నిజం తెలుసుకుని మాట్లాడాలి! బ‌హుశ రాజ‌కీయాల్లో ఉన్న‌వారికి ఇలాంటి ప‌దాలు ఎబ్బెట్టుగా తోచ‌వ‌చ్చు! కానీ, తాను ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లో లేన‌ని, కేవ‌లం త‌మ జాతి కోసం మాత్ర‌మే ఆందోళ‌న చేస్తున్నామ‌ని ప‌దే ప‌దే చెప్పుకొంటున్న నిజాయితీప‌రుడిగా పేరు తెచ్చుకున్న మాజీ మంత్రి ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం వంటి వారు కూడా ప‌చ్చ క‌ళ్ల‌జోడు పెట్టుకుం టే ఎవ‌రు మాత్రం ఏం చేస్తారు? ఓ సామాజిక వ‌ర్గం అన్యాయానికి గురి కాకూడ‌ద‌నే రాజ్యాంగం రాసిన అంబేడ్క‌ర్ హిత‌వు ప‌లికారు. కానీ, ఓటు రాజ‌కీయాలు పెరిగిపోయిన నేటి రోజుల్లో.. అదే సామాజిక వర్గాల‌ను అడ్డుపెట్టుకుని అంద‌లాలు ఎక్కుతున్న రాజ‌కీయ అప‌ర చాణిక్యులకు మాత్ర‌మే రోజులు అన్న‌ట్టుగా ఉంది ప్ర‌స్తుత ఏపీ ప‌రిస్థితి! 


రాజకీయాలు తెలియ‌ని వ్య‌క్తికి ఏమైనా చెప్పొచ్చు. కానీ, రాజ‌కీయాల్లో ఉండి, రాజ‌కీయాలు చేసిన ముద్రగ‌డ వంటివారు కూడా సంయ‌మ‌నం కోల్పోయి.. ఓ వీధి నేతగా విమ‌ర్శ‌ల‌కు ఆవేశ‌కావేశాల‌కు పోతే.. నేటి త‌రం ఏం నేర్చుకుంటుంది?  జ‌గ‌న్ చెప్పిన వ్యాఖ్య‌లే ప‌ర‌మావ‌ధిగా దానిని త‌న‌కు అనుకూలంగా మ‌లుచుకోవ‌డంలో ప్ర‌స్తుతానికి ముద్ర‌గ‌డ హిట్ అయి ఉంటారు. కానీ, నిజానిజాలు, వాస్త‌వ ప‌రిస్థితులు తెలిసిన ఏ ఒక్క‌రూ కూడా జ‌గ‌న్ వ్యాఖ్య‌ల‌ను త‌ప్పు ప‌ట్ట‌లేద‌న్న విష‌యాన్ని ఈ సంద‌ర్బంగా ముద్ర‌గ‌డ గుర్తించాలి. బ‌హుశ..జ‌గ‌న్ వ్యాఖ్య‌ల్లోని నిజాల‌ను గ‌మ‌నించే ఏమో.. చంద్ర‌బాబు ఎదురు దాడి చేయ‌డం మానేశారు. ఒక వేళ రేపు కాపులు త‌న‌ను నిల‌దీసినా.. జ‌గ‌న్ వ్యాఖ్య‌ల‌ను ఆయ‌న త‌న‌కు అనుకూలంగా మార్చుకున్నా ఆశ్చర్యం లేదు. 


రాజ్యంగంలోని నిబంధ‌న‌లు స్ప‌ష్టంగా పేర్కొంటున్న విధంగానే ఏ రాష్ట్ర ప్ర‌భుత్వ‌మైనా.. ఎన్ని సామాజిక వ‌ర్గాల‌కైనా 50% మించి రిజ‌ర్వేష‌న్లు ఇవ్వ‌రాదు! ఈ విష‌యం సుస్ప‌ష్టం. పోనీ.. వీటిని కాద‌ని రిజ‌ర్వేష‌న్లు ఇచ్చినా.. నేడు త‌మిళ‌నాడులో ఇచ్చిన రిజ‌ర్వేష‌న్ల మాదిరిగా వాటిని 9వ షెడ్యూల్‌లో చేర్చినా.. ఇది ఎందుకూ కొర‌కాకుండానే ఉన్నాయ‌న్న క‌నీస విష‌యాన్ని ముద్ర‌గ‌డ ప‌రిశీలించ‌లేక పోతున్నారు. త‌మ‌కు ఇక‌, చంద్ర‌బాబే దిక్క‌ని, ఆయ‌న వ‌ల్లే త‌మ‌కు మేలు జ‌రుగుతుంద‌నిచెబుతున్న ముద్ర‌గ‌డ‌.. ఆనాడు త‌న కుటుంబం మొత్తాన్ని నిర్భంధించిన‌ప్పుడు ఏం చేయ‌గ‌ల‌గారు?  వాస్త‌వ విరుద్ధంగా మాట్లాడి.. న‌మ్మించి గొంతు కోయ‌డం రాజ‌కీయాల్లో ప్రారంభ‌మైతే.. అది ఎవ‌రికి న‌ష్టం?  


విజ్ఞులుగా పేరు తెచ్చుకున్న ముద్రగ‌డ వంటివారు మూస ధోర‌ణిలో ముంద‌కు సాగితే.. జాతికి చేస్తున్న‌ది న్యాయ‌మా? అన్యాయ‌మా? అనేది ప్ర‌శ్నార్థ‌క‌మ‌ వుతుంది. నేడు జ‌గ‌న్ చెప్పిన మాట‌లే చంద్ర‌బాబు చేసి చూపించారు. త‌న చేతుల్లో ఉన్న‌ది ఆయ‌న చేశారు. కేంద్రంప‌రిదిలోని అంశం జోలికి ఆయ‌న నేటికీ ఒక్క మాట కూడా మాట్లాడ‌లేదు. పైగా నిన్న గాక మొన్న అవిశ్వాసం పెట్టిన‌ప్పుడు కూడా కాపుల ప్ర‌స్తావన , తాము అసెంబ్లీ సాక్షిగా చేసిన తీర్మానాన్ని ఆయ‌న ప్ర‌స్తావించ‌లేదు. దీనిని బ‌ట్టి రాష్ట్రంలో కాపుల ప‌ట్ల ఎవ‌రు నిబ‌ద్ధ‌త‌తో వ్య‌వ‌హ‌రిస్తున్నారో .. ముద్ర‌గ‌డ  వంటి వారు గుర్తించాలి. లేక పోతే.. ఆ జాతే.. క్ష‌మించ‌ద‌న్న విష‌యం చ‌రిత్ర త‌ప్ప‌క తెలియ‌జేస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: