ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబు సొంత జిల్లా.. చిత్తూరులోని స‌త్య‌వేడు నియోజ‌క‌వ‌ర్గం రాజ‌కీయాలు రోజుకో ర‌కం గా మారుతున్నాయి. ముఖ్యంగా ఇక్క‌డ టీడీపీలో స్థానికేత‌ర సెగ తీవ్రంగా మారుతోంది. సత్యవేడంటేనే స్థానికేతరులకే టికెట్‌ అనే నానుడి ఏర్పడిపోయిందని, దాన్ని తొలగించేందుకు ఈసారి స్థానికులకే టికెట్‌ కేటాయిం చాలన్న డిమాండ్‌ వినిపిస్తోంది. నిండ్ర మండల టీడీపీ అధ్యక్షుడు దశరధ వాసు, శ్రీకాళహస్తికి చెందిన ఎండ్లూరి రాజేష్‌ కృష్ణ, తిరుపతికి చెందిన డాక్టర్‌ దగ్గుమాటి శ్రీహరి తదితరులు గట్టి ప్రయత్నాల్లో వున్నారు. 


ఇక మాజీ ఎమ్మెల్యే హేమలత తనకు గానీ లేదా తన కుమార్తె డాక్టర్‌ హెలెన్‌కు గానీ టికెట్‌ ఇవ్వాలని కోరుతున్నారు. చిత్తూరు ఎంపీ శివప్రసాద్‌ అల్లుడు వేణు కూడా టికెట్‌ ఆశిస్తున్నారు. ఇక‌, ఇక్క‌డ జ‌రిగిన ఎన్నిక‌ల్లో టీడీపీ అభ్య‌ర్థి విజ‌యం సాధించాడు. అయితే, త‌న నియోజ‌కవ‌ర్గం అభివృద్ధిపై స‌ద‌రు ఎమ్మెల్యే ఉదాశీనంగా ఉన్నార‌ని స్థానిక టీడీపీ నాయ‌కులే ఆరోపిస్తున్నారు. పలువురు మండలస్థాయి నాయకులు ఎమ్మెల్యే త‌లారి ఆదిత్య‌కు వ్యతిరేకంగా బహిరంగ ఆరోపణలకు దిగిన సందర్భాలూ వున్నాయి. నాగలాపురం జడ్పీటీసీ సుజాత తనకు ఎలాంటి గుర్తింపు, విలువ దక్కడం లేదని ఆరోపిస్తూ గత జడ్పీ సర్వ సభ్య సమావేశంలో నేలపై బైఠాయించారు. 


ఇక సాధారణ కార్యకర్తలు తమకు పనులు జరగడం లేదని వాపోతున్నారు. ఇంటింటికీ టీడీపీ ఓ మోస్తరుగా జరిగినా దళిత తేజం మాత్రం సక్రమంగా జరగలేదు. మరోవైపు ఈ నియోజ‌క‌వ‌ర్గం ఎస్సీ వ‌ర్గానికి చెంది ఉండ‌డంతో ఇక్క‌డ అభివృద్దికి చంద్ర‌బాబు వేల కోట్లు ఖ‌ర్చు చేస్తున్నారు. అయినా కూడా త‌మ‌కు ఎలాంటి అభివృద్ధి జ‌ర‌గ‌డం లేద‌ని స్థానికులు చెబుతుండ‌డం గ‌మ‌నార్హం. దీంతో త‌మ‌ను తామే పాలించుకుంటామ‌ని, బ‌య‌ట నుంచి వ‌స్తున్న నాయ‌కులు త‌మ‌కు అవ‌స‌రం లేద‌ని ఇక్క‌డి నాయ‌క‌త్వం .. ఎమ్మెల్యేపై విమ‌ర్శ‌లు చేస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో స్థానికుల‌కే టికెట్ ఇవ్వాల‌ని కోరుతున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతుండ‌డం ఇక్క‌డ గ‌మ‌నించాల్సిన విష‌యం.


 ముఖ్యంగా ఈ టికెట్ రేసులో చిత్తూరు ఎంపీ శివ‌ప్ర‌సాద్ అల్లుడు వేణు గ‌ట్టి ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు. తాను స్థానికుడిన‌ని, మిగిలిన ఎవ‌రికి టికెట్ ఇచ్చినా స‌హించేది లేద‌ని ఆయ‌న ఇప్ప‌టికే త‌మ మామ శివ‌ప్ర‌సాద్ ద్వారా పార్టీలో కీల‌క నేత‌ల‌కు సిగ్న‌ళ్లు పంపిన‌ట్టు స‌మాచారం. ఇదిలావుంటే, టీడీపీలోనే మ‌రో స్థానిక నాయ‌కురాలు ప్ర‌య‌త్నాలను ముమ్మ‌రం చేస్తున్న‌ట్టు స‌మాచారం. దీంతో ఇప్పుడు స‌త్య‌వేడు టీడీపీలో సిట్టింగ్ ఎమ్మెల్యేకు వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ ల‌భించే ఛాన్స్ లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: