కాపు రిజర్వేషన్ అంశం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయంగా మంటలు రేపుతోంది. తాజాగా జగన్ చేసిన వాఖ్యలతో కాపు రిజర్వేషన్ అంశం మరో సారి తెరపైకి వచ్చింది. కాపుల రిజర్వేషన్ అంశం తమ పరిధిలోది కాదని... అది కేంద్ర పరిధిలోనిదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశాడు. ఈ వాఖ్యల పట్ల పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ వ్యాఖ్యల్లో రెండు కోణాలున్నాయి. ఒకటి జగన్ నిజాయితీగా తన పరిధిలోని అంశం కాదని తేటతెల్లం చేస్తూ తాను ఇస్తున్న హామీల పట్ల నిబద్ధతను చాటుకోవటం ఒకటి అయితే, కాపుల పట్ల చంద్రబాబు ఇచ్చిన హామీని ఎలాగూ నిలబెట్టుకోలేదు కాబట్టి, జగన్ తాను నిజాయితీగా కాపు కార్పొరేషన్ కి రెట్టింపు నిధులు ఇస్తానని ప్రకటన చేయటంతో కాపు వర్గాల్లో ఆ రకం సానుభూతి పొందటం. కానీ ఈ సానుభూతి ఎంతవరకు కాపు ఓటర్లలో కనబడుతుందన్నది ప్రశ్న. 


కాపులకు రిజర్వేషన్లు ఇవ్వలేమంటూ వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రకటన చేసి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించారు. ఈ వాఖ్యల పట్ల కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం జగన్ ని విమర్శించిన విషయం తెలిసిందే. ముందు నుండి ముద్రగడ పద్మనాభం జగన్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని తెలుగుదేశం పార్టీ నుంచి విమర్శలు ఎదుర్కుంటూ వచ్చారు.ముద్రగడను కూడా ఆగ్రహానికి గురి చేసే అవకాశం ఉందని, కాపులు వ్యతిరేకంగా మారే ప్రమాదం ఉందని గ్రహించకుండానే జగన్ ఆ ప్రకటన చేశారా అనేది ప్రశ్న. అది తెలిసి కూడా ఆ ప్రకటన చేశారంటే జగన్ వ్యూహం ఏమై ఉంటుందనేది ఆలోచించాల్సిన విషయం. జగన్ వ్యూహాత్మకంగానే ఈ ప్రకటన చేశారని కొందరు మేధావులు భావిస్తున్నారు. ఆ వ్యూహాత్మకం ఏమై ఉంటుందన్నది కాలమే నిర్ణయించాలి.


అది కూడా కాపులు అధికంగా ఉండే తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గాన్ని ఆ ప్రకటన చేయడానికి జగన్ ఎంచుకున్నారు. జగన్ ఆ ప్రకటన చేయడానికి రెండు కారణాలు కనిపిస్తున్నాయి. మొదటిదానికి వెళ్తే... చేయగలిగేది మాత్రమే జగన్ చెబుతాడనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్లడం. ఆ విషయాన్ని తన ప్రసంగంలో జగన్ కాస్తా స్పష్టంగానే చెప్పారు.కాపులకు రిజర్వేషన్లు కల్పించే విషయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనుసరించిన వైఖరి వల్ల అవి అమలయ్యే అవకాశం కనిపించడం లేదు. రిజర్వేషన్లు యాభై శాతానికి మించకూడదనే సుప్రీంకోర్టు ఆదేశాలు ఓ వైపు ఉండగా, అదనపు రిజర్వేషన్లు కల్పించే ఉద్దేశం తనకు లేదనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం చాలా కాలం క్రితమే స్పష్టం చేసింది. 


కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తూ శాసనసభలో తీర్మానం చేసిన చంద్రబాబు ప్రభుత్వం దాన్ని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ లో చేర్చాలని కోరింది. ఆ షెడ్యూల్ లో చేర్చాల్సింది కేంద్ర ప్రభుత్వమే. అందుకు కేంద్రం సుముఖంగా లేదు. యాభై శాతం రిజర్వేషన్లలోనే కాపు రిజర్వేషన్లను చేర్చాలంటే ప్రస్తుతం ఉన్న బీసీ రిజర్వేషన్లను తగ్గించాల్సి ఉంటుంది. అందుకు బీసీలు తీవ్ర వ్యతిరేకత ప్రదర్శిస్తున్నారు. అందువల్ల కాపులకు రిజర్వేషన్లను అమలు చేయడం అనేది సాధ్యమయ్యే విషయం కాదని అందరికీ తెలుసు. అయినా, చంద్రబాబు ప్రభుత్వం తప్పును కేంద్రం మీదికి నెట్టి కాపులను తనకు అనుకూలంగా మలుచుకోవాలని చూస్తోంది. 


కాపు రిజర్వేషన్ల విషయంలో చంద్రబాబు చేసేదంతా చేసినట్లే చెప్పుకుంటున్నారు. కాకుంటే, జగన్ ను ఇరకాటంలో పెట్టడానికి కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేయాల్సిందిగా తన పార్టీ ఎంపీలకు ఆదేశాలు ఇస్తున్నారు. ప్రత్యేక హోదాపై, విభజన హామీలపైనే వారి పోరాటాన్ని పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం కాపు రిజర్వేషన్లపై పోరాటం చేస్తే పట్టించుకుంటుందనే నమ్మకం బహుశా ఎవరికీ ఉండి ఉండదు. అందువల్ల కాపు రిజర్వేషన్ల అమలయ్యే పరిస్థితి లేదు కాబట్టి, చంద్రబాబు వాటిని అమలు చేయించలేరు కాబట్టి జగన్ కుండ బద్దలు కొట్టి ఉంటారు. ఏమైనా, ఇప్పుడు కాపు రిజర్వేషన్ల వివాదం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మంటలు రేపుతోంది.
Image result for chandrababu naidu
ఇదంతా పక్కన బెడితే చంద్రబాబు ఎన్నికల సమయంలో కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని, కోట్ల నిధులు కేటాయిస్తామని ఆశలు పెట్టి చివరకి కాపు సామజిక వర్గాన్ని ఊసురుమనిపించారు. చంద్రబాబు చేసిన వాగ్దనాలు నెరవేర్చక కాపు సామాజిక వర్గం మొత్తం ఒక రకంగా చంద్రబాబు కి వ్యతిరేక వర్గంగా తయారయ్యింది. ఇక తమ వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్ సామర్థ్యం అంతకు ముందే ప్రజారాజ్యం సమయంలో, మరియు 2014 సమయంలో ఆయన ప్రత్యేకంగా హామీ ఇచ్చి  రుచి చూసినందున ఇప్పుడున్న పరిస్థితుల్లో అప్పుడు వాళ్ళకి కనిపించిన ఒకే ఒక ఆశా కిరణం జగన్. కానీ జగన్ కూడా కాపు రిజర్వేషన్ విషయంలో తన ధోరణి వెల్లడి చేయటంతో కాపుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కానీ గుద్ది కంటే మెల్ల మేలు అన్నట్లుగా ఇంతకుమునుపే చంద్రబాబు చేతిలో మోసపోయిన కాపులకు తమకు ఇచ్చే నిధులకు తోడు రెట్టింపు నిధులిస్తానన్న జగన్ మేలేమో.  ఏదిఏమైనా కాపులు తమ సామాజిక వర్గ శ్రేయోభిలాషి ఎవరో కాపులే నిర్ణయించుకోవాల్సిన తరుణం వచ్చింది.


మరింత సమాచారం తెలుసుకోండి: