సీఎం ర‌మేష్‌.. ఈ పేరుకు పెద్ద‌గా ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. ఇటీవ‌ల క‌డ‌పకు ఉక్కు ఫ్యాక్ట‌రీని కేటాయించాల్సిందేన‌ని  ప‌ట్టుబ‌ట్టి దాదాపు ప‌ది రోజుల పాటు ఆమ‌ర‌ణ దీక్ష చేసిన టీడీపీ రాజ్య‌స‌బ స‌భ్యుడు సీఎం ర‌మేష్.. కు ఇప్పుడు సొంత పార్టీలోనే కొంద‌రు నాయ‌కులు బ్రేకులు వేస్తున్నారు. సీఎం ర‌మేష్‌కు వ్య‌తిరేకంగా తీవ్ర‌స్థాయిలో వ్యాఖ్య‌లు సైతం చేస్తున్నారు. ఈ ప‌రిణామం.. స్థానికంగా టీడీపీని బ‌జారు పాలు చేస్తోంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం క‌డ‌ప జిల్లాలో సీఎం ర‌మేష్ మంచి దూకుడుపై ఉన్నారు. వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు చెందిన జిల్లా కావ‌డంతో క‌డ‌ప‌లో టీడీపీ ఆధిక్యాన్ని పెంచాల‌ని ఆయ‌న చూస్తున్నారు. ఈ క్ర‌మంలోనే క‌డ‌ప ఉక్కు ఉద్య‌మాన్ని ఇక్క‌డే నిర్వ‌హించారు. ఆమ‌ర‌ణ దీక్ష‌తో దేశ‌వ్యాప్తంగా గుర్తింపు పొందారు. 


అయితే, సీఎం ర‌మేష్ దూకుడును స్థానిక నాయ‌కులు తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు. ప్ర‌ధానంగా  ప్రొద్దుటూరు నియోజక వర్గంలో ర‌మేష్‌కు వ్య‌తిరేకంగా గ‌ళాలు వినిపిస్తున్నాయి.నియోజవర్గ టీడీపీ ఇన్‌చార్జి వరదరాజులరెడ్డి  సీఎం ర‌మేష్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుప‌డుతున్నారు.  దీంతో ఒక్క‌సారిగా జిల్లాలో ర‌మేష్ వ్య‌వ‌హారం చ‌ర్చ‌కు వ‌చ్చింది. దీనికి కార‌ణాల‌పైనా చ‌ర్చించారు. సీఎం ర‌మేష్ ఇటీవ‌ల ప్రొద్దుటూరు మునిసిపాలిటీ అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు. దీనిపై తీవ్రంగా స్పందించిన వ‌ర‌ద‌రాజులు రెడ్డి గతంలో ఎప్పుడూ రాజ్యసభ సభ్యులు ప్రొద్టుటూరు మునిసిపాలిటీలో అధికారులతో సమీక్షను జరిపిన సందర్భాలు లేవన్నారు. మునిసిపల్‌ చైర్మన్‌ ఆసం రఘురామిరెడ్డిని పార్టీ ఇన్‌చార్జినైన తనను తన వర్గం కౌన్సిలర్లను పిలవకుండా సమీక్షలు జరపడాన్ని ఎట్టిప‌రిస్థితిలోనూ సహించబోమన్నారు.


వైసీపీ నుంచి వచ్చిన, సొంత పార్టీలో గెలిచిన కౌన్సిలర్లును సీఎం రమేష్‌ కొన్నారని వరద రాజులు ఆరోపించారు. ఇది బలం కాదు వాపు మాత్రమే అని తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శించారు. సీఎం రమేష్‌ జరిపిన సమీక్షపై తాము మునిసిపల్‌ చైర్మన్‌తో కలిసి మళ్లీ సమీక్ష జరుపుతామన్నారు. గ్రామానికి ఎక్కువ మండలానికి తక్కువైన ఆయన ఏ ఎన్నికల్లోనూ ప్రజలతో నేరుగా ఓట్లు వేయించుకుని గెలవలేదన్నారు. అటువంటి వ్యక్తి పెత్తనం ఇక ప్రొద్దుటూరులో చెల్లదన్నారు.  వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న‌స‌హాయం త‌మ‌కు అక్క‌ర్లేద‌ని, ఏదైనా ఉంటే క‌డ‌ప సెగ్మెంట్ వ‌ర‌కే చూసుకోవాల‌ని వ‌ర‌ద రాజులు సూచించారు. మొత్తానికి ఈ ఊహించ‌ని ప‌రిణామంతో సీఎం ర‌మేష్‌కు ఇబ్బందిక‌ర ప‌రిణామాలు ఎదుర‌య్యాయి. మ‌రి రాబోయే రోజుల్లో ఈ ప‌రిణామాలు ఎటు దారి తీస్తాయో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: