ఏపీలో వచ్చే ఎన్నికలలో ఒంటరి పోరుకు జగన్ రెడీ అయిపోయారు. దీనిపై ఇటీవల ఓ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో  ఆయన క్లారిటీ ఇచ్చారు. మరి మిగతా పార్టీల సంగతేంటన్న ప్రశ్న వచ్చినపుడు అధికార టీడీపీ కాంగ్రెస్ తో పొత్తుకు సై అంటోంది. దీనికి సంబంధించిన  సంకేతాలు చంద్రబాబు కొంతకాలంగా ఇస్తున్నారు. బీజేపీ కంటే కాంగ్రెస్ నయం అంటూ జనాన్ని ఒప్పించే పనిలో ఆయనా, అనుకూల మీడియా బిజీగా ఉన్నారు.


వారిద్దరూ చెప్పేసారుగా :


మరో వైపు కాంగ్రెస్ లో మళ్ళీ చేరిన మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఓ చానెల్ తో మాట్లాడుతూ టీడీపీ తొ పొత్తులపై పరోక్షంగా ఒప్పుకున్నారు. అధినాయకత్వం నిర్ణయిస్తుందంటూ కిరణ్ చెప్పినా టీడీపీ లో తనకు మిత్రులున్నారని కితాబు ఇవ్వడం కూడా ఆ రెండు పార్టీల ఫ్యూచర్ ప్లాన్ ని చెప్తోంది. అదే టైంలో తెలంగాణాకు చెందిన సీనియర్ నేత సర్వే సత్యనారాయణ కూడా చంద్రబాబుతో కాంగ్రెస్ పొత్తు ఉంటుందని చెప్పేశారు. అలాగే పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి కూడా పొత్తులు తన పరిధిలోనిది కాదు, రాహుల్ ఎలా చెబితే అలా అంటూ సన్నాయి నొక్కులు నొక్కారు. ఇదంతా చూస్తుంటే హస్తం, సైకిల్ కలవడం లాంచనమే అనిపిస్తోంది.


వాళ్ళదో కూటమి :


ఇంకో వైపు జనసేనాని పవన్, వామపక్షాలు మరో కూటమిగా ఎన్నికలలో తలపడబోతున్నాయి. చిత్రమేమిటంటే వామపక్షాలకు కూడా జగన్ కంటే బాబు అంటేనే కాసింత అభిమానం. ఈ మధ్య వైసీపీ బంద్ కి పిలుపు ఇస్తే కామ్రేడ్స్ పాల్గొనకపోవడాన్ని గుర్తు చేసుకోవాలి. ఇక కేంద్రంలో బీజేపీకి వ్యతిరేకంగా వామపక్షాలే ముందుంటాయి. ఆ విధంగా చూసినపుడు ఎన్నికల ముందైనా తరువాతైనా   కాంగ్రెస్ తో  కలిసేందుకు ఆ పార్టీలకు ఎటువంటి అభ్యంతరం లేకపోవచ్చు.


బీజేపీ ఒంటరి :


ఇంక ఏపీలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేయాలేమో. జగన్ ఆ పార్టీతో కలిసే అవకాశాలు లేవు. పవన్ కూడా ఏపీలో బీజేపీకి ఏముందని ఈ మధ్యనే సెటైర్లు వేశారు . పైగా కామ్రేడ్స్ అతన్ని వదిలిపెట్టరు కూడా.  సో బీజేపీ, వైసీపీ మాత్రమే రేపటి ఎన్నికలలో ఒంటరిగా పోటీకి దిగబోతున్నాయన్న మాట.


కింగ్ మేకర్లు వారేనట :


ఎన్నికల అనంతరం ఏపీలో ఏ పార్టీకి మెజారిటీ రాదని, తామే కింగ్ మేకర్లు అవుతామని కాంగ్రెస్ ఏపీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి గట్టిగా చెబుతున్నారు. జగన్ చెబుతున్నట్లుగా ఏపీలోవన్ సైడ్ గా  ఓటర్లు తీర్పు వైసీపీకి ఇస్తే ఒకే. లేకపోతే మాత్రం జనసేన కూటమి తో సహా అంతా ఎన్నికల తరువాత గ్రాండ్ అలయెన్స్ గా ఏర్పడి జగన్ కి కుర్చీ దక్కక్కనీయకుండా తమ వంతు పాత్ర పోషించే అవకాశాలు నూటికి నూరు శాతంఉన్నాయి. తెర వెనక పొత్తులు, ముందు పొత్తులు, ఎత్తులు చూస్తుంటే  అలాగే ఉన్నాయి. 



 లేటెస్ట్ న్యూస్ ఏంటంటే  చిరంజీవి మళ్ళీ యాక్టివ్ గా పాలిటిక్స్ చేస్తారట. కాంగ్రెస్ తరఫున ఆయన ప్రచారం కూడా చేస్తారట. అంటే ఇక్కడ చిరు ఉన్నా, అక్కడ పవన్ ఉన్నా, చంద్రబాబు మరో వైపు ఉన్నా అంతా రేపటి ఎన్నికల ముందూ తరువాత జగన్ కి ఎదురు నిలిచే వారే అనడంలో సందేహం లేదు. సో. జగన్ అండ్ టీం ప్లాండ్ గా పావులు కదపక పోతే దెబ్బేసేందుకు అంతా సిధ్ధంగా ఉన్నారన్నమాట.


మరింత సమాచారం తెలుసుకోండి: