విశాఖ రైల్వే జోన్ పై కేంద్రం ఇంకా స్పష్టమైన ప్రకటన చేయలేదు కానీ అపుడే జోన్ వచ్చేసినంత సంబరాన్ని విశాఖ బీజేపీ నాయకులు చేసుకుంటున్నారు. జోన్ ఇస్తున్నందుకు రైల్వే మంత్రి పీయూష్ కుమార్, హోం మంత్రి రాజ్ నాధ్ ని కలసి ధన్యవాదాలు చెబుతారట. ఇందుకోసం ఈ రోజు విశాఖ నుంచి ఏపీ ఎక్స్ ప్రెస్ లో సిటీ బీజేపీ లీడర్లంతా బయల్దేరివెళ్ళారు. ఇంతకీ ఈ హడావుడికి కారణం జోన్ ఇచ్చే విషయం పరిశీలిస్తున్నామంటూ మొన్న రాజ్య సభలో హోం మంత్రి రాజ్ నాధ్ చెప్పారట. ఆ రోజు టీవీ చూసిన వాళ్లకు జోన్ ఇస్తున్నారన్న సంకేతాలేవీ కనిపించలేదు కానీ, బీజేపీకి మాత్రం ఇలా అర్ధమైందట.


కవరింగేనా :


ఇప్పటికే ప్రత్యేక హోదా ఇవ్వనందుకు ఏపీ ప్రజల చేతా చెడా మడా చీవాట్లు తింటున్న బీజేపీకి జోన్ పేరు చెప్పుకుని ముఖం చూపించాలన్న తపన కలుగుతోంది. జోన్ ఎపుడు వస్తుందో తెలియదు కానీ ఇస్తారంటూ తెగ హాడావుడి చేస్తున్నారు. ఇది రాజకీయ నిర్ణయం, మేమే జోన్ తెచ్చాం అంటూ అపుడే క్రెడిట్ ని తమ ఖాతాలో బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు వేసేసుకున్నారు. జూన్ 13న జోన్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయం తీసుకుందని కూడా ఆయన డేట్, టైం చెబుతూ గొప్పంతా మాదే అంటున్నారు. మరి ఆ సంగతి ప్రధాని మోడీ లొక్ సభలో చెప్పొచ్చుగా  అంటే మాత్రం జవాబు లేదు.


విపక్షాలు పోటీ కాకూడదనేనా :


జోన్ విషయంలో ఒక్క బీజేపీ తప్ప అన్ని పార్టీలు పోరాటం చేస్తూనే ఉన్నాయి. దీంతో రేపు కేంద్రం కనుక జోన్ ప్రకటిస్తే ఆ క్రెడిట్ మాదే అని ఎక్కడ పోటీకి వస్తాయోనని ముందు చూపుతో బీజీపీ ఈ హడావుడికి దిగిపోయింది. కానీ ఇప్పటికీ కేంద్రం దీనిపై సరైన ప్రకటన చెయలేదన్నది కమలనాధులకు అర్ధం కావడం లేదో, తెలిసినా రాజకీయం చేస్తున్నారో మరి


బ్రేకులేస్తున్న ఒడిషా :


జోన్ రానూ లేదు, ప్రకటనా లేదు కానీ, పక్కనున్న ఒడిషా మాత్రం అపుడే పుల్లలు పెడుతూ బ్రేకులేస్తోంది. రాయగడ, కోరాపుట్, హౌరా డివిజన్ల స్థాయి పెంచాలంటూ కెంద్రానికి ఆ రాష్ట్రం లెటర్ రాసింది.ఆ విధంగా చేయడం ద్వారా ఆ డివిజన్లు ఏవీ విశాఖ జోన్లో కలవకుండా చూడాలన్నది ఎత్తుగడ.  మరో వైపు మోడీ అవిశ్వాసానికి మద్దతుగా బీజేడీ లోక్ సభ నుంచి వాకౌట్ చేసింది. రేపటి ఎన్నికల తరువాత బిజూ జనతాదళ్ అవసరం ఎటూ ఉంది. మరి వారిని కాదని జోన్ ఇచ్చే సాహసం బీజేపీ చేస్తుందా. అలా కనుక జరిగితే ఉత్తిత్తి ప్రచారం చేసుకున్నారంటూ బీజేపీకి మరింతగా జనం యాంటీ అవుతారు. కమలనాధులూ తస్మాత్ జాగ్రత్త.


మరింత సమాచారం తెలుసుకోండి: