం అవుతుంది. బాధ్యత గల లీడర్ తనకు తానుగానే తన వివరాలు చెప్పి జనంలోకి రావాలి. ఒక వేళ చెప్పకపోయినా తనపైన ఆరోపణలు వచ్చినపుడైనా సరైన క్లారిటీ ఇచ్చి జనంలో ఏర్పడ్డ అపోహలు తొలగించుకోవాలి. 


ఎదురు దాడి జవాబు ఎపుడూ కాదు :


చాలా కాలంగా రాజకీయాలు మారిపోయాయి. ప్రశ్నకు జవాబు చెప్పడం మన నాయకులు మానేసి కూడా చాలా  ఏళ్ళు అయింది. ఆఖరుకు  తనపై ఎవరైనా  విమర్శ చేస్తే తట్టుకునే సహనాన్నీ కోల్పోతున్నారు. ఇటువంటి అసహపరులు. ఎదురు దాడి చేసే వారు అసలు నాయకత్వానికి పనికి వస్తారా  అన్నది జనమే ఆలోచన చేయాలి. 



నిజానికి జవాబుదారీతనం అసలు లేని రాజకీయ వ్యవస్థలో మనం ఉన్నాము. దాంతో కొత్తగా వచ్చిన వారు కూడా ఇదే రాజకీయం, ప్రజాస్వామ్యం అని పొరపాటు పడుతున్నారేమో. మనం జవాబు చెప్పాల్సింది ఆరోపణ చేసిన ఫలానా నాయకుడికి కానే కాదు. అది వింటున్న, చూస్తున్న కోట్లాది మంది ప్రజలకు అని ఏ నాయకుడైతే గుర్తెరిగి మసలుకుంటాడో అపుడే మన ప్రజాస్వామ్యం పది కాలాల పాటు వర్ధిల్లుతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: